Visakha: తక్షణమే ఉద్యోగాలు భర్తీ చేయండి... ఏఐవైఎఫ్ డిమాండ్
కలెక్టరు కార్యాలయల వద్ద అఖిల భారత యువజన సమాఖ్య- ఏఐవైఎఫ్ రాష్ట్ర సమితి నిరసన వ్యక్తం చేసింది. ..
దిశ, ఉత్తరాంధ్ర: కలెక్టరు కార్యాలయల వద్ద అఖిల భారత యువజన సమాఖ్య- ఏఐవైఎఫ్ రాష్ట్ర సమితి నిరసన వ్యక్తం చేసింది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలు తక్షణమే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. చెవిలో పువ్వులు పెట్టుకొని మోకాళ్ళపై ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షుడు అచ్యుత రావు, జిల్లా ప్రధాన కార్యదర్శి వై.రాంబాబు మాట్లాడుతూ ప్రాథమిక పరీక్షలో అర్హత సాధించిన పోలీస్ కానిస్టేబుల్, ఎస్ఐ అభ్యర్థులకు వెంటనే పిజికల్ ఈవెంట్స్ నిర్వహించాలని డిమాండ్ చేశారు. పశు సంవర్ధక శాఖలో ఖాళీగా ఉద్యోగాలను భర్తీ చేయాలని కోరారు. ఏపీపీఎస్సీ గ్రూప్ 1, 2తోపాటు వివిధ శాఖల్లోని ఖాళీలను భర్తీ చేయాలని, మెగా డీఎస్సీ విడుదల చేసి ఖాళీగా ఉన్న 55 వేల ఉపాధ్యాయ ఉద్యో గాలు భర్తీ చేయడంతో పాటు, గ్రామ వార్డు సచివాలయాల్లో ఖాళీగా ఉన్న 20 వేల ఉద్యోగాలు సైతం భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. అలాగే కళాశాలలు, విశ్వవిద్యాలయ అధ్యాపక ఉద్యోగాలు భర్తీ చేయాలని విజ్ఞప్తి చేశారు.
వివిధ శాఖలలోని ఇంజనీరింగ్ ఉద్యోగాలు భర్తీకి కృషి చేయాలని సూచించారు. ప్రాథమిక (ప్రిలిమ్స్), ప్రధాన (మెయిన్స్ ) పరీక్ష విధానం రద్దు చేసి ఒకే పరీక్ష నిర్వహించి నెగిటివ్ మార్క్‌లు పెట్టవద్దని కోరారు. ఏపీపీఎస్సీ, ఇతర ఉద్యోగ నియామక పరీక్షల ప్రశ్నా పత్రాలు తెలుగులో తయారు చేయాలన్నారు. ప్రతి జిల్లాలో ఉద్యోగాలకు ప్రభుత్వ శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేయాలని కోరారు. కస్తూరి బాలికల పాఠశాల్లో ఇంటర్మీడియెట్‌కి సంబంధించిన ఇంగ్లీష్, తెలుగు జె.ఎల్‌లను తీసివేయాలనే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు