జగన్‌ను కలిసేందుకు షర్మిల వెంట వెళ్లని విజయమ్మ.. కారణం అదే..?
వైఎస్సార్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల ఏపీ కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించబోతున్నట్లు రెండు తెలుగు రాష్ట్రాల పొలిటికల్ సర్కిల్స్‌లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
దిశ, వెబ్‌డెస్క్: వైఎస్సార్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల ఏపీ కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించబోతున్నట్లు రెండు తెలుగు రాష్ట్రాల పొలిటికల్ సర్కిల్స్‌లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. కాంగ్రెస్‌లో వైఎస్సార్టీపీ విలీనం ఖరారు అయ్యిందని.. ఇక, ఏపీ కాంగ్రెస్ చీఫ్‌గా షర్మిల బాధ్యతలు చేపట్టడమే తరువాయి అని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో షర్మిల తన సోదరుడు, సీఎం జగన్‌ను కలవడం హాట్ టాపిక్‌గా మారింది. కాగా, షర్మిల కొడుకు రాజారెడ్డి పెళ్లి ఫిక్స్ అయిన విషయం తెలిసిందే. తన ప్రియురాలితో రాజారెడ్డి వివాహం ఫిబ్రవరి 17వ తేదీన జరగనుండగా.. ఈ నెల 18వ తేదీన ఎంగేజ్‌మెంట్ వేడుక జరగనుంది. దీంతో, తన కొడుకు నిశ్చితార్థం, పెళ్లికి రావాలని జగన్‌ను షర్మిల ఆహ్వానించింది. ఇవాళ తాడేపల్లిలోని సీఎం క్యాంప్ ఆఫీస్‌కు కుటుంబ సమేతంగా వెళ్లిన షర్మిల.. జగన్‌ను, వదిన భారతిని కలిసి వివాహానికి రావాలని ఆహ్వానించింది.
అయితే, షర్మిలకు సోదరుడు జగన్‌కు మధ్య విభేదాలు నెలకొన్నాయని గత కొంత కాలంగా ప్రచారం జరుగుతోంది. ఈ వార్తలకు బలం చేకూర్చేలా ఇటీవల కాలంలో జగన్, షర్మిల ఒక్కసారి కూడా కలుసుకోలేదు. అంతేకాకుండా తండ్రి వైఎస్ వర్థంతి, జయంతి రోజు కూడా ఇడుపులపాయలోని వైఎస్ ఘాట్ వద్దకు వేర్వేరుగానే వెళ్తున్నారు. ఎక్కడ ఒకరికి ఒకరు ఎదురు పడలేదు. అయినప్పటికీ ఇవాళ షర్మిల వెళ్లి తన కొడుకు పెళ్లికి రావాలని జగన్‌ను ఆహ్వానించడం ఆసక్తికరంగా మారింది. ఇదిలా ఉంటే, షర్మిల ఇవాళ జగన్‌ను కలవడానికి వెళ్లిన సమయంలో ఆమె తల్లి వైఎస్ విజయమ్మ వెంట లేరు. కొడుకు, కూతురితో పాటు మరికొందరు కుటుంబ సభ్యులతో వెళ్లి షర్మిల జగన్‌ను కలిశారు. దీంతో కొడుకు జగన్ నివాసానికి విజయమ్మ వెళ్లకపోవడం కొత్త చర్చకు తెరలేపింది.
జగన్ ఇంటికి ఇంటికి విజయమ్మ ఎందుకు వెళ్లలేదు..? కొడుకుతో విజయమ్మకు విభేదాలు ఉన్నాయా..? లేదా ఇతర కారణాలతో ఆమె వెళ్లలేదా అన్న చర్చ తెరపైకి వచ్చింది. గత కొంతకాలంగా వైఎస్ విజయమ్మ కూతురు షర్మిలతో పాటే ఉంటున్నారు. ఇటీవల వైసీపీ గౌరవ అధ్యక్షురాలి పదవికి సైతం రాజీనామా చేసిన విజయమ్మ.. హైదరాబాద్‌లోనే ఉంటున్నారు. షర్మిల పార్టీ పెట్టిన సందర్భంలో వైఎస్ అభిమానులు తన కూతురికి అండగా నిలవాలని ఆమె అభ్యర్థించారు. విజయమ్మ పార్టీ పదవికి రాజీనామా చేయడం అప్పట్లో ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది. సీఎం జగన్‌కు సోదరి, తల్లితో విభేదాలు ఉన్నాయని.. అందుకే వారిని పక్కనపెట్టాడని.. ప్రతిపక్షాలు ఆరోపించాయి. విపక్షాల ఆరోపణలకు తగ్గట్లుగా ఇవాళ విజయమ్మ జగన్ నివాసానికి వెళ్లకపోవడం ఈ వార్తలకు మరింత బలం చేకూర్చినట్లైంది. విభేదాలు నెలకొనడంతోనే కొడుకు జగన్‌ను కలిసేందుకు వెళ్లలేదని చర్చ మొదలైంది. ఈ అంశం ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. అయితే, జగన్ నివాసానికి విజయమ్మ వెళ్లకపోవడానికి అస్సలు కారణం ఏంటన్నది తెలియాల్సి ఉంది.