ఏపీలో మహిళలకు ఫ్రీ బస్ జర్నీ.. రేపే కీలక నిర్ణయం..!

ఏపీలో మరో బృహత్తరమైన కార్యక్రమాన్ని ప్రభుత్వం త్వరలో అమలు చేయనుంది...

Update: 2024-07-28 03:57 GMT

దిశ, వెబ్ డెస్క్: ఏపీలో మరో బృహత్తరమైన కార్యక్రమాన్ని ప్రభుత్వం త్వరలో అమలు చేయనుంది. ఇప్పటికే ఆ పథకానికి సంబంధించి పూర్తిగా అధ్యయనం చేసింది. ఇక అమలు చేయడమే పరమవధిగా అడుగులు వేస్తోంది. మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం కల్పిస్తామని సార్వత్రిక ఎన్నికల ప్రచార సమయంలో కూటమి నేతలు హామీ ఇచ్చారు. ఆ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఈ మేరకు ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచితంగా ప్రయాణం కల్పించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ పథకంపై తాజాగా కీలక అప్ డేట్ ప్రకటించింది. ఏపీఎస్ ఆర్టీసీలో మహిళలు ఉచితంగా ప్రయాణించేందుకు విధివిధానాలను ఖరారు చేయనున్నట్లు తెలిపింది. ఇప్పటికే కసరత్తులు పూర్తి చేస్తున్నట్లు వెల్లడించింది. పల్లెవెలుగు, అల్ట్రా, ఎక్స్‌ప్రెస్ సర్వీసులతో పాటు విశాఖ, విజయవాడలో సిటీ, మెట్రోల్లో మహిళలకు ఫ్రీ జర్నీ అమలు చేసే యోచనలో ఉన్నట్లు స్పష్టం చేసింది.

రవాణా, ఆర్టీసీ శాఖపై సీఎం చంద్రబాబు నాయుడు సోమవారం సమీక్ష నిర్వహించనున్నారు. ఈ సమీక్షలో అధికారులతో చర్చించి కీలక ప్రకటన చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. మరోవైపు తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో ఫ్రీ జర్నీ అమలు కొనసాగుతోంది. ఈ రెండు రాష్ట్రాల్లో అమలవుతున్న తీరుపై ఇప్పటికే అధ్యయనం పూర్తి అయింది. ఏపీలోనూ ఫ్రీ జర్నీ పథకం కొనసాగిస్తే ప్రతి నెల ఏపీ‌ఎస్ ఆర్టీసీపై రూ. 250 కోట్ల భారం పడుతుందని అంచనాకు వచ్చింది. ప్రతి రోజు ఆర్టీసీ బస్సులో 30 లక్షల మంది ప్రయాణం చేస్తున్నారని, వీరిలో 15 లక్షల మంది వరకూ మహిళా ప్రయాణికులు ఉన్నారని ప్రభుత్వం గుర్తించింది. 

Tags:    

Similar News