పర్యాటకుల భద్రతకు అధిక ప్రాధాన్యం ఇస్తూ బ్రిడ్జి నిర్వహణ : జిల్లా కలెక్టర్
అత్యంత సుందరీకరణ నగరంగా పర్యాటక కేంద్ర బిందువుగా పేరుగాంచిన విశాఖ మహానగరం దేశంలోనే ప్రత్యేకమని, పర్యాటక రంగానికే తలమానికంగా నిలవనుందని రాజ్యసభ సభ్యులు వైవీ సుబ్బారెడ్డి అభివర్ణించారు.
దిశ ప్రతినిధి, విశాఖపట్నం: అత్యంత సుందరీకరణ నగరంగా పర్యాటక కేంద్ర బిందువుగా పేరుగాంచిన విశాఖ మహానగరం దేశంలోనే ప్రత్యేకమని, పర్యాటక రంగానికే తలమానికంగా నిలవనుందని రాజ్యసభ సభ్యులు వైవీ సుబ్బారెడ్డి అభివర్ణించారు. ఆర్ కే బీచ్ లో వీఎంఆర్డీఏ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫ్లోటింగ్ బ్రిడ్జి(నీటిపై తేలియాడే వంతెన)ను రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, జిల్లా కలెక్టర్ డా.ఎ. మల్లిఖార్జున, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి ఆదివారం ఆయన ప్రారంభించారు. ప్రాజెక్టు ప్రారంభోత్సవం సందర్భంగా రాజ్యసభ సభ్యులు వైవీ సుబ్బారెడ్డి, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, జిల్లా కలెక్టర్ డా.ఎ. మల్లిఖార్జున, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి, నెడ్ క్యాప్ ఛైర్మన్ కె.కె. రాజు, మళ్ల విజయప్రసాద్, వీఎంఆర్డీఏ కార్యదర్శి డి. కీర్తి తదితరులు కాసేపు ఫ్లోటింగ్ బ్రిడ్జిపై నడిచి పనితీరును పరిశీలించారు.ఈ సుబ్బరెడ్డి సుమారు రూ.1.60 కోట్ల వ్యయంతో ఫ్లోటింగ్ బ్రిడ్జిని అందుబాటులోకి తీసుకొచ్చామని గుర్తు చేశారు. కైలాసగిరి వద్ద రూ.5 కోట్లతో స్కై బ్రిడ్జి నిర్మాణానికి ప్రతిపాదించామని, అది కూడా త్వరలోనే అందుబాటులోకి వస్తుందని వెల్లడించారు.
జిల్లా కలెక్టర్ డా.ఎ. మల్లిఖార్జున మాట్లాడుతూ పర్యాటకులను విశేషంగా ఆకట్టుకోవటంతో పాటు, వారి భద్రతకు కూడా అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నామని పేర్కొన్నారు. ఫ్లోటింగ్ బ్రిడ్జి నిర్వహణను పర్యవేక్షించేందుకు గాను వీఎంఆర్డీఏ నుంచి ఒక అధికారి ఉంటారని వెల్లడించారు. పర్యాటకులు వంతెనపై వెళ్లినప్పుడు వారి గూండా నిత్యం అటూ ఇటూ రెండు బోట్లు సంచరిస్తాయని, గజ ఈతగాళ్లు ఉంటారని తెలిపారుపర్యాటకులకు తప్పకుండా లైఫ్ జాకెట్లు ధరించాలని చెప్పారు. తుఫాన్లు, అధిక అలలు వచ్చే అమావాస్య, పౌర్ణమి వంటి రోజుల్లో బ్రిడ్జిని నిర్వహించవద్దని హెచ్చరించారు. ఉదయం 8.00 నుంచి సాయంత్రం 6.00 గంటల వరకు మాత్రమే ఆపరేషన్స్ ఉండాలని సూచించారు. మెయింటెనెన్స్, అధికారుల తనిఖీకి సంబంధించి ప్రత్యేక రిజస్టర్లు, సీసీ కెమెరాలు పెట్టాలని చెప్పారు.కార్యక్రమంలో పోలీస్ కమిషనర్ డా.ఎ. రవిశంకర్, జీవీఎంసీ కమిషనర్ సీయం సాయికాంత్ వర్మ, జాయింట్ కలెక్టర్ కె. మయూర్ అశోక్, వీఎంఆర్డీఏ జాయింట్ కమిషనర్ రవీంద్ర, కార్యదర్శి డి.కీర్తి, ఇతర అధికారులు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.