దిశ, వెబ్‌డెస్క్ : ఏపీకి రాష్ట్ర వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం నేడు వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. చెన్నైకి 950 కిలోమీటర్ల దూరంలో వాయుగుండం కేంద్రీకృతం అవుతుంది, దీని ప్రభావంతో రానున్న 24 గంటల్లో తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని పేర్కొంది. ఇది మరింత బలపడుతూ ఉత్తర తమిళనాడు తీరానికి, పయనిస్తోందని వాతావరణ శాఖ వెల్లడించింది. దీని కారణంగా నేటి నుంచి తమిళనాడులో చెదురుముదురు వర్షాలు కురవగా, రేపటి నుంచి మూడు రోజుల పాటు దక్షిణ కోస్తా, రాయలసీమలో వర్షాలు పడతాయని అధికారులు తెలిపారు. కొన్ని చోట్ల భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు.