Ap News: ఉమెన్స్ డే రోజు కూడా కష్టాలే.. పట్టించుకునే నాథుడెవరు..?
అల్లూరి జిల్లా జి. మాడుగులలో వేసవికి ముందే తాగు నీటి కష్టాలు బెంబేలెత్తిస్తున్నాయి....
దిశ, జి మాడుగుల: అల్లూరి జిల్లా జి. మాడుగులలో వేసవికి ముందే తాగు నీటి కష్టాలు బెంబేలెత్తిస్తున్నాయి. చుక్క నీటి కోసం కటకటలాడాల్సిన పరిస్థితి నెలకొంది. ఇక్కడ ఏర్పాటు చేసిన తాగు నీటి పథకాలు చుక్క నీరు రాల్చడం లేదు. ఇంటింటికి కుళాయి పేరుతో చేసిన ఏర్పాట్లుతో కోట్లాది రూపాయలు మట్టి పాలు అయ్యాయి. ప్రభుత్వాలు మారుతున్నా తాగునీటి కష్టాలు గట్టెక్కడం లేదని ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. ఇటీవల పాలక పార్టీ వైసీపీని గడపగడపకి కార్యక్రమంలో ఇదే విషయంపై ప్రజలు నిలదీశారు. దీంతో జి మాడుగుల ప్రజాప్రతినిధులు తప్పించుకు తిరుగుతున్నారు.
కాంట్రాక్టర్ల జేబుల్లోకి కోట్ల రూపాయలు
మరోవైపు ఇక్కడ కేటాయించిన మంచినీటి పథకాలు ప్రజా ప్రతినిధుల అండతో కాంట్రాక్టర్ల జేబుల్లోకి చేరిపోయాయని ఆరోపణలు వెలివెత్తుతున్నాయి.కేంద్ర ప్రభుత్వం నిధులతో జలకల పథకంలో బోరు తీయించి సుమారు 6 నెలలైనా మోటార్ బిగించడం మరిచారు. గత ప్రభుత్వంలోని తాగునీటి పథకాల కోసం కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి ఇంటింటికి కుళాయి అనే పథకం పేరుతో జి మాడుగులతో పాటు సుమారు ఐదు కిలోమీటర్ల వరకు ప్రతి ఇంటి ముందు మంచినీటి ట్యాప్‌లు బిగించారు. పైపులైన్లు, వాటర్ ట్యాంకులు, మరమ్మతులు, కొత్త వాటర్ ట్యాంకులు ఆర్బాటాలు చేశారు. తీరా చూస్తే అవి అలంకార ప్రాయంగా మారాయి. అప్పటినుండి జి.మాడుగుల రామాలయం, మెయిన్ రోడ్డు, జీపు స్టాండు తదితర ప్రాంతాల్లో మంచినీళ్లు కోసం సుదూర ప్రాంతాలు వెళ్లి బైకులు, ఆటోలతో తెచ్చుకుంటూ ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఈ నీరు తాగడం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నీటి విషయమై అటు వైద్యులు కూడా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
సమస్యను పట్టించుకోని అధికారులు
అయితే గత ప్రభుత్వానికి సంబంధించిన పెండింగ్ నిధులతో ప్రస్తుత ప్రభుత్వం సోలార్ మోటార్ బోరింగ్ పంపులు కొన్నిచోట్ల వేయించారు. అయితే అవి కొన్ని చోట్ల అలంకారప్రాయంగా దర్శనమిస్తున్నాయి. స్థానిక తహశీల్దార్ జంక్షన్ వద్ద, జీపు స్టాండ్, మెయిన్ రోడ్డు సుమారు 150 ఇళ్లకు మంచినీటి సౌకర్యం ఉంటుందనే ఉద్దేశంతో మోటార్ బోరింగ్ వేయించారు. అయితే దాని సోలార్‌సిస్టం, ట్యాంక్ సక్రమంగా లేకపోవడంతో మంచినీటి కోసం ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనిపై ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా కనీసం స్పందించలేదని ప్రజలు వాపోతున్నారు. ఎండా కాలం ప్రారంభంలోనే మంచినీటి కోసం చాలా ఇబ్బంది ఉంటే రానున్న రోజుల్లో ఇంకెంత ఇబ్బందులు ఉంటాయోనని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఉత్తరాంధ్ర ఇంఛార్జి అయినా పట్టించుకోరా..?
ఎన్నికలు వచ్చినప్పుడు ప్రజా ప్రతినిధులు, ప్రతిపక్షంలో ఉన్న మాజీలు ఇంటికొచ్చి ఓట్లు అడుగుతారని, మంచినీళ్లు సమస్య పట్టించుకోండి మహాప్రభో అంటున్నా ఎవరూ పట్టించుకోలేదని జి. మాడుగుల వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు, ప్రజా ప్రతినిధులు స్పందించి జి మాడుగుల మంచి నీటి కష్టాలు తీర్చాలని స్థానికులు కోరుతున్నారు. జి మాడుగుల నీటి సమస్యపై ఉత్తరాంధ్ర ఇంచార్జిగా బాధ్యతలు తీసుకున్న వైవి సుబ్బారెడ్డి దృష్టి సారించాలని స్థానికులు కోరుతున్నారు.