TTD: తిరుమలలో ఆకస్మిక తనిఖీ.. హోటళ్ల యాజమానులకు కీలక ఆదేశాలు

దసరా సెలువుల నేపథ్యంలో తిరుమలలో టీటీడీ అధికారులు అప్రమత్తమయ్యారు..

Update: 2024-10-02 13:33 GMT

దిశ, వెబ్ డెస్క్: దసరా సెలువుల(Dussehra Holidays) నేపథ్యంలో తిరుమలకు భక్తులు (Devotees) భారీగా వస్తారని టీటీడీ (TTD) అంచనా వేసింది. పండుగ సందర్భంగా కొండకు వచ్చే వారికి అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. తిరుమలకు వచ్చిన భక్తులకు మరిన్ని సేవలు అందించేలా ప్రణాళికలు రూపొందించారు. భక్తులు తిరుమలకు వచ్చినప్పటి నుంచి స్వామివారిని దర్శించుకుని సురక్షితంగా తిరుగు పయనం వరకూ బాధ్యతగా వ్యవహరించాలని సిబ్బంది, అధికారులకు టీటీడీ అదేశించింది.

మరోవైపు తిరుమల (Tirumala)కు ఇప్పటికే భారీగా భక్తులు తరలి వస్తున్నారు. ఈ నేపథ్యంలో అల్పాహారం, భోజనం, పాలు, హోటళ్లలో ఆహారం, తినుబండారాలు, స్నానపు గదులు, కల్యాణ కట్టలు, శ్రీవారి దర్శనం వంటి ఏర్పాట్లపై దృష్టి పెట్టిన అధికారులు ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు. టీటీడీ అడిష‌న‌ల్ ఈవో వెంక‌య్య చౌద‌రి (TTD Additional EO Venkaiah Chaudhary) ఆధ్వర్యంలో బుధవారం తిరుమలలోని హోటళ్లలో తనిఖీలు నిర్వహించారు. పలు హోటళ్లలో కిచెన్ల శుభ్రత, ఆహార పదార్థాల నాణ్యతపై ఆరా తీశారు. వెంక‌య్య చౌద‌రి స్వయంగా ఓ హోటల్‌లో అల్పాహారం తిని నాణ్యతను పరీక్షించారు. నాణ్యత మెరుగుపర్చాలని హోటళ్ల యాజమానులకు సూచించారు. భక్తులకు అందించే ఆహారం విషయంలో ఎలాంటి అసౌకర్యాలు కలిగించొద్దని సూచించారు. భోజనంలో నాణ్యత తగ్గించొద్దని, భక్తులు కడుపు నిండా తినేలా ఆహారాలు తయారు చేయాలని ఆదేశించారు. భక్తుల నుంచి ఎలాంటి ఫిర్యాదు అందినా చర్యలు తప్పవని వెంక‌య్య చౌద‌రి హెచ్చరించారు.


Similar News