గంటాను నమ్మేదెలా?
మాజీ మంత్రి గంటా శ్రీనివాస రావును తెలుగుదేశం అధిష్టానం నమ్మడం లేదు. రాజకీయ పార్టీలకు అతీతంగా ఆయన వివిధ పార్టీల నేతలతో ఆయన చేసే స్నేహాలను చూసి అధిష్టానం కలవర పడుతోంది.
దిశ ప్రతినిధి, విశాఖపట్నం: మాజీ మంత్రి గంటా శ్రీనివాస రావును తెలుగుదేశం అధిష్టానం నమ్మడం లేదు. రాజకీయ పార్టీలకు అతీతంగా ఆయన వివిధ పార్టీల నేతలతో ఆయన చేసే స్నేహాలను చూసి అధిష్టానం కలవర పడుతోంది. విశాఖ పార్లమెంట్‌లో గంటా శ్రీనివాసరావుకు ఎక్కడ టికెట్ ఇచ్చినా తన వైఎస్సార్ కాంగ్రెస్ నుంచి ఎంపీగా బరిలోకి దిగుతున్న తన స్నేహితుడు బొత్స సత్యనారాయణ భార్య ఝాన్సీ కి క్రాస్ ఓటింగ్ చేయిస్తారనే అనుమానం అధిష్టానాన్ని వెంటాడుతోంది. ఆ కారణంగానే గంటా ఎంత గట్టిగా తనకు భీమిలి సీటు కావాలని అడిగినా కుదరదు. కావాలంటే చీపురుపల్లి వెళ్లి బొత్స మీద పోటీ చేయండి’ అని కుండబద్దలు కొడుతోంది.
భరత్ ఓటమికి గంటానే కారణమా?
2019 ఎన్నికల్లో గంటా శ్రీనివాసరావు విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి పోటీ చేసి 67 వేల ఓట్లు తెచ్చుకొన్నారు. అదే నియోజకవర్గంలో తెలుగుదేశం ఎంపీ అభ్యర్థి ఎం.భరత్ కు 60 వేల ఓట్లు మాత్రమే వచ్చాయి. చివరకు భరత్ 4414 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఆ నియోజక వర్గంలో ఎంఎల్ఏ, ఎంపీ అభ్యర్థుల మధ్య వచ్చిన ఆ వ్యత్యాసం ఓటమికి కారణమైందని తెలుగుదేశం పార్టీ విశ్వసిస్తోంది. ఆ ఎన్నికల్లో జనసేన అభ్యర్థిగా పోటీ చేసిన గంటా మరో స్నేహితుడు జేడీ లక్ష్మీ నారాయణకు 40 వేల ఓట్లు రాగా, అక్కడ ఎంఎల్ఏగా పోటీ చేసిన పసుపులేటి ఉషాకిరణ్‌కు 20 వేల ఓట్లే వచ్చాయి. జేడీ సొంత ఇమేజ్ తో పాటు గంటా చేయించిన క్రాస్ ఓటింగ్ ఈ తేడాకు కారణమని అంటున్నారు.
జేడీ కోసం సీటు త్యాగం..
జేడీ కొత్తగా జై భారత్ నేషనల్ పార్టీ పెట్టి విశాఖ ఉత్తర నుంచి పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. గత ఎన్నికల్లో జనసేన విశాఖ సీటు ఇవ్వడంతో ఆయన ఇక్కడ నుంచి పోటీ చేయడం మినహా విశాఖతో ఆయనకు ఏం సంబంధం లేదు. అనంతపురం జిల్లాకు చెందిన జేడీ విశాఖ ఉత్తరను ఎంచుకోవడం వెనుక గంటా హస్తం, ఆమోదం ఉందని తెలుగుదేశం అనుమానిస్తోంది. ఆ కారణంగానే గంటా పక్షం రోజుల క్రితమే తాను ఉత్తర నుంచి ఈసారి పోటీ చేయడం లేదని పార్టీ అధిష్టానం అభిప్రాయంతో, ఆమోదం తో సంబంధం లేకుండా ప్రకటించారు.
భీమిలి ఇస్తే ఝాన్సీకి అనుకూలంగా గంటా క్రాస్?
గంటా కోరినట్లు భీమిలి సీటు ఇస్తే వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ కి అనుకూలంగా ఎంపీ ఓటును క్రాస్ చేయించే ప్రమాదం ఉందని తెలుగుదేశం అధిష్టానం అనుమానిస్తోంది. యువ నేత లోకేశ్‌కు స్వయానా తోడల్లుడైన భరత్ ఈసారి కూడా ఎంపీ అభ్యర్థి అయినందున ఆయనకు మరోసారి ద్రోహం జరిగే చర్యలను ఆదిలోనే అడ్డుకోవాలని భావిస్తున్నారు. ఇందులో భాగంగానే గంటా ఎన్ని ప్రయత్నాలు చేసినా సీటు మాత్రం ఖరారు చేయడం లేదు.
సీటు ఇవ్వాల్సివస్తే విశాఖ బయటే
ఏవో సమీకరణలలో, ఏదో ఒత్తిడితో గంటాకు తెలుగుదేశం టికెట్ ఇవ్వాల్సిన పరిస్థితులు ఏర్పడితే అనకాపల్లి, విజయనగరం పార్లమెంట్‌లో టికెట్ ఇవ్వాలని భావిస్తున్నట్లు తెలిసింది. గతంలో మంత్రి హోదాలో కడప జిల్లా ఇన్చార్జిగా పనిచేసిన గంటా కీలకమైన వైసీపీ నేతలతోనూ సంబంధాలు నెరుపుతున్నారు. ఆ కారణంగానే గంటాపై వచ్చిన భూ కబ్జాలపై తెలుగుదేశం ప్రభుత్వంలో వేసిన సిట్ నివేదికను వైఎస్సార్ కాంగ్రెస్ కూడా బయటపెట్టలేదని తెలిసింది. గంటా విశాఖ పరిధిలో టికెట్ సంపాదించి గెలిస్తే ఆ తరువాత పాత పరిచయాలతో వైసీపీ నేతల భూకబ్జాలను పరిరక్షిస్తారనే అనుమానం కూడా తెలుగుదేశంలో ఉండటం గమనార్హం.