Inhuman Incident: పసికందు మృతదేహంతో స్కూటీపై 120 కి.మీ ప్రయాణం
మనుషుల్లో మానవత్వం రోజు రోజుకు చచ్చిపోతోంది. మనిషికి డబ్బులు మీద ఉన్న ప్రేమ పక్కోడికి సాయం చేయాలనే ధ్యాస ఏకోశాన ఉండటం లేదు...
దిశ, డైనమిక్ బ్యూరో: మనుషుల్లో మానవత్వం రోజు రోజుకు చచ్చిపోతోంది. మనిషికి డబ్బులు మీద ఉన్న ప్రేమ పక్కోడికి సాయం చేయాలనే ధ్యాస ఏకోశాన ఉండటం లేదు. ఎంతసేపు తన అనే స్వార్థం తప్ప తనలాంటి వాడు కన్నీరు కారుస్తుంటే కనీసం కరుణించే మానవత్వం కూడా ప్రదర్శించడం లేదు. రోడ్డుపై వెళ్తున్నప్పుడు ఎవరికైనా ఏమైనా అయితే అయ్యోపాపం అంటాం...కానీ అలాంటి కనికరం కూడా చూడకుండా కొంతమంది వ్యవహరిస్తూ సభ్య సమాజానికి తలవంపు తెస్తున్నారు. ఇలాంటి అమానుష ఘటన విశాఖపట్నం కేజీహెచ్‌లో వెలుగులోకి వచ్చింది.
మానవత్వం మరిచిపోతున్న అంబులెన్స్ డ్రైవర్లు
బైక్ డ్రైవ్ చేస్తున్న తండ్రి. వెనుక సీట్లో తల్లి.. ఇద్దరి మధ్యలో చిన్నారి మృతదేహం. తల్లి ఒడిలో సేదతీరాల్సిన చిన్నారి మృత్యుఒడికి చేరి వారికి దు:ఖం మిగిల్చింది. ఆ సీన్ చూసిన ఎవరికైనా ఇలాంటి కష్టం పగవాడికైనా రాకూడనుకుంటాం. కానీ ఆస్పత్రుల వద్ద అంబులెన్స్ డ్రైవర్లు మనిషి చనిపోయినా వారి కుటుంబ పట్ల కనీసం మానవత్వంతో ప్రవర్తించడం లేదు. అంబులెన్స్ డ్రైవర్ల అరాచాకాలు..బేరసారాలు అప్పటికే దు:ఖంలో ఉన్న కుటుంబ సభ్యులను మరింత కన్నీరు పెట్టించేలా వ్యవహరిస్తున్నారు. ఇలాంటి ఘటనలు ఒక్కటి కాదు దేశవ్యాప్తంగా ఎన్నో జరిగాయి. అంబులెన్సు లేక కుమారుడి మృతదేహన్ని బైక్ మీద తీసుకెళ్లిన ఓ తండ్రి, తల్లి మృతదేహన్ని అంబులెన్స్‌లో తీసుకెళ్లే స్థోమత లేక రిక్షాలో శవాన్ని తీసుకెళ్లిన కొడుకు, చిన్న కొడుకు మరణిస్తే పెద్దకొడుకు ఒడిలో చిన్నోడిని పడుకోబెట్టి వెళ్ళిన తండ్రి ఇలా చెప్పుకుంటూ పోతే అనేక విషాదఘటనలు మన కళ్లముందు కదలాడుతూనే ఉంటాయి.
బిడ్డ మృతదేహంతో 120 కి.మీ.ప్రయాణం
వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఆస్పత్రుల్లో నాడు-నేడు వ్యవస్థతో అభివృద్ధి పరిచామని బల్లగుద్ది మరీ చెప్తోంది. అంతేకాదు అంబులెన్స్‌లను సైతం అనేకం ఉన్నాయి అని కూడా చెప్పుకొస్తోంది. కానీ అవి ప్రకటనలకు.. ప్రచారాలకు మాత్రమేనా అన్న సందేహం వస్తోంది. చనిపోయిన పసిబిడ్డ మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లేందుకు అంబులెన్స్‌లను ఆస్పత్రి సిబ్బంది చేర్చలేని దౌర్భాగ్య పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వ ఆస్పత్రులు ఉన్నాయి. గతంలో తిరుపతి రుయా, నెల్లూరులో చోటు చేసుకున్న ఘటనలను తలపించేలా విశాఖపట్నంలోని కేజీహెచ్‌లో మరో సీన్ వెలుగులోకి వచ్చింది.
వివరాల్లోకి వెళ్తే అల్లూరి సీతారామరాజు జిల్లా ముంచింగిపుట్టు మండలం కుమడకు చెందిన దంపతులకు ఓ పాప పుట్టింది. అయితే పాప అనారోగ్యం పాలవ్వడంతో విశాఖలోని కేజీహెచ్‌కు తీసుకు వెళ్లారు. ఆస్పత్రిలో చిన్నారి మృతి చెందింది. అయితే మృత్యువాత పడిన తమ బిడ్డని తిరిగి ఇంటికి తీసుకెళ్ళేందుకు అంబులెన్స్ కావాలని పసికందు తల్లిదండ్రులు ఆస్పత్రి సిబ్బందిని వేడుకున్నారు. బోరున విలపించారు. అయినప్పటికీ వారి మనసులు కరగలేదు. కాళ్లా వేళ్లా పడ్డా కనికరించలేదు. దీంతో చేసేది లేక ఆ తల్లిదండ్రులు తమ బిడ్డ మృతదేహాన్ని చేతుల్లో పెట్టుకుని స్కూటీపై 120 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాడేరుకి ప్రయాణించారు.
ఆస్పత్రి వివరణ ఏంటంటే?
120 కిలోమీటర్లు మృతదేహాన్ని తల్లిదండ్రులు తరలించారు. స్కూటీపై వెనుక కూర్చుని ఉన్న తల్లి తన ఒడిలో పసికందు మృతదేహాన్ని చూసి కుమిలిపోయింది. పుట్టిన 15 రోజులకే తనను వదిలి వెళ్లిపోవడంతో కుమిలిపోయింది. అయితే బైక్‌పై పసికందు మృతదేహాన్ని తీసుకు వస్తున్న విషయం తెలుసుకున్న పాడేరు ఆస్పత్రి సిబ్బంది అంబులెన్స్ ఏర్పాటు చేశారు. అక్కడ నుంచి ముంచింగిపుట్టు మండలం కుమడకు పసికందు మృతదేహాన్ని తరలించారు.
ఎంత బతిమిలాడినా కరుణించని సిబ్బంది
అయితే అంబులెన్స్ కోసం ఎంత బతిమిలాడినా విశాఖ కేజీహెచ్ సిబ్బంది కరుణించలేదని... సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే తమ బిడ్డను కోల్పోయామని తల్లిదండ్రుల కన్నీటి పర్యంతమయ్యారు. అయితే పసికందుకు సంబంధించిన కేసు షీట్లు వచ్చిన15 నిమిషాల వ్యవధిలోనే అంబులెన్స్‌ను ఏర్పాటు చేస్తామని ఆ ప్రక్రియ పూర్తికాకుండానే ఆ దంపతులు...పసికందు మృతదేహాన్ని బైక్‌పై తీసుకెళ్లిపోయారని ఆస్పత్రి సిబ్బంది వెల్లడించారు. అంబులెన్స్ ఏర్పాటు చేసే లోపే శిశువు మృతదేహం తీసుకుని వెళ్ళిపోయారని ఆస్పత్రి సిబ్బంది తెలిపారు. తల్లిదండ్రులకు ఫోన్ కూడా చేశామని, అయితే అప్పటికే తాము మృతదేహంతో వెళ్లిపోతున్నామని చెప్పినట్లు పేర్కొన్నారు. దీంతో పాడేరులో మాట్లాడి వాహనాన్ని సమకూర్చగలిగామని చెప్పారు. అయితే ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రభుత్వం, ఆస్పత్రి అంబులెన్స్ సిబ్బందిపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Also Read...