ఎన్ఐఏ అదుపులో మావోయిస్టు అగ్రనేత ఆర్కే సతీమణి శిరీష
మావోయిస్టు అగ్రనేత, దివంగత ఆర్కే సతీమణి శిరీషను ఎన్ఐఏ అధికారులు శుక్రవారం అరెస్ట్ చేశారు.
దిశ, డైనమిక్ బ్యూరో : మావోయిస్టు అగ్రనేత, దివంగత ఆర్కే సతీమణి శిరీషను ఎన్ఐఏ అధికారులు శుక్రవారం అరెస్ట్ చేశారు. ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం ఆలకూరపాడులో శిరీష తన నివాసంలో ఉండగా ఎన్ఐఏ అధికారులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. అక్కడ నుంచి ఆమెను అరెస్ట్ చేసి తరలించారు. ఇటీవలే శిరీష ఇంట్లో ఎన్ఐఏ అధికారులు సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే సోదాలు జరిగే సమయంలో శిరీష ఇంట్లో లేరు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె చికిత్స నిమిత్తం విజయవాడకు వెళ్లి వచ్చే లోపు ఎన్ఐఏ అధికారులు సోదాలు నిర్వహించారని శిరీష అప్పట్లో మీడియాకు తెలియజేశారు. భర్త, కుమారుడిని కోల్పోయి పుట్టెడు దు:ఖంలో ఉండగా విచారణ సోదాలు అంటూ తనను వేధింపులకు గురి చేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. మావోయిస్టులకు నగదు పంపించినట్లు వస్తున్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదని శిరీష అప్పట్లో తెలిపారు.