Ap News: మూడు రోజులుగా తీవ్ర నిరసన.. వెనకడుగు వేసిన జగన్ సర్కార్

రుషికొండపై ప్రవేశానికి విధించిన రూ.20 ప్రవేశ రుసుంకు జనం నుంచి వచ్చిన నిరసన సెగతో వైసీపీ సర్కారు వెనకడుగువేసింది....

Update: 2023-07-10 11:59 GMT

దిశ, ఉత్తరాంధ్ర: రుషికొండపై ప్రవేశానికి విధించిన రూ.20 ప్రవేశ రుసుంకు జనం నుంచి వచ్చిన నిరసన సెగతో వైసీపీ సర్కారు వెనకడుగువేసింది. గత మూడు రోజులుగా సామాజిక మాధ్యమాల్లో తీవ్ర నిరసన వెల్లువెత్తడమే కాకుండా సందర్శనకు వెళ్లిన వారు కూడా ఆగ్రహం వ్యక్తం చేయడంతో వైసీపీ నేతలు పునరాలోచనలో పడ్డారు. ఎంతలా అంటే ఆదివారం మంత్రి గుడివాడ అమర్నాథ్‌ విలేకర్ల సమావేశంలో క్షణాల్లో మాట మార్చారంటే నగర వాసుల నిరసనలకు ఎంతగా భయపడ్డారో అర్ధమవుతోంది.

మూడేళ్ల కిందట రుషికొండ బీచ్‌కు బ్లూఫ్లాగ్‌ గుర్తింపు వచ్చింది. అప్పట్లో రూ.7 కోట్లతో వసతులు కల్పించారు. అన్ని కోట్లతో వసతులు కల్పించినప్పుడు మెంటైనెన్స్‌ కూడా ఆ స్థాయిలో చేయాలి. వచ్చిన సందర్శకులు తినుబండారాలు, ఇతరత్రా వస్తువులు అక్కడే పడేస్తారు. వాటన్నిటినీ మరుసటి రోజుకు శుభ్రం చేయాలి. ఇందుకోసం పారిశుద్ధ్య సిబ్బందిని ప్రత్యేకంగా కేటాయించాలి. వీరికి జీతభత్యాలు ఇవ్వాలి. గత మూడేళ్లుగా ఏ ఫీజుల లేకుండానే ఇప్పటి వరకు కొనసాగింది. కార్పొరేషన్‌ వాళ్లే పర్యావరణ రహితంగా ఆ బీచ్‌ను చూసుకునేవారు. నిర్వహణ కష్టతరమవడంతో ప్రయివేటు‌కు అప్పగించాలని రెండు, మూడు సార్లు టెండర్లు పిలిచారు. ముందుకు ఎవరూ రాలేదు. చివరకు వచ్చిన ప్రతి వ్యక్తి నుంచి రూ.20లు వసూలు చేసే ఒప్పందంతో ఓ కాంట్రాక్టర్‌ వచ్చారు. ఇందుకు అనుగుణంగా ఈ నెల 11వ తేదీ నుంచి (మంగళవారం) నుంచి ఈ ఫీజు వసూళ్లు చేయాలి. ఇంతలోనే మంత్రి అదేమీ లేదనడంతో పర్యటకులు ఊపిరిపీల్చుకున్నారు.

విశాఖ జిల్లాలో ఏ అవకాశం దొరికినా వదులుకోని మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుకు రుషికొండ బీచ్‌లో ప్రవేశానికి ఎంట్రీ ఫీజు దొరికింది. గతంలో స్టీల్‌ప్లాంట్‌ ప్రయివేటీకరణ చేయడానికి కేంద్రం కీలక ప్రకటన చేసినప్పుడు కూడా తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి స్పీకర్‌ తమ్మినేని సీతారాంకు పంపించారు. ఆయన దగ్గరే ఇంకా పెండింగ్‌లో ఉంది. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్ల రాజకీయంలో ఆ రాజీనామాను ఆమోదిస్తారని ఊహాగానాలు వచ్చినా వైసీపీ సర్కారు ఆ నిర్ణయం ఏమీ తీసుకోలేదు. ఎప్పుడూ వార్తల్లో ఉండే గంటా ఈసారి రుషికొండ ఎంట్రీ ఫీజులో మరింత యాక్టివ్‌ అవడానికి ముందడుగు వేశారు. నగర ప్రజలు ఎంట్రీ ఫీజు విషయంలో మండిపడుతున్నట్టు గమనించిన గంటా జనవాణిని అందిపుచ్చుకున్నారు. బీచ్‌ కూడా ఉచితం కాదా అంటూ ట్విట్టర్‌ ద్వారా ఆయన వైసీపీ మీద విరుచుకుపడ్డారు. విశాఖలో తాకట్టు పెట్టాలనుకున్నవన్నీ తాకట్టు పెట్టేశారు. అమ్మివేయాలనుకున్నవన్నీ అమ్మేశారు. కూల్చాలనుకున్నవి కూల్చేశారు. వేయాలనుకున్న పన్నులన్నీ వేసేశారు. ఇప్పుడేమో బీచ్‌ల వద్ద పార్కింగ్‌ ఫీజులు, ఎంట్రీ ఫీజులు అని ట్వీట్‌ చేశారు. అందమైన బీచ్‌లున్న విశాఖలో జనాలకు సేద తీరేందుకు అవకాశం ఇవ్వరా?, బ్లూఫాగ్‌గా గుర్తింపు పొంది అంతర్జాతీయ గుర్తింపు తెచ్చుకున్న రుషికొండ బీచ్‌లో కూర్చోవడానికి ఎంట్రీ ఫీజు ఎందుకంటూ గంటా నిలదీసినా...చివరకు ఆ నిర్ణయమే ఉపసంహరించుకోవడంతో గంటా తన గంటను మోగించకుండా వెనక్కి తీసుకున్నారు. ఎన్నికల ముందు ఏదో హడావుడి చేసి నగర ప్రజల నోట్లో నానుదామనుకుంటే ఇలా అయిందేమిటబ్బా అని గంటా మౌనం దాల్చారు. ఏమైతేనేం ఇది ప్రజా విజయమని గంటా ఓ ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు.

Tags:    

Similar News