మార్చికల్లా ఏపీలో 4G సేవలు.. తాడికొండలో టవర్

మార్చి లోపు 100% 4G సేవలను దేశవ్యాప్తంగా అమలు చేయబోతున్నామని గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్స్ శాఖ కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు...

Update: 2024-08-04 15:06 GMT

దిశ ఏపీ బ్యూరో, అమరావతి: దేశవ్యాప్తంగా వీలైనంత వేగంగా 4G సేవలు విస్తరించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించాయి. ఇందులో భాగంగా సెప్టెంబర్ కల్లా 70%, మార్చి లోపు 100% 4G సేవలను దేశవ్యాప్తంగా అమలు చేయబోతున్నామని గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్స్ శాఖ కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. తాడికొండలోని బి.ఎస్.ఎన్.ఎల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన 4G టవర్‌ను పెమ్మసాని, స్థానిక ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్, అధికారులతో కలిసి ఆదివారం పరిశీలించడంతో పాటు టెస్ట్ చేశారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బేస్ బ్యాండ్ యూనిట్‌ను ఆయన ప్రారంభించారు. ఆ తరువాత ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పెమ్మసాని మాట్లాడుతూ మారుమూల గ్రామాల్లోని ప్రజలు ఎక్కువ ధరలతో ఫోన్ రీఛార్జ్‌లు చెల్లించి ఫోన్ సర్వీసులు ఉపయోగించుకోలేని పరిస్థితి ఉందన్నారు. రీఛార్జ్ ధరలు పెరగడం వల్ల ప్రజలు ఇబ్బంది పడే పరిస్థితిని మార్చాలనే ఉద్దేశంతో బిఎస్ఎన్ఎల్ ను 4G సేవలతో ఆధునీకరించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించాయని వివరించారు. అందులో భాగంగానే తాను 4G టవర్‌ను పరిశీలించి టెస్టులు జరిపామని పెమ్మసాని తెలిపారు.


ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలలుగన్న విధంగా ప్రజలకు ఉన్నతమైన ఫోన్ సేవలు అందుబాటులోకి తెస్తున్నామని పెమ్మసాని చెప్పారు. ముఖ్యంగా ఏపీలో క్వాలిటీతో కూడిన 4G సేవలను అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. అతి తక్కువ ధరలకే ఇంటర్నెట్ సేవలను ప్రజలు వినియోగించుకోవడమే లక్ష్యంగా కేంద్రం ఈ 4G టవర్లను సిద్ధం చేస్తుందని పెమ్మసాని పేర్కొన్నారు.

అనంతరం బి.ఎస్.ఎన్.ఎ.ల్ సిఎండి రాబర్ట్ జె. రవి, ఏపీ సర్కిల్ చీఫ్ జనరల్ మేనేజర్ శేషాచలం మాట్లాడుతూ ఏపీలో 300 లొకేషన్లను రెడీ చేసుకుని టెస్టులు చేస్తున్నామని, 400 సెంటర్లలో టవర్స్‌కు ఎక్విప్మెంట్‌ను ఇన్స్టాల్ చేసి 4G సేవలు అందించడానికి సమాయత్వం అవుతున్నామని తెలిపారు.

Tags:    

Similar News