మసకబారిన శారదాపీఠం.. రాజ గురువును దూరం పెడుతున్న పాలక ప్రభువు

ప్రభుత్వంలో నేనేం చెప్తే అదే శాసనం అంటూ చెప్పుకున్న విశాఖ శారదాపీఠం స్వరూపానందేంద్ర హవాకు బ్రేకులు పడ్డాయి.

Update: 2024-02-20 03:11 GMT

దిశ ప్రతినిధి, విశాఖపట్నం: ప్రభుత్వంలో నేనేం చెప్తే అదే శాసనం అంటూ చెప్పుకున్న విశాఖ శారదాపీఠం స్వరూపానందేంద్ర హవాకు బ్రేకులు పడ్డాయి. తాను చిటికేస్తే ఒక్కరు కాదు తెలుగు రాష్ర్టాల ముఖ్యమంత్రులిద్దరూ వచ్చి వాలతారనే స్ధాయి నుంచి ప్రముఖులెవ్వరూ ముఖం చూపించని స్ధాయికి పీఠం వచ్చేసింది. అటు తెలంగాణాలో తన మాట వినే కేసీఆర్ ఎన్నికలలో ఓటమి చెందడం, ఇటు పీఠం వివాదాలు, ఇతర మఠాల వారి అభ్యంతరాల కారణంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దూరంగా ఉంటున్నట్లు తెలిసింది.

దీంతో ప్రముఖులెవ్వరూ లేకుండానే శారదాపీఠం వార్షికోత్సవాలు సోమవారం నాడు సాదా సీదాగా ముగిశాయి. గతంలో ఆంధ్రా, తెలంగాణా ముఖ్యమంత్రులిద్దరూ ఆ వార్షికోత్సవాలకు హాజరయ్యేవారు. వరుసగా మూడు పర్యాయాలు పీఠంకు వచ్చిన వైఎస్ జగన్ గత ఏడాది పని ఒత్తిడి కారణంగా రాలేదు. అయితే, ఆ ఏడాది వస్తారని స్వరూపానందేంద్ర గట్టిగా విశ్వసించారు. ఆ కారణంగానే పీఠం తరపున ఉత్తరాధికారి సాత్మానందేంద్ర స్వయంగా ముఖ్యమంత్రిని కలసి ఆహ్వానం అందజేసి వచ్చారు. సోమవారం ఉదయం వరకూ కూడా ముఖ్యమంత్రి ని రప్పించేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేశారు. ఎటువంటి స్పందన రాకపోవడంతో ఆథ్యాత్మిక అంశాలకు బదులు రాజకీయ ఉపన్యాసం ఇచ్చి స్వరూపానందేంద్ర ఉత్సవాలను ముగించారు.

తెలంగాణా ఎన్నికల ఫలితాలు...తిరుమల వివాదం

తెలంగాణా ఎన్నికల ఫలితాలు బీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా రావడం స్వామి హవాకు గండి కొట్టినట్లు అయింది. అక్కడ కేసీఆర్ ముఖ్యమంత్రిగా వుండగా కోట్ల రూపాయల విలువ చేసే రెండెకరాల భూమిని తీసుకొన్న స్వరూపానందదేంద్ర, ఆంధ్రాలో జగన్ ముఖ్యమంత్రి అయ్యాక ఏకంగా 15 ఎకరాల ప్రభుత్వ భూమిని కారు చౌకగా మంజూరు చేయించుకోగలిగారు. గతంలో తిరుమల కొండపై మఠం కోసం కేటాయిచిన స్ధలంలో నిర్మించిన బహుళ అంతస్తుల భవనంతో సంతృప్తి చెందకుండా నిబంధనలకు విరుద్ధంగా అదనపు అంతస్తులు వేయడం, ఎక్సటెన్షన్ చేయడం పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసి స్టే ఇచ్చింది. కోర్టు కమీషన్ కూడా అక్రమ కట్టడాలను నిర్ధారించింది. విశాఖలో వేద విద్య, ఆధ్యాత్మిక సేవ అంటూ తీసుకొన్న భూమిలో వ్యాపార కార్యకలాపాలకు అనుమతివ్వాలంటూ పీఠం దరఖాస్తు చేయడం కొత్త వివాదాన్ని రాజేసింది.

స్వామి రాజకీయోపన్యాసం

దుర్మార్గమైన మనసుతో కొందరు తమ పీఠాన్ని చిదిమేయాలని చూశారని స్వరూపానందేంద్ర ముగింపు ప్రసంగంలో చెప్పుకొచ్చారు. మాకు అమ్మవారి అనుగ్రహం ఉండటంతో అది సాధ్యం కాలేదని పేర్కొన్నారు.

Tags:    

Similar News