చంద్రబాబు సభ నేపథ్యంలో ఉద్రిక్తత.. కేశినేని బ్రదర్స్ వర్గం మధ్య భగ్గుమన్న విభేదాలు
విజయవాడ ఎంపీ సీటు అన్నదమ్ముల మధ్య చిచ్చు పెట్టింది.....
దిశ, వెబ్ డెస్క్: విజయవాడ ఎంపీ సీటు అన్నదమ్ముల మధ్య చిచ్చు పెట్టింది. సిట్టింగ్ ఎంపీగా ఉన్న అన్న సీటుకు తమ్ముడు కాంపిటీషన్ కావడంతో ఆయా వర్గాలు జీర్ణించుకోలేకపోతున్నాయి. ఏ సమావేశం నిర్వహించినా రెండు వర్గాలు ఘర్షణకు దిగుతున్నాయి. దీంతో విజయవాడ టీడీపీలో తరచూ వర్గ విభేదాలు భగ్గుమంటున్నాయి.
విజయవాడ ఎంపీగా ఉన్న కేశినేనికి ఈసారి చంద్రబాబు అవకాశం ఇవ్వడంలేదని.. ఆయన తమ్ముడు చిన్నిని ఆ స్థానంలో పోటీ చేయించబోతున్నారని కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. దీంతో ఇద్దరి బ్రదర్స్ మధ్య రాజకీయ చిచ్చు చెలరేగింది. ఇది కాస్త వర్గ విభేదాలుగా మారాయి. అన్న కేశినేని పేరు చెబితే తమ్ముడు చిన్ని వర్గానికి నచ్చడం లేదు. తమ్ముడు చిన్ని పేరు వింటేనే అన్న నాని వర్గం మండిపోతోంది. దీంతో సమావేశాలు, కార్యక్రమాల్లో రెండు వర్గాలు పరస్పరం దూషించుకుంటున్నాయి. దాడులు చేసుకుంటున్నాయి.
ఈ నెల 7న చంద్రబాబు తిరువూరులో పర్యటించనున్నారు. అక్కడ నిర్వహించే భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగించనున్నారు. దీంతో సభ ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఈ సభను విజయవంతం చేసేందుకు టీడీపీ నేతలు, కార్యకర్తలు తీవ్ర కసరత్తులు చేస్తున్నారు. ఇందులో భాగంగా టీడీపీ సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. అయితే ఈ ఫ్లెక్సీల్లో కేశినేని ఫొటో లేకపోవడంతో ఆయన వర్గం నేతలు, కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేశినేని చిన్ని ఫ్లెక్సీలను చించివేశారు. కేశినేని చిన్నినీ సమావేశానికి రానివ్వమంటూ గేటు వద్ద కేశినేని నాని వర్గం ఆందోళనకు దిగింది. తిరువూరు టీడీపీ ఇంచార్జి దత్తుపై నాని వర్గం దాడికి దిగారు. దీంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది.