AP News : కల్వరి టెంపుల్ పై హైకోర్టులో విచారణ
ప్రభుత్వ అనుమతి లేకుండా నిర్మించారంటూ కల్వరి టెంపుల్ పై ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.
దిశ, వెబ్ డెస్క్ : ప్రభుత్వ అనుమతి లేకుండా నిర్మించారంటూ కల్వరి టెంపుల్ పై ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. గుంటూరు జిల్లా నంబూరులో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కల్వరి టెంపుల్ ఎటువంటి ప్రభుత్వ అనుమతులు లేని అక్రమ కట్టడమని పరస సురేష్‌కుమార్ హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ బిల్డింగ్ రూల్స్ 26 ప్రకారం జిల్లా కలెక్టర్ అనుమతి లేకుండా వందల కోట్లతో కట్టడాలు నిర్మించారని పిటిషనర్ పేర్కొనగా.. ఈ పిటిషన్ పై నేడు కోర్టులో విచారణ జరిగింది. సీఆర్డీఏ, రెవెన్యూ అధికారుల అనుమతులు తీసుకోకుండా రాజకీయ నాయకుల అండదండలతో కట్టడాలు నిర్మించారని.. తక్షణమే ఆ కట్టడాలను కూల్చివేయాలి అంటూ పిటిషనర్ తరపున న్యాయవాది వాదనలు వినిపించారు. ఈ వాదనలను పరిగణలోకి తీసుకున్న ధర్మాసనం తక్షణమే కల్వరి టెంపుల్ యాజమాన్యాలకి నోటీసులు జారీ చేసింది. అనంతరం విచారణను 4 వారాలకు వాయిదా వేసింది.