నాతో పోటీకి వచ్చే సరైన క్యాండిడేట్ లేడు.. జనసేన రెబల్ ఎమ్మెల్యే రాపాక
ఏపీలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ వివిధ రాజకీయ పార్టీలు ఎత్తులకు పైఎత్తులు వేస్తూ.. కదనరంగంలోకి దిగాయి.
దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ వివిధ రాజకీయ పార్టీలు ఎత్తులకు పైఎత్తులు వేస్తూ.. కదనరంగంలోకి దిగాయి. ఈ క్రమంలో జనసేన రెబల్ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ కీలక వ్యాఖ్యలు చేశారు. రానున్న ఎన్నికల్లో రాజోలులో తనపై పోటీ చేసేందుకు ఏ పార్టీకి సరైన అభ్యర్థి లేడని స్పష్టం చేశారు. సీఎం జగన్ అనుకున్న 175 సీట్ల లక్ష్యం చేరాలంటే అందరూ కలిసి పని చేయాలని అన్నారు. కొత్త ముఖాలను పరిచయం చేయడం కోసమే సీఎం జగన్ అభ్యర్థుల మార్పునకు శ్రీకారం చుట్టారని తెలిపారు. రాజోలులో వైసీపీ నుంచి తనకు పోటీ వచ్చే సరైన క్యాండిడేట్ లేడని ధీమా వ్యక్తం చేశారు. తాను ప్రజల్లో గడపగడపకు తిరిగుతూ నిత్యం ప్రజల్లో ఉంటున్నానని అన్నారు.
ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని తనకు సీటు కన్ఫామ్ అని స్వయంగా సీఎం జగన్‌మోహన్ రెడ్డి తనకు చెప్పినట్లుగా రాపాక వెల్లడించారు. అయితే, కొంతమంది కావాలని తనకు సీటు లేదని ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే వైసీపీని తిరిగి అధికారంలోకి తీసుకొస్తాయని అన్నారు. మరో వైపు టీడీపీ జనసేన పొత్తుకు భయపడేదే లేదని, ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా వైసీపీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రిగా మళ్లీ జగనే ప్రమాణ స్వీకారం చేస్తారని పేర్కొన్నారు. అయితే, గత ఎన్నికల్లో జనసేన నుంచి రాజోలు ఎమ్మెల్యేగా గెలిచిన రాపాక వరప్రసాద్ అనంతరం అధికార పార్టీ అయిన వైసీపీలో చేరారు.