తిరుమల తరహాలో తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు : టీటీడీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాలు నవంబరు 10 నుండి 18వరకు జరుగనున్నాయని టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర రెడ్డి వెల్లడించారు.
దిశ, డైనమిక్ బ్యూరో : తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాలు నవంబరు 10 నుండి 18వరకు జరుగనున్నాయని టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర రెడ్డి వెల్లడించారు. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల తరహాలో వీటిని వైభవంగా నిర్వహిస్తామని తెలిపారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం ఎదుట సోమవారం అమ్మవారి బ్రహ్మోత్సవాల వాహన సేవల బుక్ లెట్ ను భూమన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా భూమన మీడియాతో మాట్లాడారు. బ్రహ్మోత్సవాల నేపథ్యంలో నవంబరు 7న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరుగనుందన్నారు. నవంబరు 9న లక్షకుంకుమార్చన, అంకురార్పణ నిర్వహిస్తారని వెల్లడించారు. బ్రహ్మోత్సవాల్లో ప్రధానంగా నవంబరు 10న ధ్వజారోహణం, 14న గజ వాహనం, 15న స్వర్ణరథం, గరుడ వాహనం, 17న రథోత్సవం, 18న పంచమితీర్థం, 19న పుష్పయాగం నిర్వహిస్తారని స్పష్టం చేశారు. ఉదయం 8 నుండి 10 గంటల వరకు, రాత్రి 7 నుండి 9 గంటల వరకు వాహనసేవలు జరుగనున్నాయన్నారు. విశేషమైన పంచమి తీర్థం నాడు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి లక్షలాది మంది భక్తులు విచ్చేసి పుణ్యస్నానాలు ఆచరిస్తారని మండిపడ్డారు. ఇందుకోసం పెద్ద ఎత్తున భద్రతా ఏర్పాట్లు, ఇతర సౌకర్యాలను కల్పిస్తున్నామని వివరించారు. దాదాపు రూ.9 కోట్ల వ్యయంతో అమ్మవారి పుష్కరిణి ఆధునీకరణ పనులు జరుగుతున్నాయని... త్వరలో నీటిని నింపి పుష్కరిణి అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు. బ్రహ్మోత్సవాలకు విచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని విభాగాల అధికారులు విస్తృతంగా ఏర్పాట్లు చేపడుతున్నారని టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర రెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఈవో ఏవీ ధర్మారెడ్డి, టీటీడీ బోర్డు సభ్యులు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, జేఈవో వీరబ్రహ్మం, సీవీఎస్వో నరసింహ కిషోర్,డిప్యూటీ ఈవో గోవిందరాజన్, అర్చకులు పాల్గొన్నారు.