టీడీపీ బస్సు యాత్రపై రగడ
టీడీపీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బస్సు యాత్ర విషయమై పెద్దాపురం నియోజకవర్గంలో పెద్ద రగడ సాగుతోంది.
దిశ, ఉభయ గోదావరి ప్రతినిధి: టీడీపీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బస్సు యాత్ర విషయమై పెద్దాపురం నియోజకవర్గంలో పెద్ద రగడ సాగుతోంది. రామేశ్వరం మెట్టలో అక్రమాలు.. క్వారీని తవ్వుకుని పోతున్న కాకినాడ సిటీ ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి అక్రమాలను బస్సు యాత్ర ద్వారా బయట పెట్టాలని తెలుగు తమ్ముళ్లు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. కానీ దీనికి స్థానిక టీడీపీ ఎమ్మెల్యే, మాజీ డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప ససేమిరా అంటున్నారు. రామేశ్వరంపేటలో రెడ్డి అక్రమాలు బయట పెడితే పోలీసు కేసులు పెడతారని రాజప్ప కార్యకర్తలతో అంటున్నట్లు సమాచారం.
దీంతో తెలుగు తమ్ముళ్లు గుర్రుగా ఉన్నారు. రామేశ్వరం మెట్టలో అక్రమ క్వారీ వ్యాపారంలో రాజప్ప, సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి ఏకమైనందుకే ఆయన అలా అంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బస్సు యాత్ర ముఖ్య ఉద్దేశం వైసీపీ అక్రమాలు బయట పెట్టాలని, అందులో భాగంగానే రామేశ్వరం మెట్ట అక్రమాలు బయట పెట్టాలని అక్కడే యాత్ర నిర్వహించాల్సి ఉందని అంటున్నామని దీనికి రాజప్ప ససేమిరా అనడం విడ్డూరంగా ఉందని తెలుగు తమ్మళ్లు వాపోతున్నారు. ఈ విషయం పార్టీలో పెద్ద రగడ గా మారింది. ఆ నోటా ఈ నోటా అధినేత చంద్రబాబు దాకా వెళ్లింది. విషయమై ‘దిశఅందిస్తున్న కథనం..
కొండలు కరిగిపోతున్నాయి..
పెద్దాపురం నియోజకవర్గం రామేశ్వరం మెట్టలో కొండలు కరిగిపోతున్నాయి. కాకినాడకు చెందిన వైసీపీ ముఖ్య నేత లారీల లారీలు తరలించుకు పోతున్నారనే ప్రచారం సాగుతోంది. నియోజకవర్గంలోని పెద్దాపురం, గండేపల్లి మండలాల్లో 823 ఎకరాల్లో విస్తరించిన కొండలు, గుట్టలు, రిజర్వ్ ఫారెస్ట్ ఇక చరిత్రగానే మిగిలిపోయే ప్రమాదం ఉంది. 1986 ప్రాంతంలో అప్పటి ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు ఇక్కడి కొండలను స్థానికంగా పేదలు సాగు చేసుకోవాలని ఇచ్చారు.
అతని ఆశయానికి తూట్లు పొడుస్తూ ఇష్టారాజ్యంగా తవ్వకాలు ప్రారంభించారు. కొండలను పిండి చేస్తున్నారు. గ్రావెల్ రూపంలో కేవలం ఇళ్ల స్థలాల చదును అనే చిన్న అనుమతి తెచ్చుకొని ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోనే బహిరంగంగా అక్రమంగా వ్యాపారం చేస్తున్నారు. ఇందులో కాకినాడకు చెందిన కీలక వైసీపీ నేత రంగ ప్రవేశం చేశారు. స్థానిక ఎమ్మెల్యే రాజప్ప కూడా తోడైనట్లు సమాచారం. దీంతో ఇక్కడ అక్రమ గ్రావెల్ వ్యాపారం యథేచ్ఛగా సాగుతుంది.
అక్రమ వ్యాపారాన్ని బయట పెట్టాలంటున్న తెలుగు తమ్ముళ్లు
దీంతో విషయమై తెలుగు తమ్ముళ్లు రగిలిపోతున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ అక్రమ వ్యాపారాలు బయట పెట్టాలని వారు కోరుతున్నారు. బస్సు యాత్ర ఉద్దేశం కూడా వైసీపీ అక్రమాలు బయట పెట్టడమే అని, దీంతో రామేశ్వరం మెట్ట అక్రమాలు బయట పెట్టి వైసీపీ నాయకులకు బుద్ధి చెప్పాలని వారు డిమాండ్ చేస్తున్నారు. దీనికి రాజప్ప ససేమిరా అనడం మింగుడు పడటం లేదు. ఇదెక్కడి దారుణం అని తెలుగు తమ్ముళ్లు వాపోతున్నారు. విషయమై నియోజకవర్గంలో పెద్ద చర్చగా మారింది. రాష్ట్ర పార్టీ కార్యాలయం కూడా ఈ విషయంలో గుర్రుగా ఉన్నట్లు సమాచారం.