అప్పటి వరకు చంద్రబాబు జైల్లోనే: కస్టడీ పిటిషన్‌పై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును కస్టడీకి ఇవ్వాలంటూ సీఐడీ దాఖలు చేసిన పిటిషన్‌పై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది.

Update: 2023-09-13 06:05 GMT

దిశ, డైనమిక్ బ్యూరో : ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును కస్టడీకి ఇవ్వాలంటూ సీఐడీ దాఖలు చేసిన పిటిషన్‌పై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. స్కిల్ స్కామ్ కేసులో మరింత దర్యాప్తు జరపాల్సి ఉందని ఇందులో భాగంగా చంద్రబాబును విచారించాల్సి ఉందని సీఐడీ అభిప్రాయపడింది. ఈ మేరకు చంద్రబాబును ఐదు రోజులపాటు రిమాండ్‌కు ఇవ్వాలని కోరుతూ ఏసీబీ కోర్టులో సీఐడీ పిటిషన్ దాఖలు చేసింది. ఈ అంశంపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు హైకోర్టును ఆశ్రయించారు. రిమాండ్ రిపోర్టును సవాల్ చేస్తూ మాజీ అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది. ఈ విచారణలో భాగంగా చంద్రబాబును కస్టడీకి ఇవ్వొద్దంటూ న్యాయవాదులు వాదించారు. అయితే ఇందుకు కౌంటర్ దాఖలు చేయాలని ఏపీ హైకోర్టు సీఐడీని ఆదేశించింది. ఇందుకు సీఐడీ సమయం కోరగా అందుకు హైకోర్టు అనుమతి ఇచ్చింది.ఈనెల 18లోపు కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. అదే సమయంలో ఈనెల 18 వరకు కస్టడీ పిటిషన్‌పై ఎలాంటి విచారణ చేపట్ట వద్దని ఏసీబీ కోర్టుకు హైకోర్టు సూచించింది. అనంతరం తదుపరి విచారణను ఈనెల 19కు వాయిదా వేసింది. అయితే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఈనెల 18 వరకు రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులోనే ఉండనున్నారు.

More News : రాజమండ్రి సెంట్రల్ జైలులో చంద్రబాబు

Tags:    

Similar News