TTD: తెలుగు రాష్ట్రాల్లో తిరుమల లడ్డూ పంచాయితీ.. ఈవో శ్యామలరావు కీలక వ్యాఖ్యలు

తిరుమల లడ్డూ తయారీలో జంతు కొవ్వును వాడటం తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చనీయాంశం అయింది.

Update: 2024-09-20 09:31 GMT

దిశ, వెబ్‌డెస్క్: తిరుమల లడ్డూ తయారీలో జంతు కొవ్వును వాడారన్న విషయం తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చనీయాంశం అవుతోంది. ఈ క్రమంలోనే టీటీడీ ఈవో శ్యామలా‌ రావు (TTD EO Shyamala Rao) తాజాగా మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. తాను బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి సీఎం చంద్రబాబు (CM Chandrababu) తనను లడ్డూ తయారీపైనే దృష్టి పెట్టాలని సూచించారని పేర్కొన్నారు. కొన్ని సందర్భాల్లో లడ్డూని చూసినప్పడు అందులో నెయ్యి వాడుతున్నారా లేక నూనె వాడుతున్నారా అన్న సందేహం తనకు కూడా కలిగిందని తెలిపారు. నెయ్యి నాణ్యత పరిశీలనకు గత ప్రభుత్వాన్ని ల్యాబ్‌ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేయగా వారు ఆ పని చేయలేదని గుర్తు చేశారు. నెయ్యి టెస్టింగ్ ల్యాబ్‌‌ (Testing LAB)కు సుమారు రూ.75 లక్షల వరకు ఖర్చు అయి ఉండేదని తెలిపారు.

ఒకానొక దశలో నెయ్యి కాంట్రాక్ట్ కేజీ రూ.220 నుంచి రూ.410 ఎలా పెంచారో అర్థం కాలేదని అన్నారు. అనంతరం మార్చి 12న రూ.319 రూపాయలకే నెయ్యిని సరఫరా చేస్తామంటూ ఏఆర్ సంస్థ టెండర్‌‌ను దక్కించుకుందని తెలిపారు. మే 15న వారు నెయ్యిని ఆలయానికి పంపగా అందులో నాణ్యత లేకపోవడంతో నాలుగు ట్యాంకర్ల నెయ్యిని తిరిగి వెనక్కి పంపించేశామని పేర్కొన్నారు. జూలై 6, 12న నెయ్యి శాంపిల్స్‌ను టెస్టింగ్‌ కోసం ల్యాబ్‌కు పంపగా కల్తీ జరిగినట్లుగా రిపోర్ట్ వచ్చిందని ఆయన వెల్లడించారు. ఇలాంటి అవకతవకలు జరిగినందుకే నెయ్యి నాణ్యతపై కంట్రోల్ లేకుండా పోయిందని, లడ్డూ తయారీకి ముందు వాడే నెయ్యిని పరీక్షించ లేదని శ్యామలా రావు తెలిపారు.     


Similar News