Dirty Picture: డర్టీ పిక్చర్! మసాలా దట్టిస్తున్న సినీ ఇండస్ట్రీ

భారతీయ సినిమాలో ఈ సినిమా లేపిన వివాదం అంతాఇంతా కాదు.

Update: 2025-03-17 07:27 GMT

- విమర్శలు వస్తున్నా కాసులపంట

- బోల్డ్ కంటెంట్ ఉన్నా.. ప్రేక్షకాదరణ

- ఆ సినిమాలను వరిస్తున్న అవార్డులు

- ఫైర్ నుంచి హీరామండి.. సెన్సేషన్

- వేశ్య కథా చిత్రంతో హాలీవుడ్ మూవీ

- ఐదు ఆస్కార్లు దక్కించుకున్న అనోరా

ఫైర్: భారతీయ సినిమాలో ఈ సినిమా లేపిన వివాదం అంతాఇంతా కాదు.. భారతీయ సమాజంలో లెస్బియన్ కంటెంట్ తో (Content) సినిమా రావడమా..? మాట్లాడుకోవడానికే భయపడే పరిస్థితుల్లో ఏకంగా సినిమా తీస్తారా? అంటూ కొన్ని సంఘాలు తీవ్ర ఆందోళనలు చేశాయి. ఇందులో కంటెంట్ బోల్డ్ అయినా.. ఓ సామాజిక అంశాన్ని భిన్న దృక్కోణంలో సినిమా ప్రజెంట్ చేసింది. తాజాగా తమిళ్ లో వచ్చిన ‘కాదల్ ఎన్నబదు పొదువుడామై’ చిత్రం కూడా ఇదే ఇతివృత్తంతో వచ్చింది. ఇందులో ఇద్దరి మధ్య లింగభేదంతో సంబంధం లేకుండా చిగురించే ప్రేమ గురించి దర్శకుడు ఆర్ద్రంగా చెప్తాడు. కానీ, హంటర్, హేట్ స్టోరీ, రాగిణి ఎంఎంఎస్ లాంటి సినిమాలు కేవలం బోల్డ్ దృశ్యాలతో ప్రేక్షకులను రంజింపచేసి.. డబ్బు వసూలు చేసుకునే ఉద్దేశంతో తీసినవి. ఇలా రెండు రకాల కంటెంట్లతో బోల్డ్ సినిమాలు (Bold movies) వస్తున్నాయి. ఈ కల్చర్ ఇటు టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు ఉన్నది. కంటెంట్ బోల్డ్ ఉన్నా.. అందులో స్పృశించే అంశమే ప్రేక్షకుడికి ముఖ్యం. తాజా ఆస్కార్ అవార్డు కొట్టిన అనోరా సినిమా.. ఓ వేశ్య బేస్డ్ స్టోరీ. ఇందులో నటీనటుల భావోద్వేగాలను ఎంతో హృద్యంగా ఉంటాయి. వేశ్య ఆధారంగా తీసిన స్టోరీయే అయినా, కథలో భాగంగానే ఉంటుంది.. తప్ప ప్రేక్షకుడి కోణాన సన్నివేశాలు ఉండవు. ఇక్కడే డర్టీ పిక్చర్ కి ఆస్కార్ పిక్చర్ కి ఉన్న తేడా ఏంటో స్పష్టంగా అర్థం అవుతుంది. ఇక కొన్ని సినిమాలు మిస్ టీచర్, బీఏ పాస్ లాంటివి యువతను పూర్తిగా తప్పుదోవ పట్టించేవిగా ఉన్నాయి. ఇలాంటి సినిమాలపై నిషేధం విధించాల్సిన అవసరం ఉన్నది. అంతేకానీ, ఈ రెండు రకాల సినిమాలను ఒక్కగాటిన కట్టేయడం ఎంతమాత్రం సరికాదు. మొత్తానికి అవార్డులు, అభిమానుల అభిమానాన్ని పండిస్తున్న వేశ్య కథా చిత్రాలపై ‘దిశ’ ప్రత్యేక కథనం.

- అనిల్ ​శిఖా

ఒక వేశ్య కథ ఆస్కార్ (Oscar) సొంతం చేసుకుంది. సినీ విమర్శకులు ఉలిక్కిపడ్డారు. సినిమాలపై ఆసక్తి ఉన్నవారు ఈ సినిమా కథ ఏమిటా అని ఆరా తీశారు. ఇక్కడ స్ట్రీమ్ అవుతుంది అని తెలుసుకున్నారు. అంతగా ఏముంది ఇందులో..? వేశ్య కథాంశంగా మన దేశంలో ఎన్నో సినిమాలు వచ్చాయి కదా అని చర్చించుకున్నారు. మొన్నటి ప్రతిష్టాత్మక ఆస్కార్‌ వేడుకల్లో ‘అనోరా’ (Anora) అనే రొమాంటిక్‌ (Romantic)చిత్రం పేరు మార్మోగిపోయింది. ఆస్కార్‌ వేదికపై దాదాపు ఐదు విభాగాల్లో విజయాన్ని అందుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది. ఉత్తమ చిత్రం, ఉత్తమ నటి, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ స్క్రీన్‌ ప్లే, ఉత్తమ ఎడిటింగ్‌ విభాగాల్లో పురస్కారాలను అందుకుంది. ఇదే ఇప్పుడు సినీ ప్రపంచంలో హాట్ టాపిక్​గా మారింది. 23 ఏళ్ల వేశ్య చుట్టూ తిరిగే కథ ఇది. ధనవంతుడైన ఓ యువకుడు ఆమెను వివాహమాడడం అనే సంఘటన చుట్టూ అల్లిన కథ ఇది. ఇందులోని డైలాగులు సైతం జనాలకు బాగా నచ్చేశాయి. ఇటువంటి కథలే మన భారత చలన చిత్రసీమలోనూ వచ్చాయి. నాటి దేవదాసు నుంచి నేటి హీరామండి వెబ్​సిరీస్​వరకు ఎన్నో సినిమాలు.. వేశ్యలే కథానాయికలు.. వారి చుట్టూనే కథలు.. అవన్నీ హిట్లే..! దాదాపు అన్ని సినిమాలు కూడా అవార్డులను సొంతం చేసుకున్నాయి.

బోల్డ్ వేరు డర్టీ వేరు

టాలీవుడ్‌తోపాటు హాలీవుడ్‌లో ఎన్నో రొమాంటిక్ సినిమాలు వచ్చాయి. ఇందులో ప్రేక్షకుడిని రంజింపజేయడమే లక్ష్యంగా ఎన్నో సినిమాలు ఉన్నాయి. కానీ, కంటెంట్ లో బోల్డ్ ఉన్నా కథాపరంగా అవసరంమేరకే ఉన్న సినిమాలు కూడా ఉన్నాయి. ఆ సినిమాలు కల్ట్ గా నిలిచిపోతాయి. ఆ సినిమాలను బూతుగా చూడలేం. మానవ దేహాన్ని చూపించే విధానాన్ని బట్టి ప్రేక్షకుడి భావాలు మారుతాయి. కాబట్టి బోల్డ్ కంటెంట్ ఉన్న అన్ని సినిమాలు బూతు సినిమాలుగా కొట్టిపారేయలేం. డర్టీ పిక్చర్, ఆర్జీవీ బూతు సినిమాలు ఇలా అనేకం కేవలం ఒక వర్గం ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని తీస్తారు. ఇందులో మహిళలను బోల్డ్‌గా చూపించడమే కంటెంట్‌గా ఉంటుంది. కానీ, నిర్మాతల వాదన ప్రకారం.. సమాజం మారుతున్నది. సంస్కృతిలోనూ మార్పులు వస్తున్నాయి కాబట్టి జనం సినిమాల్లోనూ వాస్తవికతను కోరుకుంటున్నారని చెప్తున్నారు. అందులోభాగంగానే బోల్డ్ కంటెంట్ కథలు ఎంచుకుంటున్నామని పేర్కొటున్నారు.

వెబ్ సిరీస్‌లో (Web series) బోల్డ్ కే ఓటు

ఇక సినిమాల్లో కాస్తంత బోల్డ్ కంటెంట్ కు సెన్సార్ కత్తెర పడుతున్నా.. ఓటీటీ ప్లాట్ ఫాముల్లో మాత్రం బోల్డ్ కంటెంట్ కు ఎలాంటి అడ్డంకులు లేవు. ఇంట్లోనే కూర్చుని అడల్ట్ సినిమాలు చూసేస్తున్నారు. ఆ కంటెంట్ కు ఎక్కువ ఆదరణ ఉన్నదని.. దర్శకులు సైతం అలాంటి కథలకే ప్రయారిటీ ఇస్తున్నారు. ఇప్పటికే ఓటీటీకి ఆంక్షలు పెట్టాలని దేశంలో అన్నివర్గాల నుంచి అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం కూడా ఓటీటీలను కట్టడి చేసే ఉద్దేశ్యం ఉన్నట్టు ప్రకటించింది. అయితే, అంతర్జాతీయ ప్లాట్ ఫాములు కావడంతోపాటు కంటెంట్ పై ఆంక్షలు విధించడం వల్ల దేశంలో స్వేచ్ఛాయుత వాతావరణం లేదని దుష్ప్రచారం జరుగుతుందేమోనన్న ఆందోళన సైతం వ్యక్తం అవుతున్నది. ఏదిఏమైనా ఓటీటీలను స్ట్రీమ్ లైన్ చేయాలన్న వాదనకు మాత్రం అన్ని వర్గాలు కట్టుబడిఉన్నాయి. త్వరలోనే మార్గదర్శకాలు సైతం వెలువడే అవకాశాలు కూడా లేకపోలేదు.

వేశ్య కథా చిత్రాలు ఇవే.

- గంగూబాయి కథియావాడి.. నాలుగేళ్ల కిందట విడుదలైన ఈ సినిమా ప్రేక్షకుల ప్రశంసలను పొందింది. 69వ జాతీయ చలనచిత్ర అవార్డులలో ఈ సినిమా ఉత్తమ నటి, ఉత్తమ స్క్రీన్ ప్లేతో సహా 5 అవార్డులను గెలుచుకుంది. మాఫియా క్వీన్స్ ఆఫ్ ముంబై నవలను ఆధారంగా చేసుకుని ఈ హిందీ సినిమా తీశారు. అలియా భట్ ప్రధాన పాత్రధారి. ఉత్తమ నటి అవార్డు ఆమె దక్కించుకుంది.

- దాదాపు 15 ఏళ్ల కిందట తెలుగులో వచ్చిన వేదం సినిమా గుర్తుందా..? అనుష్క అందులో వేశ్య పాత్ర పోషించడం అప్పట్లో సెన్సేషన్. ఆ సినిమా ఆ ఏడాది ఉత్తమ ఫిలింఫేర్ అవార్డు గెలుచుకుంది. ఉత్తమ నటిగా అనుష్క ఫిల్మ్ ఫేర్ అవార్డు అందుకుంది. ఈ సినిమాలో ఐదు కథలు ఉంటాయి.. కానీ అనుష్క నటన మాత్రం ఎవర్​గ్రీన్.

- ప్రేమాభిషేకం చూడని వారు ఉండరేమో.. సహజ నటిగా పేరుపొందిన జయసుధ ఈ సినిమాలో వేశ్య పాత్రలో నటించి, అందరి చేత మన్ననలే కాకుండా పురస్కారాలు కూడా అందుకున్నారు. 1981 వ సంవత్సరంలో దాసరి నారాయణరావు గారి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. జయసుధ ఈ సినిమాలో అద్భుతంగా నటించి, ఉత్తమ నటిగా నంది అవార్డు కూడా అందుకున్నారు.

- దేవదాసు సినిమా.. 1953లో వచ్చింది. ఈ సినిమా అక్కినేని నాగేశ్వరరావు, సావిత్రికి మంచి పేరు తెచ్చి పెట్టింది. ఇందులో గుర్తులు పోయే మరొక పాత్ర ఉంది. అదే చంద్రముఖి అనే వేశ్య పాత్రను లలిత పోషించారు. ఆమె నర్తకి... సావిత్రికి దూరమైన దేవదాసు ఆమెకు దగ్గర అవుతాడు. అతని కోసం ఆమె తన వేశ్య వృత్తినే మానేస్తుంది.

- 1957లో విడుదలైన ప్యాసా హిందీ చిత్రం నాటి తరం వారికి గుర్తుండే ఉంటుంది. ప్యాసా అంటే దాహం అని అర్ధం. ఇందులో గురుదత్​, వహీదా రహ్మాన్​ నటించారు. కోల్​కతాలోని రెడ్​లైట్​ఏరియాలో ఈ సినిమాని తీయాలని ప్రయత్నించినా కొన్ని కారణాల వల్ల అది సాధ్యం కాలేదు. దీంతో ముంబైలోనే రెడ్​లైట్​ఏరియా సెట్​వేసి పూర్తి చేశారు. ఇరవై గొప్ప భారతీయ చిత్రాలలో ఇది ఒకటిగా నిలిచింది.

- హీరామండి: ది డైమండ్‌ బజార్‌ .. ఇది ఒక వెబ్ సిరీస్. సంజయ్‌ లీలా భన్సాలీ దర్శకత్వం వహించిన తొలి వెబ్‌ సిరీస్‌ ఇది. గత ఏడాది నుంచి స్ట్రీమ్​ అవుతోంది. ఈ సిరీస్​కు ముందు భన్సాలీ దేవదాసు, గంగూబాయి కతియావాడి సినిమాలు తీశారు. ఆ తర్వాత తీసిన హీరామండి వెబ్ సిరీస్​లో మనీషా కొయిరాలా, సోనాక్షి సిన్హా, అదితిరావు హైదరీ, రిచా చద్దా, సంజీదా షేక్‌, షర్మిన్‌ సెగల్‌ తదితరులు నటించారు. దీంట్లో మహిళా ప్రధాన పాత్రధారులందరూ వేశ్యలుగానే కనిపించడం విశేషం.

హాలీవుడ్ లో వేశ్య కథాంశంతో ఎన్నో సినిమాలు

హాలీవుడ్ తొలి నుంచి వేశ్య కథా ప్రధాన అంశంగా ఎన్నో సినిమాలు వచ్చాయి వస్తున్నాయి. వీరిలో చెప్పుకో దగినవి డేంజరస్ బ్యూటీ (1998), నానా, ది ట్రూ కీ ఆఫ్ ప్లెజర్ (1983), ఎ హార్లోట్స్ ప్రోగ్రెస్ (2006), ది లాస్ట్ మిస్ట్రెస్ (2007), రోమ్ (2005), స్వాన్ ఇన్ లవ్ (1984), కామ సూత్ర: ఎ టేల్ ఆఫ్ లవ్ (1996), సకురాన్ (2006), లేడీ ఆఫ్ ది కామెలియాస్ (1981), హార్లోట్స్ (2017). ఇవన్నీ క్లాసిక్స్ గా నిలిచిపోయాయి. వీటిలో కొన్ని చిత్రాలు అవార్డులను కూడా సొంతం చేసుకున్నాయి. 1998లో వచ్చిన డేంజరస్ బ్యూటీ సినిమాకు ఆస్కార్ అవార్డుకు నామినేట్​అయింది.

Tags:    

Similar News