నా జీవితంలో ఎన్నడూ చూడని విజయం ఇది: చంద్రబాబు నాయుడు

నా జీవితంలో ఎన్నడూ చూడని విజయమని, 151 సీట్లు ఉన్నాయని విర్రవీగిన వారు 11 సీట్లకే పరిమితమయ్యారని అదే ప్రజాస్వామ్యం అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు.

Update: 2024-09-18 16:56 GMT

దిశ, ఏపీ బ్యూరో: నా జీవితంలో ఎన్నడూ చూడని విజయమని, 151 సీట్లు ఉన్నాయని విర్రవీగిన వారు 11 సీట్లకే పరిమితమయ్యారని అదే ప్రజాస్వామ్యం అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. మంగళగిరిలోని సీకే కన్వెన్షన్‌లో ఎన్డీయే శాసనసభాపక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ గత ప్రభుత్వం నిధులు దుర్వినియోగం చేసిందని, కేంద్ర నిధులను పక్కదారి పట్టించిందని విమర్శించారు. కేంద్ర సహాయం వెంటిలేటర్ పై ఉన్న వ్యక్తికి ఆక్సిజన్ లాంటిదని, మూడు పార్టీల సమష్టి కృషితోనే ఇంతటి ఘన విజయం సాధించామని చంద్రబాబు అన్నారు. రాష్ట్రానికి రూ.10 లక్షల కోట్ల అప్పు, రూ.లక్ష కోట్ల పెండింగ్ బిల్లులు ఉన్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు నియోజకవర్గాల వారీగా విజన్ డాక్యుమెంట్లు రూపొందించుకోవాలని దిశా నిర్దేశం చేశారు. అధికారంలోకి వచ్చినప్పుడు ఖజానాలో ఎక్కడా డబ్బులు లేవని, జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి అయినా ధైర్యంతో ముందుకెళ్తున్నామని పేర్కొన్నారు. వచ్చే ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పన దిశగా పనిచేస్తున్నామని, కేంద్ర సహకారం లేకపోతే రాష్ట్రం అభివృద్ధి చెందదన్నారు.

తప్పు చేసిన వారికి శిక్ష పడాల్సిందే..

కొంచెం ఆలస్యం కావచ్చు కానీ, తప్పు చేసిన వారు ఎట్టి పరిస్థితుల్లో తప్పించుకోలేరని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. తప్పు చేసిన వారికి శిక్ష పడాల్సిందేనని హెచ్చరించారు. అన్నా క్యాంటీన్ రద్దు చేసి జగన్ దుర్మార్గమైన పని చేశారని దుయ్యబట్టారు. జగన్ సీఎంగా ఉన్నప్పుడే వాలంటీర్ల వ్యవస్థ గడువు ముగిసిందని, రెన్యువల్ చేయలేదని మండిపడ్డారు. వైసీపీ హయాంలో తప్పులు చేసిన వాళ్లని వదిలిపెట్టను, విచారణలు జరుగుతున్నాయన్నారు. అదే సమయంలో మనం తప్పులు చేయకుండా జాగ్రత్తపడాలని స్పష్టం చేశారు. అక్టోబర్ మొదటి వారంలో కొత్త మద్యం పాలసీ వస్తుందన్నారు.

చంద్రబాబు నాయకత్వంలో పని చేయడం సంతోషంగా ఉంది..

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ సీఎం చంద్రబాబు దార్శనికుడు అను నిత్యం తనను ఆశ్చర్యపరుస్తూనే ఉంటారని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. చంద్రబాబు నాయకత్వంలో పని చేయడం సంతోషంగా ఉందన్నారు. 100 రోజుల్లో చాలా హామీలు నెరవేర్చామని, పింఛన్ పెంచేందుకు ఖజానాలో డబ్బులు లేవన్నారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ పింఛన్లు పెంచామని, సంక్షేమంలో తిరుగులేని చరిత్ర సృష్టించామని పేర్కొన్నారు. గతంలో ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు సరైన సమయానికి వచ్చేవి కావని, నిర్జీవమవుతున్న పంచాయతీలకు సీఎం రూ.1,452 కోట్లు ఇచ్చారన్నారు. వైసీపీ సర్పంచ్లు ఉన్న పంచాయతీలకు కూడా నిధులు ఇస్తామని, అన్న క్యాంటీన్ల వల్ల పేదలు, కార్మికులకు లాభం జరుగుతుందని తెలిపారు.

చంద్రబాబు ఓపిక నన్ను ఆశ్చర్యపరుస్తుందని, పాతికేళ్ల యువకుడు కూడా చంద్రబాబులా కష్టపడలేరని పవన్ కళ్యాణ్ అన్నారు. సీఎం బురదలో దిగి నడుస్తుంటే వైసీపీ విమర్శలు చేస్తుందన్నారు. చంద్రబాబుపై అక్రమ కేసులు పెట్టి జైల్లో ఉంచినప్పుడు షూటింగ్‌లకు వెళ్లలేదని తెలిపారు. సమష్టి కృషితో లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించామని, మొదటి నుంచి 160 స్థానాలు గెలవాలని చంద్రబాబు చెబుతూనే ఉన్నారని పేర్కొన్నారు. చంద్రబాబులో భయం లేదని, అపారమైన అనుభవం ఉందన్నారు. మాజీ సీఎం జగన్, వైసీపీ నేతలు చంద్రబాబు కుటుంబ సభ్యుల్ని అవమాన పరిచారన్నారు. రాజమండ్రి జైల్లో కలిసినప్పుడు ఆయన గుండె ధైర్యాన్ని చూశానన్నారు. విభజన కాలం నుంచి జగన్ పాలన వరకు రాష్ట్రం నలిగిపోతూనే ఉందన్నారు. చంద్రబాబు నాయకత్వంలో పని చేయడం చాలా ఆనందంగా ఉందని పవన్ తెలిపారు.


Similar News