హల్చల్ చేస్తున్న టీడీపీ, జనసేన ఉమ్మడి సీట్ల జాబితా.. ఇందులో నిజమెంత..?
ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి.
దిశ డైనమిక్ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. నిన్న తెలుగుదేశం అధినేత ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జనసేన పార్టీతో చర్చించకుండా అరకు, మండపేట నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించారు. అయితే పొత్తు ధర్మాన్ని పక్కన పెట్టి టీడీపీ ఏకపక్షంగా సీట్లను కేటాయించడం పై జనసేన అధినేత స్పందించారు.
కర్ర విరగకూడదు.. పాము చావకూడదు అనే విధంగా పవన్ కళ్యాణ్ సున్నితంగా మాట్లాడుతూనే టీడీపీకి చురకలు అంటించారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు ఒత్తిడి ఉన్నపుడు తనకు కూడా ఒత్తిడి ఉంటుందని.. ఆ ఒత్తిడిని తట్టుకునేందుకు రిపబ్లిక్ డే రోజు ఆర్ అనే అక్షరం బాగుంటుందనిపించి తాను రాజోలు, రాజానగరం రెండు సీట్లను ప్రకటిస్తున్నట్లు ఈ రోజు పేర్కొన్నారు.
అయితే టీడీపీ రెండు సీట్లను ఏకపక్షంగా ప్రకటించిన నేపథ్యంలో జనసేన అధినేత కూడా రెండు సీట్లను అధికారికంగా ప్రకటించారు. కానీ కథ ఇంతటితో ముగిసిపోలేదు. ప్రస్తుతం టీడీపీ-జనసేన ఉమ్మడి సీట్ల జాబితాని, జనసేన-టీడీపీ ఉమ్మడి సీట్ల జాబితా అనే రెండు జాబితాలు సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతున్నాయి.
ఇరు పార్టీల అధినేతల ఉమ్మడి సమన్వయ సమావేశంలో సీట్ల కేటాయింపు పై చర్చించి తీసుకున్న నిర్ణయం ప్రకారం జనసేన పార్టీ 61 తెలుగుదేశం పార్టీ 114 అసెంబ్లీ నియోజకవర్గ స్థానాల్లో పోటీ చేయనుంది అని జాబితాలో పేర్కొనబడింది. కాగా జిల్లాల వారీగా చూస్తే.. శ్రీకాకుళం జిల్లా నుండి జనసేన 3 స్థానాల్లో టీడీపీ 5 స్థానాల్లో పోటీచేయనుంది.
విజయనగం లో జనసేన 3 స్థానాల్లో టీడీపీ 4 స్థానాల్లో పోటీచేయనుంది పార్వతీపురం మన్యంలో 3 స్థానాల్లో టీడీపీ పోటీ చేయనుండగా ఒక స్థానం లో జనసేన పోటీ చేయనుంది. విశాఖపట్నం లో 2 స్థానాల్లో జనసేన 3 స్థానాల్లో టీడీపీ పోటీ చేయనుంది. అల్లూరి సీతారామరాజు జిల్లాలో జనసేన ఒకస్థానం నుండి టీడీపీ రెండు స్థానాల నుండి పోటీ చేయనుంది.
అనకాపల్లి నుండి నాలుగు స్థానాల్లో టీడీపీ ఉంటె 3 స్థానాల్లో జనసేన ఉంది. ఇలా అన్ని జిల్లాల్లో ఏ పార్టీ ఎన్ని స్థానాలనుండి పోటీ చేస్తుందో వివరంగా ఇచ్చారు. అయితే ఈ జాబితాలు అధికారికంగా ప్రకటించినవి కావు. ఇరు పార్టీల కార్యకర్తలు సృష్టించిన ఫేక్ జాబితాలు అని సమాచారం. అయితే ఈ జాబితాలను టీడీపీ, జనసేన కార్యకర్తలు సృష్టించారా..? లేక వేరే ఎవరైనా సృష్టించారా..? అనే విషయం పై స్పష్టత లేదు. ఏదేమైనా ప్రస్తుతం రెండు జాబితాలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుండగా.. జనసేన కార్యకర్తలు విడుదల చేసిన జాబితా వైరల్ గా మారింది.
Read More : టీడీపీతో పొత్తుపై పవన్ కల్యాణ్ కీలక ప్రకటన.. ఒక్కమాటతో తేల్చేసిన జనసేనాని