స్టిక్కర్ల ప్రభుత్వాన్ని స్టిక్కుతో కొట్టే టైం వచ్చింది: తులసి రెడ్డి
వైసీపీ ప్రభుత్వం స్టికర్ల ప్రభుత్వం అని కాంగ్రెస్ పార్టీ మీడియా చైర్మన్ డా. ఎన్ తులసిరెడ్డి అన్నారు..
దిశ, డైనమిక్ బ్యూరో: వైసీపీ ప్రభుత్వం స్టికర్ల ప్రభుత్వం అని కాంగ్రెస్ పార్టీ మీడియా చైర్మన్ డా. ఎన్ తులసిరెడ్డి అన్నారు. 'మా నమ్మకం నువ్వే జగన్' పేరుతో స్టిక్కర్లను ప్రతీ ఇంటికి అతికించాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. వైఎస్ జగన్ను సొంత కుటుంబ సభ్యులే నమ్మలేని స్థితిలో ఉన్నప్పుడు ప్రజలు ఎలా నమ్ముతారని ఎద్దేవా చేశారు. ఈ స్టికర్ ప్రభుత్వాన్ని త్వరలోనే ప్రజలు స్టిక్కుతో కొడతారని చెప్పుకొచ్చారు.
వైఎస్ జగన్కు అప్పుడే ఓటమి భయం పట్టుకుందని అందుకే స్టిక్కర్లు అతికించాలని ఆదేశిస్తున్నారని చెప్పుకొచ్చారు. రాష్ట్రాన్ని అప్పుల ఆంధ్రప్రదేశ్గా, అవినీతి, అరాచక, ఆంధ్రప్రదేశ్గా మార్చినందుకు నమ్మాలా.. లేక మద్యం, జూదం ఆంధ్రప్రదేశ్గా మార్చినందుకా.. మా నమ్మకం నువ్వే జగన్ అని అనాలా అని నిలదీశారు. రైతులు, మహిళలు, ఉద్యోగులు, నిరుద్యోగులు, విద్యార్థులు, సర్పంచులు, కాంట్రాక్టర్లు ఇలా ఒక్కరేంటి అన్ని రంగాల ప్రజలను నమ్మించి మోసం చేసినందుకు నమ్మాలా అని కాంగ్రెస్ పార్టీ మీడియా చైర్మన్ తులసి రెడ్డి ధ్వజమెత్తారు.