TTD : టీటీడీ అధికారులపై ఆనందాశ్రమ పీఠాధిపతి ఆగ్రహం.. ఖండించిన అధికారులు
టీటీడీ(TTD) అధికారులపై శ్రీకాకుళంలోని ఆనందాశ్రమ పీఠాధిపతులు శ్రీనివాసానంద సరస్వతి(Srinivasananda Saraswathi) స్వామిజీ తీవ్రం ఆగ్రహం వ్యక్తం చేశారు.
దిశ, వెబ్ డెస్క్ : టీటీడీ(TTD) అధికారులపై శ్రీకాకుళంలోని ఆనందాశ్రమ పీఠాధిపతులు శ్రీనివాసానంద సరస్వతి(Srinivasananda Saraswathi) స్వామిజీ తీవ్రం ఆగ్రహం వ్యక్తం చేశారు. వివరాల్లోకి వెళితే.. తిరుపతిలోని అర్బన్ హార్ట్‌లో జరిగిన జాతీయ సాధు సమ్మేళనం సదస్సుకు హాజరైన 300 మంది స్వామీజీలు, తదితరులకు తిరుమల స్వామివారి దర్శనం కల్పిస్తానని టీటీడీ ఈవో శ్యామలరావు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి ముందు హామీ ఇచ్చారని తెలిపారు. కానీ దర్శనానికి వెళ్లినప్పుడు మాత్రం ఇచ్చిన మాట తప్పి స్వామీజీలను అడ్డుకొని, ఘోరంగా అవమానించారని మండిపడ్డారు. హిందూ సనాతన ధర్మాన్ని ఆచరిస్తామని మాట ఇచ్చి అది నెరవేర్చడంలో కూటమి ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని శ్రీనివాసానంద సరస్వతి స్వామిజీ ఆరోపించారు. ఈ విషయంలో గత ప్రభుత్వం ఎంతో మేలని ఎద్దేవా చేశారు.
మరోవైపు శ్రీనివాసానంద సరస్వతి స్వామిజీ చేసిన ఆరోపణలు సరికాదంటూ టీటీడీ ఖండించింది. ఈ మేరకు వివరణ ఇస్తూ ఒక ప్రకటన విడుదల చేసింది. వాస్తవంగా స్వామిజీ 50 మందికి బ్రేక్ దర్శనం, 550 మందికి ప్రత్యేక దర్శనంతో పాటు తిరుమలలో వసతి కల్పించాలని టీటీడీ అధికారులను కోరారని పేర్కొన్నారు. సాధారణంగా తిరుమలలో ఆదివారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆరోజు ఇంతమందికి దర్శనం కల్పించడం సాధ్యం కాదని.. ఆ సంఖ్యను తగ్గించాలని అధికారులు కోరారని చెప్పారు. స్వామీజీ అడిగిన వారందరికీ దర్శనం టికెట్లు ఇవ్వలేదనే కోపంతో మీడియా ఎదుట అధికారులపై స్వామీజీ ఆరోపణలు చేశారని అన్నారు.