గెలిస్తే ఓకే.. ఓడిపోతే మన పరిస్థితేంటీ?.. వైసీపీ నేతల్లో టెన్షన్ స్టార్ట్!

‘వై ఏపీ నీడ్స్ జగన్’ కార్యక్రమాన్ని జనంలోకి తీసుకెళ్లేందుకు శుక్రవారం ఒంగోలులో ప్రకాశం జిల్లా వైసీపీ విస్తృత సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఇదే ఆందోళన వెలిబుచ్చారు.

Update: 2023-10-08 02:43 GMT

నిన్నమొన్నటిదాకా వైసీపీ క్యాడర్‌లో మళ్లీ గెలుస్తామనే ధీమా వ్యక్తమయ్యేది. ప్రతిపక్షాలు దరిదాపుల్లోకి రాలేవనే భరోసా ఉండేది. సీఎం జగన్ చెప్పినట్టు 175కు 175 రాకున్నా విజయానికి ఢోకా ఉండదనే విశ్వాసం తొణికిసలాడేది. టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టు, రిమాండ్‌తో వైసీపీ క్యాడర్ ఉలిక్కి పడింది. కొందరు నాయకులు, కార్యకర్తలు సంబరాలు చేసుకున్నా ఎక్కువ మందిని ఆలోచనలో పడేసింది. జనసేనాని టీడీపీతో పొత్తు ప్రకటించడంతో ఆందోళన మొదలైంది. వైసీపీ, టీడీపీ మధ్య భగ్గుమంటున్న విద్వేష వాతావరణంలో ఓటమిపాలైతే మన పరిస్థితేంటని వైసీపీ క్యాడర్ మదనపడుతోంది. నేతల్లోనూ ఆందోళన ప్రారంభమైనట్లు తెలుస్తోంది. అధికారంలో ఉన్నప్పుడు ప్రతీకార చర్యలకు దిగితే లేనప్పుడు అలాంటి దాడుల్నే ఎదుర్కోవాల్సి వస్తుందని నేతల్లో కలవరం మొదలైంది.

దిశ, ఏపీ బ్యూరో: ‘వై ఏపీ నీడ్స్ జగన్’ కార్యక్రమాన్ని జనంలోకి తీసుకెళ్లేందుకు శుక్రవారం ఒంగోలులో ప్రకాశం జిల్లా వైసీపీ విస్తృత సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఇదే ఆందోళన వెలిబుచ్చారు. టీడీపీ అధికారానికి వస్తే ఎవర్నీ వదలబోమని హెచ్చరికలు చేస్తున్న సందర్భంగా ఓటమి పాలైతే మన పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవాలని క్యాడర్‌కు హితవు పలికారు. ఏవైనా అభిప్రాయ బేధాలుంటే పక్కనపెట్టి ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా పనిచేయాలని ఉద్భోధించారు. వైసీపీ సీనియర్ నేతల్లో ఒకరైన బాలినేని పార్టీ ఓటమిపాలైతే భవిష్యత్తు ఎలా ఉంటుందో అర్థం చేసుకోవాలని నర్మగర్భంగా చెప్పారు. ఇదే భావన వైసీపీలోని క్షేత్ర స్థాయి కార్యకర్తల్లోనూ నెలకొన్నట్లు తెలుస్తోంది.

ప్రజా ప్రతినిధులను నిలదీస్తున్న ప్రజలు

ఇటీవల గుంటూరు తూర్పు ఎమ్మెల్యే ముస్తాఫాను నియోజకవర్గ ప్రజలు పలు సమస్యలపై నిలదీశారు. రోడ్లు, డ్రెయినేజీ కూడా మెరుగుపరచలేకుంటే ఇక ఎమ్మెల్యే ఎందుకన్నట్లు ఆయన పరువు తీశారు. అక్కడ నుంచి ఎమ్మెల్యే మౌనంగా వెళ్లిపోయారు. ఓ వైపు ప్రజల నుంచి అసంతృప్తి.. మరోవైపు చంద్రబాబు ఎపిసోడ్‌తో జనంలో పలుచనైపోయామన్న భావనతో ఇక ఎన్నికల్లో పోటీ చేయకూడదన్న నిర్ణయానికి వచ్చినట్లు ఆయన అనుచరులు చెబుతున్నారు. ముఖ్యంగా టీడీపీ– జనసేన పొత్తు తర్వాత వైసీపీ నేతల్లో మరింతగా ఓటమి ఆందోళన రేకెత్తిస్తోంది.

సంక్షేమ పథకాలే గెలిపిస్తాయ్.. కార్యకర్తలకు దిశానిర్దేశం చేయనున్న సీఎం

వైసీపీ క్యాడర్‌లో అలముకున్న ఆందోళనలను తొలగించడానికి 9న విజయవాడలో నిర్వహించే విస్తృత స్థాయి సమావేశంలో సీఎం జగన్ దిశానిర్దేశం చేయనున్నారు. ఇప్పటిదాకా జిల్లాల్లో ‘వై ఏపీ నీడ్స్ జగన్​’ కార్యక్రమాన్ని 11 నుంచి ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సన్నాహక సమావేశాలు ముగిశాయి. క్యాడర్‌లో జోష్​నింపేందుకు సీఎం జగన్ గత ఎన్నికల తర్వాత మొట్టమొదటిసారి పార్టీ విస్తృత సమావేశంలో పాల్గొంటున్నారు. ప్రధానంగా సంక్షేమ పథకాలు నిరాటంకంగా కొనసాగాలంటే మళ్లీ వైసీపీని గెలిపించాలనే పిలుపే లక్ష్యంగా సమావేశం జరుగుతున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ దఫా ఎన్నికల్లో ఎన్ని పార్టీలు కలిసొచ్చినా విజయం వైసీపీదేనన్న భరోసా ఇవ్వనున్నారు. 

Tags:    

Similar News