సీటు దక్కలేదని కంటతడి పెట్టుకున్న జనసేన ఇన్‌చార్జి.. సంచలన నిర్ణయం
టీడీపీ- జనసేన పొత్తులో భాగంగా ఇరు పార్టీలు ఇవ్వాళ సీట్లను ప్రకటించిగా, టికెట్ వస్తుందని ఆశించిన కొందరు నేతలకు బంగపాటు తప్పలేదు
దిశ, డైనమిక్ బ్యూరో: టీడీపీ- జనసేన పొత్తులో భాగంగా ఇరు పార్టీలు ఇవ్వాళ సీట్లను ప్రకటించిగా, టికెట్ వస్తుందని ఆశించిన కొందరు నేతలకు బంగపాటు తప్పలేదు. ఈ నేపధ్యంలోనే కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం నుంచి జనసేన టికెట్ ఆశించిన నియోజకవర్గ ఇన్ చార్జి పాటంశెట్టి సూర్యచంద్రకు టికెట్ దక్కలేదు. పొత్తులో భాగంగా జగ్గంపేట టీడీపీకి కేటాయించారు. ఇక్కడ మాజీ ఎమ్మెల్యేగా ఉన్న జ్యోతుల నెహ్రూ టీడీపీ నుంచి టికెట్ దక్కించుకున్నారు.
అయితే మొదటి నుండి జనసేనలో కష్టపడుతూ.. టికెట్ ఆశించిన సూర్యచంద్ర సీటు దక్కకపోవడంతో ఒక్కసారిగా కంటతడి పెట్టుకున్నారు. మొదటి నుంచి ఇంటికి దూరంగా పార్టీ కార్యక్రమాలకు దగ్గరగా ఉంటూ.. పార్టీ కోసం తీవ్రంగా కష్టపడుతూ క్యాడర్ ని బలపరుచుకున్నారు. ఆయనకు టికెట్ దక్కకపోవడంతో ఆయనతో పాటు క్యాడర్ కూడా కంటతడి పెట్టుకున్నారు. ఆయన మాట్లాడుతూ.. ఇప్పటివరకు ధర్మంగానే ఉన్నామని, ఇప్పుడు పొత్తులో భాగంగా అధినేతలు తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి జ్యోతుల నెహ్రూ గారిని ఎమ్మెల్యే చేసేవరకు కష్టపడతానని అన్నారు.
అంతేగాక సామాన్యుడికి ఎమ్మెల్యే అయ్యే అర్హత లేదని, రబ్బరు చెప్పులేసుకునే వాడు అసెంబ్లీకి వెళ్లాలని ఆశ పడకూడదని దేశ ప్రజలకి చెబుతున్నానని అన్నారు. ఈ క్షణం నుంచి పొలింగ్ రోజు వరకు టీడీపీ గెలుపుకు కృషి చేస్తానని, సైకిల్ గుర్తుకి ఓటు వేస్తానని తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు.