ఓటమికి కారణమిదే.. కుండ బద్ధలు కొట్టిన మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్

ఏపీలో వైసీపీ ఘోర పరాభవం చెందిన విషయం తెలిసిందే.

Update: 2024-06-06 06:54 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో వైసీపీ ఘోర పరాభవం చెందిన విషయం తెలిసిందే. ఫ్యాన్ పార్టీ కేవలం 11 ఎమ్మెల్యే స్థానాలకే పరిమితమై చిత్తుగా ఓటమి పాలయింది. ఇక, వైసీపీ ఓటమిపై ఏపీ మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ స్పందించారు. మీడియాతో ఆయన గురువారం మాట్లాడారు. కూటమి ఇచ్చిన హామీలు అమలు చేయకుంటే ప్రజల తరఫున పోరాడతామన్నారు. వైసీపీ కార్యకర్తలను సరైన రీతిలో గుర్తించకపోవడమే ఓటమికి కారణంగా అమర్‌నాథ్ చెప్పుకొచ్చారు.

ప్రజలకు సమస్య వస్తే గ్రామ సచివాలయం, లేదా వాలంటీర్ల దగ్గరకు వెళ్లారని కానీ కార్యకర్తలను గుర్తించలేదన్నారు. దీంతో ప్రజలు, కార్యకర్తలు, స్థానిక నాయకుల మధ్య గ్యాప్ పెరిగిందన్నారు. జగన్ మోహన్ రెడ్డి తెచ్చిన పాలన సంస్కరణ కారణంగా గ్రామాల్లో నాయకులు బలహీన పడ్డారన్నారు. 2009లో వైఎస్ మరణం తర్వాత, పదేళ్లు ప్రజా సమస్యల పోరాటంలో కార్యకర్తలు కీలక పాత్ర పోషించారన్నారు. చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయకముందే కొన్ని చోట్ల దాడులు జరుగుతున్నాయని వీటిపై కొత్త ప్రభుత్వం ఆలోచించాలన్నారు. దాడులు ప్రజాస్వామ్యం కాదన్నారు.


Similar News