TTD EO: లడ్డూ నాణ్యత లేని మాట వాస్తవమే: టీటీడీ ఈవో శ్యామలా రావు సంచలన వ్యాఖ్యలు
రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరడంతో అన్ని వ్యవస్థలను ప్రక్షాళన చేసే పనిలో అధికార పక్షం నిమగ్నమైంది.
దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరడంతో అన్ని వ్యవస్థలను ప్రక్షాళన చేసే పనిలో అధికార పక్షం నిమగ్నమైంది. ఇప్పటికే తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోను మార్చిన ప్రభుత్వం.. భక్తులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలపై ఫోకస్ పెట్టింది. ఉచిత దర్శనాల నుంచి అన్న ప్రసాదాల వరకు మార్పులు చేసేందుకు టీటీడీ సమాయత్తమవుతోంది. ముఖ్యంగా లడ్డూలో నాణ్యత లేకపోవడం పట్ల భక్తులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో రంగంలోకి దిగిన టీటీడీ ఈవో శ్యామలా రావు క్షేత్ర స్థాయిలో సమస్య పరిష్కారానికి చర్యలు చెపట్టారు. ఇవాళ ఆయన తిరుమలలో మాట్లాడుతూ.. లడ్డూ ప్రసాదంలో నాణ్యత లేని మాట వాస్తవమేనని అన్నారు. ఈ విషయంలో హై లెవెల్ కమిటీని ఈనెల 2న ఏర్పాటు చేశామని తెలిపారు. వెంటనే లడ్డూ నాణ్యతలో మార్పులు వచ్చేలా నాణ్యమైన నెయ్యి కొనుగోలు చేసేందుకు విధివిధానాలు ఖరారు చేస్తామని అన్నారు. అదేవిధంగా లడ్డూ తయారీకి వచ్చిన నెయ్యిని పరీక్షించేందుకు తిరుమలలోనే ల్యాబ్ ఏర్పాటు చేస్తామని ఈవో శ్యామలా రావు స్పష్టం చేశారు.