భూ స్కామ్‌లకు కేంద్రమైన ఉత్తరాంధ్రలో అలర్ట్.. ప్రభుత్వ కార్యాలయాలకు భారీగా భద్రత పెంపు

మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో కీలక రికార్డులు అనుమానాస్పదంగా దగ్ధం అయిన నేపధ్యంలో వేల కోట్ల రూపాయల భూ

Update: 2024-07-24 03:01 GMT

దిశ ప్రతినిధి, విశాఖపట్నం: మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో కీలక రికార్డులు అనుమానాస్పదంగా దగ్ధం అయిన నేపధ్యంలో వేల కోట్ల రూపాయల భూ కుంభకోణాలకు కేంద్ర బిందువైన ఉత్తరాంధ్రా జిల్లాల్లో అధికారులు అప్రమత్తమయ్యారు. వైసీపీ పాలనా కాలంలో వేల ఎకరాల భూ లావాదేవీలు, భూ మాయలు ఉమ్మడి విశాఖ, విజయనగరం జిల్లాల్లో జరిగాయి. శ్రీకాకుళం‌లోనూ కొన్ని జరిగాయి. ఈ నేపథ్యంలో సంబంధిత రెవెన్యూ అధికారులు అప్రమత్తమయ్యారు. రికార్డులున్న గదుల రక్షణకు జాగ్రత్తలు తీసుకొంటున్నారు.

విజయసాయి నుంచి జవహ‌ర్‌రెడ్డి వరకూ..

వైసీపీ పాలనా కాలంలో ఉత్తరాంధ్రా వైసీపీ ఇన్చార్జిగా మొదటి మూడు సంవత్సరాలు పనిచేసిన రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి సిఫార్సులతో వేలాది ఎకరాల భూములు చేతులు మారడం, ప్రభుత్వం నుంచి ప్రైవేటుకు బదిలీ కావడం వంటివి జరిగాయి. విశాఖలోనే దసపల్లా, సీబీసీఎన్సీ, హయగ్రీవ, ఎన్సీసీ, రేడియంట్ భూములతో పాటు వందలాది ఎకరాల స్వాతంత్ర్య సమరయోధులు, మాజీ సైనికోద్యోగులకు కేటాయించిన భూములు చేతులు మారాయి.

22ఎ నుంచి రాత్రికి రాత్రి బయట పడ్డాయి. వీటికి సంబంధించిన రికార్డులను అధికారులు భద్రపరిచే పనిలో వున్నారు. ఇక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన డాక్టర్ కేఎస్ జవహర్‌రెడ్డి వేలాది ఎకరాల అసైన్డ్ భూములను తన బినామీల పేరిట మార్చి జీవో 596 క్రింద ఫ్రీ హోల్డ్ చేశారని వైసీపీ మినహా అన్ని పార్టీలు ఆరోపించాయి. విచారణకు డిమాండు చేశాయి. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం చుట్టూ జవహ‌ర్‌రెడ్డి తన బినామీ అయిన త్రిలోక్ ద్వారా వందలాది ఎకరాలు కొనుగోలు చేశారని అంశంపై ఇప్పటికే ప్రభుత్వం దృష్టి సారించినందున వాటి రికార్డులు తారుమారు కాకుండా, దగ్ధం కాకుండా జాగ్రత్తలు తీసుకొంటున్నారు.

అప్పట్లో మావోయిస్టుల పేరిట..

మదనపల్లె తరహా సంఘటనలు వేల కోట్ల భూ కుంభకోణాలకు కేంద్రమైన విశాఖకు కొత్త కాదు. 2002వ సంవత్సరంలోనే ఖరీదైన అసైన్డ్ భూములకు కేంద్రమైన విశాఖ తహసీల్దార్ కార్యాలయం అగ్నికి ఆహుతి అయి కీలకమైన రికార్డులు తగలబడి పోయాయి. నిందను మావోయిస్టులపై వేసి అధికారులు తప్పుకొన్నారు. సీనియర్ ఐఏఎస్ అధికారి తిరుమల కృష్ణబాబు విశాఖ జాయింట్ కలెక్టర్‌గా, ఇప్పుడు బాపట్ల జాయింట్ కలెక్టర్‌గా వున్న సుబ్బారావు రూరల్ తహసీల్దార్‌గా వున్న సమయంలో ఈ సంఘటన జరిగింది. దీనిపై పలు అనుమానాలు వ్యక్తమైనా విచారణ జరపకుండా నెపం మావోయిస్టులపై వేసి కప్పిపుచ్చేశారు.


Similar News