తెలంగాణలో ఓటు వేసిన వారు ఏపీలో ఓటు వేయకుండా చర్యలు తీసుకోండి: ఎమ్మెల్సీ అప్పిరెడ్డి

తెలంగాణలో ఓటు వేసిన వారు ఏపీలో ఓటు వేయకుండా చర్యలు తీసుకోవాలని వైసీపీ డిమాండ్ చేసింది.

Update: 2023-12-06 06:16 GMT

దిశ,డైనమిక్ బ్యూరో : తెలంగాణలో ఓటు వేసిన వారు ఏపీలో ఓటు వేయకుండా చర్యలు తీసుకోవాలని వైసీపీ డిమాండ్ చేసింది. ఈ మేరకు ఎన్నికల కమిషన్‌ కలెక్టర్లకు ప్రత్యేక ఆదేశాలు ఇవ్వాలని మంత్రి మేరుగు నాగార్జున, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ఎమ్మెల్సీ అప్పిరెడ్డిలు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్‌ కుమార్‌కు విజ్ఞప్తి చేసింది. హైదరాబాద్‌లో ఓటు వేసిన వారు ఏపీలో ఓటు వేసేందుకు సిద్ధంగా ఉండటం ప్రజాస్వామ్యానికి మంచిది కాదని సూచించారు. అనంతరం శాసనమండలిలో విప్, పార్టీ ప్రధాన కార్యదర్శి లేళ్ళ అప్పిరెడ్డి మీడియాతో మాట్లాడారు. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్‌పై మండిపడ్డారు. మాజీ ఐఏఎస్ అధికారి ముసుగులో అపర మేధావి అయిన రమేష్ కుమార్ సిటిజన్ ఫర్ డెమక్రసీ పేరుతో సంస్ధ పెట్టి కార్యదర్శిగా ఉంటూ ప్రజాస్వామ్య వ్యతిరేకంగా,రాజ్యంగ వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. ఐఏఎస్ అధికారి, మాజీ ఎన్నికల కమిషనర్ ముసుగులో టీడీపీ కార్యకర్తలా పనిచేయడం కాదన్నారు. కావాలంటే ముసుగు తీసి టీడీపీ కండువా కప్పుకుని పనిచేయాలని... దమ్ము,ధైర్యం ఉంటే చంద్రబాబు చేస్తున్న అక్రమాలపై మాట్లాడాలని సవాల్ విసిరారు. నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఎన్నికల కమిషనర్‌గా పనిచేసినప్పుడు ఎన్ని అక్రమాలకు పాల్పడ్డావో ప్రజలందరికి తెలుసునన్నారు. టీడీపీకి ఎలా అనుకూలంగా పనిచేశావో గుర్తుతెచ్చుకో అని సూచించారు. ఇకనైనా దొంగవేషాలు మానుకోవాలని ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి సూచించారు. వాలంటీర్లను ఓటర్ల జాబితా కు సంబంధించి వినియోగించకపోయినా కూడా వాలంటీర్లను వాడుతున్నారని సుప్రీంకోర్టులో కేసు వేసి దుర్మార్గానికి ఒడిగట్టారని అన్నారు. నిమ్మగడ్డ లాంటి వ్యక్తుల ఆటలు ఎల్లకాలం కొనసాగవని శాసనమండలిలో విప్, పార్టీ ప్రధాన కార్యదర్శి లేళ్ళ అప్పిరెడ్డి హెచ్చరించారు. 

Tags:    

Similar News