స్కిల్ స్కామ్ కేసులో ట్విస్ట్: ఉండవల్లి పిల్‌ను విచారణకు స్వీకరించిన హైకోర్టు
స్కిల్ డవలప్‌మెంట్ స్కామ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది.
దిశ, డైనమిక్ బ్యూరో : స్కిల్ డవలప్‌మెంట్ స్కామ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసును సీబీకు అప్పగించాలంటూ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ పిల్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ పిల్‌ను విచారణకు ఏపీ హైకోర్టు స్వీకరించింది. పిల్‌ను విచారణకు అనుమతినిస్తూ ‘WP (PIL) 148 /2023’నెంబర్‌ను హైకోర్టు కేటాయించింది. శనివారం ఈ పిటిషన్ విచారణకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. స్కిల్ స్కామ్ కేసును సీబీఐకి అప్పగించాలి అని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ గురువారం హైకోర్టులో పిల్ వేసిన సంగతి తెలిసిందే. రూ.241 కోట్ల దారి మళ్లింపు, పూర్తి నిందితుల జాబితాతో సవివరంగా ఉండవల్లి వివరాలు పొందు పరిచారు.
సీమెన్స్ ఇండియా గుజరాత్ MOUలో పెట్టిన పేరు సంతకం, ఏపీలో పెట్టిన పేరు సంతకం వేరు వేరుగా ఉన్నాయి అని ఆధారాలను జత చేశారు. దురుద్దేశ పూర్వకంగా, కుట్ర కోణంతో చంద్రబాబు నాయుడు సహకారంతో రూ. 241 కోట్ల దారి మళ్లింపు జరిగింది అని ఆరోపించారు. ఒక్క MOU తప్ప కేసుకి సంబందించిన అన్నీ డాక్యుమెంట్స్‌ను ఉండవల్లి అరుణ్ కుమార్ జత చేశారు. రిమాండ్ ఆర్డర్స్, రిమాండ్ రిపోర్ట్స్ సహ అన్నీ వివరాలు పొందుపరచి 44 మంది ప్రతి వాదులను ఉండవల్లి అరుణ్ కుమార్ చేర్చారు.