Ap News: డీఎస్పీని కారుతో ఢీకొట్టి పరారైన దుండగులు.. వెంకటాచలం టోల్ ప్లాజా వద్ద ఘటన
వెంకటాచలం టోల్ ప్లాజా వద్ద తనికీలు నిర్వహిస్తున్న నెల్లూరు రూరల్ డీఎస్పీని కొందరు దుండగులు కారుతో ఢీ కొట్టి పరారయ్యారు.
దిశ, డైనమిక్ బ్యూరో: వెంకటాచలం టోల్ ప్లాజా వద్ద తనికీలు నిర్వహిస్తున్న నెల్లూరు రూరల్ డీఎస్పీని కొందరు దుండగులు కారుతో ఢీ కొట్టి పరారయ్యారు. ప్రమాదంలో గాయపడిన డీఎస్పీ శ్రీనివాసరావు ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటాచలం టోల్ ప్లాజా వద్ద ముందస్తు సమాచారంతో డీఎస్పీ ఘట్టమనేని శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పోలీసులు తనికీలు చేపట్టారు. ఈ నేపధ్యంలోనే నెల్లూరు నుంచి చెన్నై వెళుతున్న ఓ కారును ఆపే ప్రయత్నం చేయగా.. వేగంగా దూసుకొచ్చిన డ్రైవర్ డీఎస్పీ శ్రీనివాసరావును ఢీ కొట్టి పరారయ్యాడు. ఈ ప్రమాదంలో డీఎస్పీకి గాయలవ్వడంతో నెల్లూరు ప్రైవేట్ ఆసుప్రతిలో చికిత్స పొందుతున్నాడు. అనంతరం సమాచారం అందుకున్న వాకాడు సీఐ గూడూరు సాదుపేట వద్ద కారును అడ్డుకోబోయాడు.
దీంతో దుండగులు సీఐ హుస్సేన్ బాషాను కూడా ఢీ కొట్టి వెళ్లిపోయారు. జిల్లా సరిహద్దు ప్రాంతమైన మర్రిపాడు వద్ద నిందితులు కారును వదలేసి పారిపోయార. ప్రమాదానికి కారణమైన కారును స్వాధీనం చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. గంజాయి ముఠానే ఈ చర్యలకు పాల్పడిందని పోలీసులు అనుమానిస్తున్నారు. కారులో ఏం దొరికింది అన్న వివరాలను పోలీసులు గోప్యంగా ఉంచారు. ఘటనపై నెల్లూరు జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ ఆరా తీశారు. చికిత్స పొందుతున్న డీఎస్పీ శ్రీనివాస్ ను ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పరామర్శించారు. గంజాయి రవాణా ముఠానే ఆ అరచకానికి పాల్పడిందని, గంజాయి, డ్రగ్స్ అక్రమ రవాణాను సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళతానని సోమిరెడ్డి వెల్లడించారు.