Nellore: నాగబాబు పర్యటన నేపథ్యంలో ఉద్రిక్తత.. కమిషనర్‌తో జనసైనికుల వాగ్వాదం
నెల్లూరులో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. జనసేన, మున్సిపల్ అధికారుల మధ్య వాగ్వాదం జరిగింది...
దిశ, వెబ్ డెస్క్: నెల్లూరులో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. జనసేన, మున్సిపల్ అధికారుల మధ్య వాగ్వాదం జరిగింది. జనసేన పార్టీ నేత నాగబాబు ఇవాళ నెల్లూరులో పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో జనసేన ఫ్లెక్సీలను కార్యకర్తలు ఏర్పాటు చేశారు. అయితే జనసేన ఫ్లెక్సీలను తొలగించేందుకు మున్సిపల్ సిబ్బంది యత్నించారు. దీంతో జనసేన కార్యకర్తలు అడ్డుకున్నారు. అధికార పార్టీ నేతల ఒత్తిళ్లకు లొంగి తమ ఫ్లెక్సీలను తొలగించే ప్రయత్నం చేస్తున్నారని జనసేన కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మున్సిపల్ కమిషనర్‌తో వాగ్వాదానికి దిగారు.
ఎంపీ అదాల, వైసీపీ నేతల ఫ్లెక్సీలు నెలల తరబడి ఉంటే పట్టించుకోని మున్సిపల్ అధికారులు.. తమ పార్టీ నేతల ఫ్లెక్సీలు ఎందుకు తొలగిస్తుననారంటూ అంటూ జనసేన కార్యకర్తలు మండిపడ్డారు. అధికార పార్టీకి అనుకూలంగా మున్సిపల్ అధికారులు వ్యవహరిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. అయితే ఆందోళనకారులను అదుపులోకి తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్ ఆదేశించడంతో ఒక్కసారిగా ఉద్రిక్తత చోటు చేసుకుంది. మున్సిపల్ కమిషనర్ తీరుకు వ్యతిరేకంగా జనసైనికులు నినాదాలు చేశారు. జనసేన ఫ్లెక్సీలు తొలగించాల్సిందేనని మున్సిపల్ సిబ్బందికి కమిషనర్ ఆదేశించి అక్కడి నుంచి వెళ్లిపోయారు. దీంతో జనసేన సైనికులు నిరసన వ్యక్తం చేశారు.