వాషింగ్ మెషీన్లో గుట్టలు గుట్టలుగా నోట్ల కట్టలు, మెుబైల్ ఫోన్లు

వాషింగ్ మెషీన్లతో ఓ సుజుకీ వాహనం వెళ్తుంది. దాని వెనుక ఒక యువకుడు ఫైలెట్‌గా బైక్‌పై వెళ్తున్నాడు.

Update: 2023-10-25 05:26 GMT

దిశ, డైనమిక్ బ్యూరో : వాషింగ్ మెషీన్లతో ఓ సుజుకీ వాహనం వెళ్తుంది. దాని వెనుక ఒక యువకుడు ఫైలెట్‌గా బైక్‌పై వెళ్తున్నాడు. ఆటోలో మరో యువకుడు సైతం ఉన్నారు.వీరిపై పోలీసులకు అనుమానం వచ్చింది. వాహనం ఆపి ఆరా తియ్యగా వాషింగ్ మెషీన్లను విజయవాడ తరలిస్తున్నట్లు వెల్లడించారు. దాంతో పోలీసుల అనుమానం మరింత రెట్టింపైంది. విశాఖ పట్నం నుంచి పరిసర ప్రాంతాల్లోకి వాషింగ్ మెషీన్లు తరలిస్తే ఒకే కానీ ఇక్కడ నుంచి విజయవాడకు తరలించడం ఏంటని ప్రశ్నించారు. అనుమానంతో వాషింగ్ మెషీన్లు తనిఖీ చేయగా పోలీసుల ఫీజులు ఎగిరిపోయేలా నోట్ల కట్టలు దర్శనమిచ్చాయి. ఈ ఘటన విశాఖలో వెలుగులోకి వచ్చింది. విశాఖపట్నం నుంచి ఎలక్ట్రానిక్ వస్తువులతో వెళుతున్న ఓ ఆటోను ఎన్ఏడీ జంక్షన్ వద్ద పోలీసులు తనిఖీలు చేశారు. ఆటోలో ఆరు వాషింగ్ మెషీన్లు ఉన్నాయి. వాటిని తనిఖీ చేయగా అందులో నోట్ల కట్టలు దర్శనమిచ్చాయి. దీంతో పోలీసులు షాక్ అయ్యారు. వాషింగ్ మెషీన్లో గుట్టల కొద్దీ నోట్లకట్టలు బయటపడటంతో అన్నింటిని తనిఖీ చేశారు. మెుత్తం రూ.1.30 కోట్లు విలువ చేసే నోట్ల కట్టలు బయటపడ్డాయి. వీటితోపాటు 30 మొబైల్ ఫోన్లు కూడా లభించాయి. దీంతో పోలీసులు వాహనాన్ని, డబ్బు, మెుబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.

నగదుపై పోలీసుల ఆరా

వాషింగ్ మెషిన్లను విజయవాడకు తరలిస్తున్నట్లు ఆటో డ్రైవర్ పోలీసులకు తెలిపాడు. అయితే వాషింగ్ మెషీన్లలో నోట్ల కట్టలు ఉన్న విషయం తనకు తెలియదని చెప్పుకొచ్చాడు. అయితే నగదుకు సంబంధించి ఇతర పత్రాలు ఇవ్వాలని పోలీసులు కోరగా అసలు తమకేమీ తెలియదన్నారు. మెుబైల్ ఫోన్లు ఎక్కడ నుంచి కొనుగోలు చేశారని ప్రశ్నించగా వీటి గురించి తనకు ఏమీ తెలియదని ఆటో డ్రైవర్ బోరున విలపించారు. ఇంతలో విశాఖకు చెందిన ఓ ప్రముఖ ఎలక్ట్రానిక్ కంపెనీ నుంచి పోలీసులకు ఫోన్ వచ్చింది. ఆ నగదును విజయవాడలోని బ్యాంక్‌లో జమ చేయాల్సి ఉందని అందుకే అందులో తరలిస్తున్నట్లు పోలీసులకు తెలిపారు. అయితే సమాధానం సరిగ్గా లేకపోవడంతో పోలీసులు ఆటోను, బైక్‌ సీజ్ చేశారు. నగదు, మెుబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వాషింగ్ మెషీన్లలో గుట్టలు గుట్టలుగా నోట్ల కట్టలు దొరకడంపై చర్చనీయాంశంగా మారింది.

Tags:    

Similar News