నేడు ఒంటిమిట్టలో అంగరంగ వైభవంగా రాములోరి కల్యాణం
ఆంధ్ర భద్రాద్రి ఒంటిమిట్టలో బుధవారం సీతారాముల కల్యాణం అత్యంత వైభవంగా జరగనుంది.
దిశ ప్రతినిధి, కడప: ఆంధ్ర భద్రాద్రి ఒంటిమిట్టలో బుధవారం సీతారాముల కల్యాణం అత్యంత వైభవంగా జరగనుంది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా టీటీడీ అన్ని ఏర్పాట్లు చేసింది. కొద్దిరోజులుగా టీటీడీ అధికారులు ఒంటిమిట్టలో మకాం వేసి కళ్యాణ వేదిక ప్రాంగణం, గుడి, పరిసరాలు ముస్తాబు చేశారు. కోదండ రామాలయం, సీతారాముల కల్యాణ వేదిక విద్యుత్ దీపాలతో దేదీప్యమానంగా శోభిల్లుతోంది. అన్న ప్రసాదాలు, నీరు, మజ్జిగ ప్యాకెట్లు ప్రతి భక్తుడికి అందించేలా చర్యలు తీసుకున్నారు.
ఒంటిమిట్టలో సీతారాముల కల్యాణానికి ఒక ప్రత్యేకత ఉంది. భద్రాచలంలో పగలు కల్యాణం జరిగితే ఒంటిమిట్టలో మాత్రం రాత్రి పండు వెన్నెలలో పౌర్ణమి రోజు కల్యాణం నిర్వహిస్తారు. రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వరకు కల్యాణ ఘట్టం జరుగుతుంది. పోలీస్ సిబ్బంది గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. కడప, రాజంపేట నుంచి అధిక సంఖ్యలో బస్సులు నడిపేందుకు రవాణా శాఖను జిల్లా కలెక్టర్ విజయరామరాజు ఆదేశించారు .
ముఖ్యమంత్రి పర్యటన రద్దు
రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఒంటిమిట్ట పర్యటన రద్దయింది. ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాల కల్యాణం రోజు సంప్రదాయంగా ముఖ్యమంత్రి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించే ఆనవాయితీ ఉంది. ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలను విభజిన ఆంధ్ర ప్రదేశ్ ఉత్సవంగా ప్రభుత్వం నిర్ణయించి.. టీటీడీ ద్వారా ప్రతి ఏటా బ్రహ్మోత్సవాలు అత్యంత శోభాయమానంగా జరుపుతున్నారు.
ఇలా ఉత్సవాలు మొదలైనప్పటి నుంచి ముఖ్యమంత్రులు పట్టువస్త్రాలు సమర్పిస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈసారి జరుగుతున్న కల్యాణానికి వస్తున్నట్లు అధికారిక కార్యక్రమం ఖరారైనా చివరి నిమిషంలో ఆయన పర్యటన రద్దయింది. దీంతో పట్టు వస్త్రాలు ఇచ్చేందుకు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వస్తారా ? లేక మరో మంత్రి ఎవరినైనా పంపుతారా ? లేక టీటీడీ ఈవోనే పట్టు వస్త్రాలు సమర్పిస్తారా అనే విషయంపై స్పష్టత లేదు.