Thirumala Laddu Issue: కల్తీ నెయ్యి రాజకీయం.. జగన్ పై టీడీపీ సంచలన ఆరోపణలు

తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగిందని ఎన్డీడీబీ ఇచ్చిన రిపోర్టుతో కొద్ది రోజులుగా తీవ్ర దుమారం రేగుతోంది.

Update: 2024-10-05 11:51 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగిందని ఎన్డీడీబీ ఇచ్చిన రిపోర్టుతో కొద్ది రోజులుగా తీవ్ర దుమారం రేగుతోంది. దీనిపై అధికార విపక్షాలు ఒకరిపై మరొకరు తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే తిరుమల లడ్డూలో కలిపే నెయ్యిలో కల్తీ జరిగిందని, దానికి కారణం వైసీపీ ప్రభుత్వమేనని టీడీపీ వర్గాలు సంచలన ఆరోపణలు చేస్తున్నాయి. జగన్ ప్రసాదంలో కలిపే నెయ్యి విషయంలో రివర్స్ టెండర్ల ద్వారా అర్హత లేని కంపెనీకి కాంట్రాక్టు అప్పగించి, నెయ్యి కల్తీ అయ్యేందుకు కారణమయ్యారని విమర్శలు చేస్తున్నారు. జగన్ హయాంలో టీటీడీకి నెయ్యి సరఫరా చేసేందుకు తొమ్మిది కంపెనీలు బిడ్ దాఖలు చేస్తే నెయ్యి ఉత్పత్తి సామర్ధ్యం లేని ఏఆర్ డెయిరీకి కాంట్రాక్టు ఎందుకు ఇచ్చారని ప్రశ్నిస్తున్నారు.

ఎక్కువకు కొని, తక్కువకి అమ్మడంలో ఉన్న మతలబు ఏంది?

అంతేగాక నెయ్యి సరఫరాపై ఓ జాతీయ మీడియాలో వచ్చిన వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ.. జగన్ కల్తీ నెయ్యి అంశం బయటపడిందని సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. తిరుమలకి నెయ్యి సరఫరా చేసిన ఏఆర్‌ డెయిరీ తిరుపతి సమీపంలోని పునబాక వైష్ణవి డెయిరీ నుంచి నెయ్యి కొనుగోలు చేసిందని, ఆ వైష్ణవి డెయిరీ ఉత్తరాఖండ్‌ రాష్ట్రంలోని భోలేబాబా ఆర్గానిక్‌ డెయిరీ నుంచి నెయ్యి కొన్నట్లు వాణిజ్య పన్నుల శాఖ డాకుమెంట్స్ లో తేలిందని పోస్టులు పెడుతున్నారు. 3,300 కిలోమీటర్ల ప్రయాణంలో కల్తీ జరగలేదంటారా? వైసీపీ నాయకులు చెప్పాలని నిలదీస్తున్నారు. అలాగే కోట్ల మంది శ్రీవారి భక్తులు విశ్వసించే లడ్డూ ప్రసాదంలో కూడా జగన్ అవినీతి చేశాడని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక భోలేబాబా డెయిరీ నుంచి వైష్ణవి డెయిరీ కిలో నెయ్యిని రూ.355కి కొని.. ఏఆర్‌ డెయిరీకి రూ.318.57కి ఇచ్చిందని, అదే నెయ్యిని, అవే ట్యాంకర్లలో ఏఆర్‌ డెయిరీ టీటీడీకి కిలో రూ.319.80కి సరఫరా చేసిందని చెబుతూ.. ఎక్కువకి కొని, తక్కువకు అమ్మడంలో ఉన్న మతలబు ఏంటని, కల్తీ చేస్తేనే కదా అలా అమ్మేది అంటూ.. ఇందులో కుట్ర కోణం లేదా? జగన్ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.

కల్తీ జరిగింది కాబట్టే సిట్ వద్దంటున్నారు..

ఇదిలా ఉండగా.. చంద్రబాబు సహా అధికార పక్ష నేతలంతా సుప్రీం కోర్టు వేసిన సిట్ ను స్వాగతిస్తుంటే.. జగన్ మాత్రం సిట్ వద్దు.. బిట్ వద్దు.. అని అంటున్నాడని, తప్పు చేయకపోతే జగన్ సిట్ ఎందుకు వద్దంటున్నాడో చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. సిట్ వస్తే.. జగన్ కల్తీ నెయ్యి బండారం బయటపడుతుందనే వద్దంటున్నట్లు పార్టీ శ్రేణులు ఆరోపణలు చేస్తున్నారు. అలాగే ఇంత జరిగినా జగన్ కు బుద్ది రాలేదని, సుప్రీంకోర్టు ఒకపక్క లడ్డూ కల్తీ అంశాన్ని రాజకీయం చేయోద్దని చెబుతుంటే.. మరోపక్క జగన్ ప్రెస్ మీట్లు పెట్టి మరి లడ్డూ వ్యవహారానికి రాజకీయ రంగు పులుముతున్నారని పార్టీ శ్రేణులు మండిపడుతున్నారు. ఇకనైనా జగన్ తీరు మార్చుకొని లడ్డూ వ్యవహారంలో కల్తీ జరిగిందని ఒప్పుకొని, శ్రీవారి భక్తులను క్షమాపణలు కోరాలని అధికార పార్టీ శ్రేణులు నెట్టింట పోస్టులు పెడుతున్నారు.


Similar News