తిరుమలలో దళారుల బెడద.. ఈవో కీలక నిర్ణయం

తిరుమల దళారుల బెడద కట్టడిపై ఈవో శ్యామలరావు ప్రత్యేకంగా దృష్టి సారించారు...

Update: 2024-06-29 16:05 GMT

దిశ, వెబ్ డెస్క్: తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు ప్రతి రోజూ వేలాది మంది భక్తులు వస్తుంటారు. అయితే దర్శన టికెట్లు ఉన్నవారు, లేని వారు స్వామిని దర్శించుకుని తిరిగి స్వగ్రామాలకు వెళ్తుంటారు. ఆన్‌లైన్‌లో దర్శన టికెట్లు పొందిన వారు తక్కువ సమయంలో శ్రీవారి సేవలో పాల్గొంటారు. సర్వదర్శనానికి వెళ్లిన భక్తులకు గంటల తరబడి సమయం పడుతుంది. ఇదంతా తిరుమలలో ఓ సిస్టమాటిక్ జరుగుతోంది. ఎంత మంది భక్తులు వచ్చినా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా టీటీడీ సిబ్బంది శ్రీవారి దర్శనానికి తగిన ఏర్పాట్లు చేస్తుంటుంది. అయితే ఇంత పవిత్రత ఉన్న తిరుమలలో దళారుల బెడద మరీ ఎక్కువైపోయింది. స్వామి వారి స్పెషల్ దర్శనాల టికెట్లను సైతం బ్లాక్ అమ్మేస్తూ ఉన్నారు. అధిక ధరలకు విక్రయించి వేల రూపాయలు వెనకేసుకుంటున్నారు. తద్వారా ధర్మంగా టికెట్లు పొందాలనుకునే భక్తులకు నిరాశ మిగులుతోంది. టికెట్ల దొరక్క తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 

దీంతో కొత్తగా నియమితులైన ఈవో జే. శ్యామలరావు ఫుల్ ఫోకస్ పెట్టారు. తిరుమలలో దళారుల బెదడను రూపుమాపే విధానాలపై ప్రత్యేకంగా దృష్టిపెట్టారు. భక్తులకు టీటీడీ ఇప్పటికే అందిస్తున్న ఆన్ లైన్ అప్లికేషన్ సేవలకు ఆధార్ కార్డు లింక్ పెడితే దళారుల బెడద తప్పుతుందని ఆయన భావిస్తున్నారు. ఈ మేరకు ఇది ఎంతవరకూ సాధ్యమతుందనే అంశంపై తిరుపతి టీటీడీ పరిపాలన భవనంలో ఐటీ విభాగ నిపుణులతో భేటీ అయ్యారు. ఆధార్ ద్వారా భక్తుల గుర్తింపు, పరిశీలన, బయోమెట్రిక్ వెరిఫికేషన్‌తో పాటు డ్యూప్లికేషన్ నిరోధం వంటి అంశాలపై చర్చించారు. భక్తులకు అందించే ఆన్‌లైన్ సేవలకు ఏ విధంగా ఆధార్ లింక్ చేయొచ్చనే అంశంపై ఈ సందర్బంగా ఈవోకు ఐటీ విభాగం నిపుణులు వివరించారు. ఆన్ లైన్ ద్వారా భక్తులకు అందిస్తున్న సేవల్లో ఆధార్ లింక్ సాధ్యాసాధ్యాలపై చర్యలు చేపట్టాలని అటు టీటీడీ అధికారులను ఆదేశించారు. ఇందుకు యుఐడీఏఐ అధికారుల సూచనలు, సలహాలు తీసుకోవాలని ఈవో శ్యామలరావు సూచించారు. 


Similar News