Heavy Rains:రాష్ట్రంలో భారీ వర్షాలు..వరద ప్రాంతాల్లో కేంద్ర మంత్రి పర్యటన

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి.

Update: 2024-09-01 08:55 GMT

దిశ,వెబ్‌డెస్క్:బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. రహదారులన్నీ వర్షపు నీటితో చెరువులను తలపిస్తున్నాయి. గత రెండు రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఇళ్లలోకి వరద నీరు చేరడంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు.

ఈ క్రమంలో ఉప్పలపాడులో నీట మునిగిన పంట పొలాలు పరిశీలించారు. రైతులతో కేంద్ర మంత్రి పెమ్మసాని మాట్లాడారు. ఈ క్రమంలో గత ఐదేళ్లలో కాలువ మరమ్మత్తులు చేయలేదని రైతులు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌కు ఫిర్యాదు చేశారు. కాలువలు సక్రమంగా లేకపోవడం వల్లే పొలాలు మునిగి పోయాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఉపాధి హామీ పథకం దుర్వినియోగం అయిందని, కాలువల్లో పనులు చేయకుండానే వైసీపీ నేతల దోచుకున్నారని రైతులు ఆరోపించారు. గుంటూరు చానల్‌కు అధిక వరద వల్ల గండ్లు పడ్డాయని, గుంటూరు చానల్‌ను కూడా త్వరలో ఆధునీకరిస్తామని కేంద్ర మంత్రి పెమ్మసాని స్పష్టం చేశారు. రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని, ఎవరు అధైర్య పడొద్దని మంత్రి పెమ్మసాని రైతులకు భరోసా ఇచ్చారు.


Similar News