వేదవతికీ గుండె కోత

ఆంధ్ర-కర్ణాటక సరిహద్దులో ఉన్న చెక్ పోస్టులు తీసివేయడం కూడా ఇసుక దోపిడీకి వరంగా మారింది. వేదవతి పరివాహక ప్రాంతంలోని రైతులు ఏర్పాటు చేసుకున్న బోర్లను సైతం ఇసుక కోసం తవ్వుతున్నారు.

Update: 2023-02-09 02:21 GMT

రాయదుర్గం నియోజకవర్గంలో ఇసుకాసురులు రెచ్చిపోతున్నారు. వేదవతి నదిని పట్టపగలే కొల్లగొడుతున్నారు. అధికార పార్టీకి చెందిన ఒక ప్రజా ప్రతినిధి అండతో ఇసుకను ప్రధాన ఆదాయ వనరుగా మార్చుకొని పెద్ద ఎత్తున కర్ణాటకకు తరలిస్తున్నారు. పట్టపగలు ట్రాక్టర్లతో ఇసుకను అక్రమంగా రవాణా చేస్తున్న పోలీసులు, సెబ్ అధికారులు చోద్యం చూస్తున్నారు.

దిశ, అనంతపురం: ఆంధ్ర-కర్ణాటక సరిహద్దులో ఉన్న చెక్ పోస్టులు తీసివేయడం కూడా ఇసుక దోపిడీకి వరంగా మారింది. వేదవతి పరివాహక ప్రాంతంలోని రైతులు ఏర్పాటు చేసుకున్న బోర్లను సైతం ఇసుక కోసం తవ్వుతున్నారు. నదీ పరీవాహక ప్రాంతాలలోని చింత వనాలను సైతం పెకిలించి వేస్తున్నారు. దీనిపై అన్నదాతలు కలెక్టర్ కు మొరపెట్టుకోవడం తో కొన్ని రోజులు తవ్వకాలు నిలిపివేసినా మళ్లీ మొదలు పెట్టడం గమనార్హం. ఇలా ప్రతి రోజూ డీ హీరేహాళ్, బొమ్మనహాళ్ మండలాల నుంచి సుమారు 100 ట్రాక్టర్లకుపై ఇసుక తరలిస్తున్నారు.

నాడు-నేడు పేరుతో టోకరా

ఇసుక ట్రాక్టర్లను ఎప్పుడైనా ఎవరైనా సెబ్ అధికారులు పట్టుకుంటే నాడు-నేడు పనుల పేర్లు చెప్పి తప్పించుకుంటున్నారు. ఇందుకు నియోజకవర్గ పరిధిలోని కొందరు ప్రధానోపాధ్యాయులు సహకరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. నాడు-నేడు పనులకు ఇసుక అవసరం ఉందంటూ తేదీ వేయకుండానే కొంత మంది ప్రధానోపాధ్యాయులు లేఖలను సంతకాలు చేసి ఇచ్చేస్తున్నారు. ఇలా ప్రతినిత్యం ఇసుక తరలించే సుమారు 12 మంది ట్రాక్టర్ డ్రైవర్లకు వీటిని అందజేస్తుండడం గమనార్హం. అధికారులు పట్టుకుంటే ఆ రోజు తేదీ వేస్తున్నారు. ప్రస్తుతం నియోజకవర్గంలో నాడు-నేడు రెండో విడత పనులు నత్తనడకన సాగుతున్నాయి.

అయితే ఇసుక ఎక్కడికి తరలిస్తున్నారో అధికారులకే తెలియాలి. ఈ ఇసుక దందాకు అధికార పార్టీ వారే సూత్రధారులు కావడంతో అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. డీ హీరేహాళ్, బొమ్మనహల్ మండలాల పరిధిలోని పోలీసులు పూర్తిగా సహకరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒకవేళ ఉన్నతాధికారుల ఒత్తిడితో వైకాపా నాయకుల ట్రాక్టర్లపై కేసులు నమోదు చేయాల్సి వస్తే సంబంధిత అధికారులు సెలవులపై వెళ్లిపోవడం గమనార్హం.

రోజుకు రూ.12 లక్షల ఆదాయం

బొమ్మనహల్, డి హీరేహాళ్ మండలాలకు చెందిన ఇద్దరు వైకాపా నాయకులు వేదవతి నదిలో ఇసుకను పగటి పూట 12 ట్రాక్టర్ ద్వారా తరలిస్తున్నారు. తెల్లవారుజామున 4 నుంచి సాయంత్రం 6 వరకు ఈ ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా కొనసాగుతూనే ఉంది. రెండు మండలాల్లో ముందే ఎంపిక చేసుకున్న ప్రాంతాల్లో ఇసుకను తవ్వి నిలువ చేస్తున్నారు. ఆ తర్వాత రాత్రి సమయాల్లో లారీల్లో నింపి కర్ణాటకలోని బళ్లారి, బెంగళూరు ప్రాంతాలకు తరలించి వేస్తున్నారు. ఇలా ఒక్కో లారీ ఇసుకను రూ.30 వేల నుంచి రూ. 60 వేల వరకు విక్రయిస్తున్నారు.

రోజుకు 20 నుంచి 25 లారీల్లో ఇసుకను అక్రమంగా యథేచ్ఛగా తరలిస్తున్నారు. దీంతో వీరికి ప్రతి రోజూ రూ.10 లక్షల నుంచి రూ.12 లక్షల వరకు ఆదాయం వస్తున్నట్లు అధికార పార్టీ నాయకులు పేర్కొంటున్నారు. అయితే ఇందులో ఒక ప్రజా ప్రతినిధి కుమారుడికి 50 శాతం వాటా వెళ్లనున్నట్లు తెలుగుదేశం పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. వేదవతి లోని ఇసుకను ట్రాక్టర్ల ద్వారా ఉరవకొండ, గుంతకల్లు తదితర ప్రాంతాలకు తరలిస్తున్నారు.

ఎండిపోతున్న బోర్లు

గత ఏడాది వేదవతి నదికి భారీగా వరదలు రావడం తో ఇసుక మేటలు వేసుకుంది. ముఖ్యంగా తిమ్మలాపురం, కొలిగనహళ్లి, లింగ దహాల్, ఉద్దేహళ్ గ్రామాల పరిధిలో రోజు 100 ట్రాక్టర్లలో ఇసుక తరలిపోతోంది. ఇలా విచ్చలవిడిగా తవ్వకాలు జరుపుతూ ఉండడంతో నదిలో పెద్ద పెద్ద గోతులు ఏర్పడ్డాయి. ఆయా గ్రామాల పరిధిలోని రైతులు నదిలో సుమారుగా 1000 వరకు బోర్లు వేసుకుని పంటలు పండిస్తున్నారు. వీటిని కూడా తవ్వి వేస్తూ ఉండడంతో అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి : నెక్స్ట్ జగన్ వ్యూహం ఇదేనా....?

Tags:    

Similar News