AP Politics:ఈ ఎన్నికలు ఐదేళ్ల భవిష్యత్త్‌ని నిర్ణయిస్తాయి..సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు
ఈ ఎన్నికలు ఐదేళ్ల భవిష్యత్ నిర్ణయిస్తాయని వైసీపీకి ఓటేస్తే పథకాలు కొనసాగుతాయని గురువారం కళ్యాణదుర్గం ఎన్నికల ప్రచారంలో సీఎం జగన్ ప్రసంగించారు.
దిశ,కళ్యాణదుర్గం: ఈ ఎన్నికలు ఐదేళ్ల భవిష్యత్ నిర్ణయిస్తాయని వైసీపీకి ఓటేస్తే పథకాలు కొనసాగుతాయని గురువారం కళ్యాణదుర్గం ఎన్నికల ప్రచారంలో సీఎం జగన్ ప్రసంగించారు. అలాగే ఇంటింటా అభివృద్ధి జరగాలంటే సీఎం జగన్‌కి ఓటు వేయాలన్నారు. పొరపాటున బాబుకు ఓటేస్తే.. పథకాలు ముగింపే అన్నారు. ఈ కార్యక్రమంలో సీఎం జగన్ మాట్లాడుతూ..59 నెలల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాం మేనిఫెస్టోలోని 99 శాతం హామీలను నెరవేర్చమన్నారు. 2 లక్షల 31 వేల ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించాం, అక్కచెల్లెమ్మలకు నేరుగా రూ.2 లక్షల 70 వేల కోట్లు వేశామని చెప్పారు. మేనిఫెస్టోను చెత్త బుట్టలో వేసిన రోజులు గతంలో చూశామని, మేనిఫెస్టోకు విశ్వసనీయతకు అర్ధం చెప్పింది మీ బిడ్డే అన్నారు.
నాడు-నేడు ద్వారా ప్రభుత్వ స్కూళ్ల రూపురేఖలు మార్చిన ఘనత వైసీపీ ప్రభుత్వనేదే అన్నారు. అక్కాచెల్లెమ్మల కోసం ఆసరా, సున్నా వడ్డీ, చేయూత , కాపు నేస్తం, ఈబీసీ నేస్తం అమలు చేసిన ప్రభుత్వం తమదే అన్నారు. అంతే కాదు అక్కాచెల్లెమ్మల పేరుపై 31 లక్షల ఇళ్ల పట్టాలిచ్చాం, అందులో 22 లక్షల ఇళ్లు కడుతున్నాం అన్నారు. గతంలో ఎప్పుడైనా ఇంత మంచి జరిగిందా? అని ప్రశ్నించారు. అవ్వాతాతలకు ఇంటి వద్దకే రూ.3వేల పెన్షన్ , ఇంటి వద్దకే పౌర సేవలు, సంక్షేమ పథకాలు - పెట్టుబడి సాయంతో రైతన్నకు తోడుగా ఉన్నాం అన్నారు. రైతులకు పగటిపూటే 9 గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్నాం, సకాలంలో ఇన్‍పుట్ సబ్సిడీ అందిస్తున్నాం, పేదవాడి ఆరోగ్యం కోసం ఇంతగా పరితపించిన ప్రభుత్వం ఉందా? అని ప్రజలను ప్రశ్నించారు.
ఈ క్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు పై విమర్శల వర్షం కురిపించారు. 14 ఏళ్లు సీఎంగా చేశానని చెప్పుకునే చంద్రబాబు ఏం చేశాడు? చంద్రబాబు పేరు చెప్తే ఒక్క పథకమైనా గుర్తుకొస్తుందా? 2014లో ఆయన చేసిన మోసాలు గుర్తున్నాయా? రైతు రుణమాఫీ చేస్తానన్నాడు..చేశాడా? పొదుపు సంఘాల రుణాలు మాఫీ అన్నాడు.. చేశాడా? అని చెప్పారు. ఆడబిడ్డ పుడితే రూ.25 వేలు డిపాజిట్ చేస్తానన్నాడు..చేశాడా? ఇంటింటికి జాబ్.. లేదంటే నిరుద్యోగ భృతి అన్నాడు..ఇచ్చాడా? పేదలకు 3 సెంట్ల స్థలం అన్నాడు.. సెంటు స్థలమైనా ఇచ్చాడా? అని తెలిపారు. మళ్లీ ఇప్పుడు కొత్త కొత్త మోసాలతో వస్తున్నారు.. మీరు నమ్ముతారా? అంటూ ప్రజల పై ప్రశ్నల వర్షం కురిపించారు. ఇక ఏపీలో వాలంటీర్ల సేవలు కొనసాగాలంటే రెండు బటన్లు ఫ్యాన్‍పై నొక్కాలని తెలిపారు. ఈ ఎన్నికల్లో 175కు 175 అసెంబ్లీ, 25కు 25 ఎంపీ సీట్లు గెలవాల్సిందే అని వైఎస్ జగన్ అన్నారు.