Mro Murder Case: కీలకంగా కాల్ డేటా.. కస్టడీలో పలు సంచలన విషయాలు

విశాఖ రూరల్ ఎమ్వార్వో రమణయ్య హత్య కేసు విచారణను పోలీసులు ముమ్మరం చేశారు...

Update: 2024-02-10 15:45 GMT

దిశ, వెబ్ డెస్క్: విశాఖ రూరల్ ఎమ్వార్వో రమణయ్య దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. అయితే ఈ కేసు విచారణను పోలీసులు ముమ్మరం చేశారు. నిందితుడిని కస్టడీలోకి తీసుకున్నారు. ఐదు రోజుల కస్టడీలో భాగంగా శనివారం రెండోరోజు నిందితుడు గంగారాంను పలు కోణాల్లో విచారించారు. రమణయ్య హత్య వెనుక ఎవరి ప్రోద్బలమైనా ఉందా అని ఆరా తీశారు. గంగారం కాల్ డేటా ఆధారంగా పలు ప్రశ్నలు సంధించారు. రమణయ్య హత్యకు ముందు పలువురికి నిందితుడు కాల్ చేసినట్లు తెలుస్తోంది. ఆ వివరాలనూ పోలీసులు పరిశీలిస్తున్నారు. భూ లావాదేవీలే కాకుండా ఇంకేమైనా వివాదాలు ఉన్నాయా అనే కోణంలోనూ పోలీసులు విచారిస్తున్నారు. మరో మూడు రోజుల పాటు నిందితుడు గంగారంను పోలీసులు విచారించనున్నారు. అయితే పలు కీలక ఆధారాలు సేకరించినట్లు తెలుస్తోంది. 

కాగా విశాఖ రూరల్ ఎమ్మార్వో రమణయ్యను రియల్టర్ గంగారం రాడ్డుతో తలపై కొట్టి పారిపోయారు. ఈ దాడిలో రమణయ్య తలకు బలమైన గాయం కావడంతో ఆయనను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ రమణయ్య మృతి చెందారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడు గంగారాంను గుర్తించారు. దాడి తర్వాత గంగారాం తమిళనాడులోని ఎగ్మోర్‌కు పారిపోయారు. నిందితుడి కోసం గాలించి పట్టుకున్న పోలీసులు.. గంగారంను కోర్టులో ప్రవేశ పెట్టారు. కోర్టు 14 రోజుల పాటు ఆయనకు రిమాండ్ విధించింది. అయితే ఈ కేసులో మరికొన్నివిషయాలు రాబట్టడం కోసం పోలీసులు నిందితుడిని కస్టడీకి ఇవ్వాలని కోర్టును కోరారు. దీంతో నిందితుడిను కోర్టు ఐదు రోజుల పాటు కస్టడీకి ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది. దీంతో గంగారాంను పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు.


Similar News