Anam: చర్చలు అసంపూర్తిగా జరిగితే ఒప్పుకునేది లేదు.. మంత్రి ఆనం కీలక వ్యాఖ్యలు
వ్యవసాయ శాఖపై గ్రామీణ స్థాయిలో చర్చ జరగాలని, సర్పంచులు, రైతులతో అధికారులు సమావేశమవ్వాలని ఏపీ దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామ నారాయణ రెడ్డి అన్నారు.
దిశ, డైనమిక్ బ్యూరో: వ్యవసాయ శాఖపై గ్రామీణ స్థాయిలో చర్చ జరగాలని, సర్పంచులు, రైతులతో అధికారులు సమావేశమవ్వాలని ఏపీ దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామ నారాయణ రెడ్డి అన్నారు. నెల్లూరులో జెడ్పీ చైర్ పర్సన్ ఆనం అరుణమ్మ అధ్యక్షతన జిల్లా పరిషత్ సాధారణ సర్వ సభ్య సమావేశానికి హాజరైన ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. సమావేశానికి పార్టీలతో సంబందం లేకుండా మంత్రులు, ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు హాజరు కావడం సంతోషంగా ఉందన్నారు. ప్రభుత్వం వ్యవసాయ శాఖ పై ప్రత్యేక దృష్టి పెట్టిందని చెబుతూ.. దీనిపై గ్రామీణ స్థాయిలో చర్చలు జరగాల్సి ఉందన్నారు. వ్యవసాయంపై సర్పంచ్ లు, రైతులతో అధికారులు చర్చించాలని, వీలైతే గ్రామ, మండల స్థాయిలో సమావేశాలు నిర్వహించాలని అధికారులకు సూచించారు. ఈ చర్చలు అసంపూర్తిగా జరిగితే ఒప్పుకునేది లేదని, రైతులతో వ్యవసాయంపై సమగ్ర చర్చలు జరపాలని మంత్రి ఆదేశించారు.