అనకాపల్లిలో ఎకరా రూ.1000.. మరీ ఇంత చీపా..?
అనకాపల్లిలో అక్రమంగా వైసీపీ కార్యాలయం నిర్మించారంటూ జీవీఎంసీ అధికారులు నోటీసులు జారీ చేశారు..
దిశ, వెబ్ డెస్క్: ఏపీ ప్రభుత్వం అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపుతోంది. గత ప్రభుత్వం ఏ విధంగా అయితే కూల్చివేసింది. అదే విధంగా ఈ ప్రభుత్వం కూడా కఠిన చర్యలు తీసుకుంటోంది. అనుమతులు లేకుండా నిర్మించిన నిర్మాణాలను తొలగించింది. ఇప్పటికే గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం సీతానగరంలో నిర్మించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం భవనాలను శనివారం తెల్లవారుజామున సీఆర్డీఏ అధికారులు కూల్చివేశారు. ఈ ఘటనతో చాలా చోట్ల నిర్మించిన వైసీపీ కార్యాలయం బాగోతం వెలుగులోకి వస్తున్నాయి.
తాజాగా అనకాపల్లి- విశాఖ హైవేలో నిర్మించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి జీవీఎంసీ అధికారులు నోటీసులు ఇచ్చారు. ఎలాంటి అనుమతులు లేకుండా వైసీపీ కార్యాలయం నిర్మాణానికి గత ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 33 ఏళ్ల పాటు లీజుతో 1.75 ఎకరాల భూమిని కేటాయించింది. ఇందుకు ఏడాదికి రూ.1000 చెల్లించాలని సూచించింది. దీంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని భారీగా భవింతిలా నిర్మించారు. ప్రస్తుతం ప్రభుత్వం మారడంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్మించిన అక్రమ నిర్మాణాలు ఒక్కొక్కటికి వెలుగులోకి వస్తున్నారు. అనకాపల్లిలో నిర్మించిన వైసీపీ అక్రమ కట్టడానికి అధికారులు నోటీసులు అంటించారు. వారంలో వివరణ ఇవ్వాలని నోటీసుల్లో అధికారులు పేర్కొన్నారు. లేని పక్షంలో చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
అయితే తమ పార్టీ కార్యాలయానికి అన్ని అనుమతులు ఉన్నాయని మాజీ మంత్రి అమర్ నాథ్ తెలిపారు. పార్టీ కార్యాలయానికి అంటించిన నోటీసులను తీసివేశారు. చట్ట పరంగా చూసుకుంటామని అమర్‌నాథ్ తెలిపారు.