Karanam Dharmashri: కాపు జాతికి ద్రోహం చేయవద్దు
కాపు జాతికి ఏ ఒక్కరు ద్రోహం చేయవద్దని, ఎవరు ఎక్కడ ఉన్నా అందరినీ సమానంగా ఆదరించాలన్నదే మిర్యాల వెంకటరావు సిద్ధాంతమని, దానికి ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉందామని రాష్ట్ర ప్రభుత్వ విప్, చోడవరం శాసనసభ్యుడు కరణం ధర్మశ్రీ పిలుపునిచ్చారు....
- ఐక్యత లేక ఎదగలేకపోయాం
- ఎక్కడ ఉన్నా అందరిని ఆదరించండి
- మిరియాల జయంతి వేడుకల్లో కరణం ధర్మశ్రీ
దిశ ఉత్తరాంధ్ర: కాపు జాతికి ఏ ఒక్కరు ద్రోహం చేయవద్దని, ఎవరు ఎక్కడ ఉన్నా అందరినీ సమానంగా ఆదరించాలన్నదే మిర్యాల వెంకటరావు సిద్ధాంతమని, దానికి ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉందామని రాష్ట్ర ప్రభుత్వ విప్, చోడవరం శాసనసభ్యుడు కరణం ధర్మశ్రీ పిలుపునిచ్చారు. రాయలసేన ట్రస్ట్ ఆధ్వర్యంలో విశాఖ సుబ్బలక్ష్మి కళ్యాణ మండపంలో దివంగత నేత మిరియాల వెంకటరావు 83వ జయంతి వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు. కార్య క్రమంలో పాల్గొన్న ధర్మశ్రీ మాట్లాడుతూ ఎన్నో సందర్భాల్లో ఐక్యతలేక పోవడం వల్లే పూర్తిగా ఎదగలేకపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. నాడు హనుమంతరావు ,శివ శంకర్ నుంచి నేటి బొత్స సత్యనారాయణ వరకు కూడా ఎంతో మంది ఉన్నత స్థాయికి వెళ్ళినప్పటికీ కూడా ఆశించిన స్థాయిలో ఎదగలేకపోయామన్నారు.
కాపు, తెలగ,బలిజ, ఒంటరి, మున్నూరు కాపులతో పాటు ఎవరు ఎక్కడ ఉన్నా, ఏ పార్టీలో ఉన్నా వారిని తప్పకుండా ఆదరించాలని కరణం ధర్మశ్రీ కోరారు. ఇతర సామాజిక వర్గాలను చూసి కాపులు కూడా ప్రణాళికలు మార్పు చేసుకోవాలన్నారు. ఒకే పార్టీలో ఉన్న అందరికీ న్యాయం జరిగే అవకాశం లేదన్నారు. మిరియాల వెంకటరావు కాపు జాతి ఔన్నత్యానికి ఎంతగానో పాటుపడ్డారని, తనకు విద్యార్థి దశ నుంచి ఆయనే మార్గదర్శకులు అని కరణం ధర్మశ్రీ తెలిపారు.
సింహాచలం దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యులు, విశాఖ అంతర్జాతీయ విమానాశ్రయం సలహా మండలి సభ్యులు గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ తమ సామాజిక వర్గాల వారికి సంపూర్ణ సహకారం అందిస్తూనే, ఇతర సామాజిక వర్గాలనీ కలుపుకుపోవాలన్నారు. అప్పుడే ఎవరైనా వారు కోరుకునే లక్ష్యం నెరవేరుతుందన్నారు.
రాయల సేన అధ్యక్షులు ఈశ్వర్ మాట్లాడుతూ క్రమం తప్పకుండా మిరియాలు వెంకట్రావు జయంతి, వర్ధంతి వేడుకలను క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నామన్నారు. భవిష్యత్తులో కూడా కాపు జాతి కోసం తమ వంతు కృషి చేస్తామన్నారు. తొలుత మిర్యాల వెంకట్రావు చిత్రపటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా పలు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించారు. పేదలకు దుప్పట్లు, చీరలు పంపిణి చేశారు. ఈ కార్య క్రమంలో కాపు సామాజిక నేతలు గాదె బాలాజీ, దొరబాబు, కరణం కళావతి, శ్యామలతో పాటు పెద్ద ఎత్తున నేతలు పాల్గొన్నారు.