జనసేనలో విచిత్రం : డబ్బున్నోళ్లకు పెద్దపీట.. కష్టపడ్డవారికి మెుండి చేయి
మీకు డబ్బుందా? ఎన్ని కోట్లు ఖర్చు పెడతారు..?మీరెంత ఖర్చుపెడతారు.. మాకెంత ఇస్తారు.
దిశ , డైనమిక్ బ్యూరో : మీకు డబ్బుందా? ఎన్ని కోట్లు ఖర్చు పెడతారు..?మీరెంత ఖర్చుపెడతారు.. మాకెంత ఇస్తారు. అదేంటి ఇంతలా మాట్లాడేస్తున్నారు. జనసేన పార్టీ తరఫున టికెట్ ఆశిస్తున్న వ్యక్తి ఉన్నారు కదా. పార్టీ కోసం వారంతా కష్టపడుతున్నారు కదా. ఆయనను కాదని తమకు టికెట్ ఇస్తారా? ఏంటి అని కొత్త నాయకుడు ప్రశ్నిస్తే.. ఆ భయమే అక్కర్లేదు. టికెట్ ఇప్పించే హామీ మాది. ఇప్పటి వరకు ఉన్న నాయకుడిపై కంప్లైంట్‌లు ఇస్తాం. లేదంటే ఏదో ఒక ప్రచారం చేస్తాం. ఇంకా చెప్పాలంటే అతని దగ్గర డబ్బు లేదు.. వచ్చే ఎన్నికల్లో ఓట్లు ఎలా కొంటారని పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లి అతడికి కాకుండా మీకే ఇప్పిస్తాం. ఇది ఉభయగోదావరి జిల్లాలలోని జనసేన పార్టీలో టికెట్ ఆశిస్తున్న బడాబాబులకు ప్రస్తుతం క్యాడర్ చేస్తున్న భజన. పార్టీ కోసం నాలుగున్నరేళ్లుగా పనిచేస్తున్నవారు ఏమైపోయినా పర్వాలేదని.. కానీ డబ్బుతో శాసించే నాయకులే కావాలని అంటున్నారు. ఇలా భజన చేస్తున్న వారు ఏదో చిన్న,చితకా నాయకులు అనుకుంటే పొరపాటు. ఏకంగా జిల్లా కార్యవర్గం సభ్యులు కావడం విశేషం. ఈ జిల్లా, మండల కార్యవర్గాలు అనుసరిస్తున్న తప్పుడు విధానాలపట్ల చిత్తశుద్ధి కలిగిన నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జనసేన పార్టీలో జిల్లా కార్యవర్గాన్ని మార్చకుండా ఉంచడం వల్ల వారు ఆడిందే ఆట పాడిందే పాటగా మారుతుందని.. ఇవన్నీ తెలిసినా కూడా జిల్లా అధ్యక్షులు తెలిసీతెలియనట్లు ప్రవర్తిస్తున్నారని మండిపడుతున్నారు.
పుట్టుకొస్తున్న కొత్త నేతలు
2024 ఎన్నికలు జనసేన పార్టీకి ఎంతో ప్రతిష్టాత్మకం. వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ తన లక్ష్యమని జనసేనాని పవన్ కల్యాణ్ చెప్తున్నారు. వైసీపీని ఇంటికి పంపిస్తాం...వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వస్తాం అంటూ పదేపదే పవన్ కల్యాణ్ చెప్తున్నారు. పవన్ కల్యాణ్ మాటలు అటుంటే ప్రజల్లో మాత్రం అంతసీన్ లేదు అనిపిస్తోంది. ఇందుకు ఎవరో కారణం కాదు జనసేన పార్టీ నేతలు అనుసరిస్తున్న తీరే కారణంగా తెలుస్తోంది. జనసేన పార్టీకి సంబంధించిన అన్ని నియోజకవర్గాల్లో ఇన్‌చార్జిలు లేరు. ముఖ్యంగా ఎస్సీ సామాజిక వర్గాలకు చెందిన నియోజకవర్గాల్లో ఇన్‌చార్జిల నియామకంలో జనసేన అధిష్టానం మీనమేషాలు లెక్కిస్తోంది. ఇన్‌చార్జి ప్రకటించకపోయినప్పటికీ టికెట్ ఆశిస్తూ నాయకులు 2019 నుంచి శ్రమిస్తున్నారు. ఇప్పటికే పార్టీ కార్యక్రమాలకు శ్రమించారు. పార్టీ పరంగా అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ జనసేన పార్టీని గ్రామ గ్రామానికి తీసుకెళ్లారు. అయితే ఇన్‌చార్జిలు ప్రకటించని నియోజకవర్గాలపై ఆశావాహులు కన్నేశారు. మరికొన్ని నెలల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆయా నియోజకవర్గాలపై ఫోకస్ పెంచారు. ఆ నియోజకవర్గంలో జనసేన తరఫున చక్రం తిప్పుతున్న వారిని టార్గెట్ చేసి టికెట్ కోసం తప్పుడు రాజకీయ విధానాలను అవలంభిస్తున్నారని ఉభయగోదావరి జిల్లాలలో ప్రచారం జరుగుతుంది.
పార్టీ కోసం శ్రమించిన వారికి తిలోదకాలు
ఇకపోతే ఇటీవల కాలంలో రిటైర్డ్ ఉద్యోగులు, పదవీ విరమణకు దగ్గరగా ఉన్న నాయకులు వచ్చే ఎన్నికల్లో జనసేన తరఫున బరిలో నిలవాలని ప్రయత్నిస్తున్నారు. ఇందుకు డబ్బే ప్రదానంగా భావిస్తున్నారు. డబ్బు ఉంటే గెలుపు ఖాయమని వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇందులో భాగంగా తమ ఆర్థిక సమర్ధతను ఆయా నియోజకవర్గాల్లోని జిల్లా క్యాడర్‌ను కలుస్తున్నారు. వారి రాకను ముందే పసిగట్టిన నాయకులు ఎంత ఖర్చుపెడతారు..? ఎంతిస్తారు? ఇప్పటి వరకు క్యాడర్ ఎంతో కష్టపడి పనిచేసింది. వారిని ఆర్థికంగా ఎలా ఆదుకుంటారు అని ఏకంగా ఇంటర్వ్యూలు చేసి పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. అప్పటి వరకు వీరంతా కలిసి పనిచేసిన నాయకులను పక్కన పెట్టేస్తున్నారు. అంతేకాదు ఆశావాహులుగా బడాబాబులు తెరపైకి రావడంతో అప్పటి వరకు కష్టపడి పనిచేసిన నాయకులపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అధిష్టానానికి ఫిర్యాదులు చేస్తున్నారు. అంతేకాదు ఇన్నాళ్లు జనసేన పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లిన నాయకులను గాలికొదిలేసి బడాబాబులైన ఆశావాహులతో డబ్బును ఇతరులకు ఎరచూపి ప్రజల్లోకి తిప్పేస్తున్నారు. కొన్ని నియోజకవర్గాల్లో టికెట్ ఆశిస్తున్న ఆశావాహులు పార్టీలో చేరకపోయినప్పటికీ జిల్లా కార్యకవర్గంలోని నాయకులు వారిని తమ పార్టీ అభ్యర్థి అంటూ ప్రజలకు పరిచయం చేసేస్తున్నారు. తాము ఉండగా ఇలాంటి కార్యక్రమాలు ఏంటని పార్టీని నమ్ముకున్న వారు ప్రశ్నిస్తే రివర్స్ అవుతున్నారు. మీ దగ్గర డబ్బులేదు.. ఆశావాహుడి దగ్గర డబ్బు ఉంది .. ఇదే ఎన్నికల్లో గెలుపునకు ప్రధానం అని నేతలు చెప్తున్నారు.
మూల్యం చెల్లించుకోకతప్పదా?
ఇదిలా ఉంటే జనసేన పార్టీకోసం చిత్తశుద్ధితో పనిచేస్తున్న కార్యకర్తలు మాత్రం నేతల తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇన్‌చార్జి ప్రకటించే వరకు అంతా కలిసి పనిచేయాలని.. అలాగే పార్టీ కోసం శ్రమించిన వారికి ప్రాధాన్యత ఇవ్వాలని అలా కాకుండా పార్టీకోసం పనిచేయని నేతలు ఇప్పటికిప్పుడు తెరపైకి వచ్చి డబ్బు ఖర్చుపెడితే టికెట్ ఇచ్చేసినట్లేనా అని ప్రశ్నిస్తున్నారు. ఇన్నాళ్లు పార్టీ కోసం కష్టపడ్డ వారి పరిస్థితి ఏంటని నిలదీస్తున్నారు. పార్టీకోసం ఇప్పటి వరకు పనిచేసిన నాయకులు ఆర్థికంగా చితికిపోయినప్పటికీ టికెట్ వస్తుందనో లేకపోతే ఏదోక పదవి వస్తుందనో ఆశిస్తారని అలాంటి వారిపై సానుభూతి చూపించాల్సింది పోయి కొత్త వారిని తీసుకువచ్చి రాజకీయం చేస్తే జనసేన పార్టీని ఎలా నమ్ముతారని కార్యకర్తలు వాపోతున్నారు. ఈ అంశంపై అధిష్టానం దృష్టి సారించకపోతే జనసేన పార్టీ పెద్ద మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరిస్తున్నారు.