ఎవరో కడప రెడ్లొచ్చి.. ఇక్కడి భూములు దొబ్బేస్తామంటే కుదరదు : మంత్రి ధర్మాన హాట్ కామెంట్స్
ఎవడో సుబ్బారెడ్డి అంట.. కడప నుంచి వచ్చి భూములు దొబ్బేస్తామంటున్నాడు అంటూ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి పేరు వచ్చేలా మంత్రి ధర్మాన ప్రసాద్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు.
దిశ ప్రతినిధి, విశాఖపట్నం:‘‘ఎవడో సుబ్బారెడ్డి అంట.. కడప నుంచి వచ్చి భూములు దొబ్బేస్తామంటున్నాడు’’ అంటూ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి పేరు వచ్చేలా మంత్రి ధర్మాన ప్రసాద్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ధర్మాన చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఇది వైకాపా ఉత్తరాంధ్ర ఇన్చార్జి వైవీ సుబ్బారెడ్డిని ఉద్దేశించి చేసినవా లేక కడప సుబ్బారెడ్డి వేరా అనే చర్చ నడుస్తోంది. ఎవరైనా ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో సొంత పార్టీ నేతలపై మంత్రి ఇలాంటి కామెంట్స్ చేయడం వైఎస్సార్సీపీ నేతల్లో కలవరం రేపుతోంది.
ఇంతకీ ధర్మాన ఏమన్నారు?
సోమవారం శ్రీకాకుళంలో జరిగిన వ్యాపారుల సమావేశంలో మాట్లాడుతూ ప్రజా ప్రతినిధులు అవినీతికి దూరంగా ఉండాలని, ఒకరి ఆస్తి కోసం కక్కుర్తి పడే మనస్తత్వం ఉండకూడదని, అయాచితంగా దోబ్బేయాలనుకోకూడదని మంత్రి ధర్మాన ప్రసాద్ రావు అన్నారు. నాయకుడు అవనితీకి పాల్పడకూడదని.. ఎవరు చేస్తున్నా చేయనివ్వకూడదన్నారు. ఈ విధానాన్ని కచ్చితంగా తాను పాటిస్తానని తెలిపారు. శ్రీకాకుళానికి తాను చేసిన అభివృద్ధి ఎవరూ చేయలేదన్నారు. ‘‘కడప నుంచి ఎవడో సుబ్బారెడ్డి వచ్చి.. నేను భూములు దొబ్బేస్తామన్నాడు. నువ్వు ఎవడివి..? శ్రీకాకుళం నీ.. అబ్బసొమ్ముకాదు. వచ్చిన వాడు ఏ పార్టీ అనేది చూడను. అక్కడ నుంచి వచ్చి ఇక్కడ అజమాయిషీ చేస్తామనుకుంటారు. అలాంటివి అవమానంగా భావిస్తా. శ్రీకాకుళంలో వనరులున్నాయనే పక్క జిల్లాల నుంచి వచ్చేస్తున్నారు. ఇలా వదిలేస్తే రౌడీ మయం అయిపోతుంది. రౌడీల చేతిలోకి వెళ్లిపోతుంది. మిగతా ప్రాంతాలు ఇలానే పాడై పోతున్నాయి. ప్రశాంతంగా పట్టణాలు ఉండాలి. దశాబ్దాలుగా.. శ్రీకాకుళం ప్రశాంతంగా ఉండాలనే చూస్తున్నా. ఇన్ని చేసినా నేను పనికి రాకపోతే.. మీ (నియోజకవర్గ ప్రజలు) ఇష్టం. విజ్ఞతతో ఆలోచించండి. మీ అభిమానంతోనే గెలుస్తూ వస్తున్నా. జిల్లాలో ఎక్కడైనా నేను గెలుస్తా.. కానీ శ్రీకాకుళంలో వేరేవారు గెలవరు. మిగతా వారు కనీసం అభివృద్ధి కూడా చేయలేరు. గెలిస్తే శక్తివంతంగా ఉంటా.. ఓడితే స్నేహితుడిగా ఉంటా’’ అని మంత్రి ధర్మాన ప్రసాద్ రావు అన్నారు. ఇంతకీ ఆ సుబ్బారెడ్డి ఎవరనే చర్చ నడుస్తుంది. అయితే ధర్మాన తన కుమారుడికి వైసీపీ టికెట్ ఆశించగా అందుకు వైవీ సుబ్బారెడ్డి అడ్డుపడ్డారనే వార్త గతంలో వచ్చాయి. కుమారుడికి సీటు విషయంలో పార్టీపై అసంతృప్తితో ఉన్న మంత్రి. సుబ్బారెడ్డిపై ఇలాంటి వ్యాఖ్యలు చేసివుండవచ్చనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.