వైసీపీ అభ్యర్థుల ప్రకటనకు ముహూర్తం ఖరారు..తొలిజాబితా ఎప్పుడంటే
ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వైసీపీ టార్గెట్ 175గా వ్యూహరచన చేస్తోంది.
దిశ, డైనమిక్ బ్యూరో : ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వైసీపీ టార్గెట్ 175గా వ్యూహరచన చేస్తోంది. ఎన్నికలకు సంబంధించి అన్ని అస్త్రాలను సిద్ధం చేసుకుంటుంది. ఇందులో భాగంగా గెలుపు గుర్రాలపై ఫోకస్ పెట్టింది. ఇప్పటికే పలువురు గెలుపు గుర్రాలను ఎంపిక చేసిన వైసీపీ అధిష్టానం ప్రకటించేందుకు రెడీ అవుతుంది. గతంలో మాదిరిగానే ఈసారి కూడా విడతల వారీగా అభ్యర్థులను ప్రకటించాలని వైసీపీ వ్యూహరచన చేస్తోంది. మూడు విడతల్లో అభ్యర్థులను ప్రకటించేందుకు వైసీపీ సన్నద్ధమవుతుంది. ఇప్పటికే ఆయా నియోజకవర్గాల్లో టికెట్ విషయంలో ఆధిపత్య పోరు నెలకొంది. దీంతో వైసీపీ నేతలు, శ్రేణుల్లో గందరగోళం నెలకొంది. అయితే ఈ గందరగోళానికి చెక్ పెట్టాలనే ఉద్దేశంతో వైసీపీ అభ్యర్థుల జాబితాను ప్రకటించాలని నిర్ణయించింది.
మూడు విడతలగా జాబితా
2024 ఎన్నికలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సన్నద్ధమవుతుంది.ఐదు నెలలకు ముందే అభ్యర్థుల జాబితాని విడుదల చేయాలని యోచిస్తోంది. ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో అభ్యర్థులను వైసీపీ అధిష్టానం ఖరారు చేసింది. ఇక అన్ని నియోజకవర్గాలపైనా వైసీపీ ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగా అభ్యర్థుల జాబితా విడుదల చేస్తే ఎలాంటి ఇబ్బందులు ఉండవని వైసీపీ భావిస్తోంది. ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో టికెట్ ఆశిస్తున్న వారి సంఖ్య భారీగా ఉంది. ఒక్కో నియోజకవర్గంలో ముగ్గురు నలుగురు ఆశిస్తున్నారు. దీంతో నియోజకవర్గంలో ఆధిపత్య పోరు నెలకొంది. వర్గపోరు వైసీపీకి మరింత ఇబ్బందికరంగా మారింది. ఈ నేపథ్యంలో ఈ గందరగళానికి ముగింపు అభ్యర్థుల జాబితాతో పలకాలని వైసీపీ ఆలోచన చేస్తోంది. ఇందులో భాగంగా అభ్యర్థుల ఎంపికపై ప్రత్యేక దృష్టి సారించింది. ఈసారి కూడా మూడు విడతలుగా అభ్యర్థుల జాబితాను విడుదల చేయాలని వైసీపీ భావిస్తోంది. అయితే తొలి జాబితాను దసరా నాటికి విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గెలుపు ఖచ్చితం అనే నియోజకవర్గాల అభ్యర్థులను తొలివిడత జాబితాలో ప్రకటిస్తారని తెలుస్తోంది. టఫ్ ఫైట్ ఇచ్చే నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఎంపిక కాస్త ఆలస్యం అవుతుందని థర్డ్ పేజ్‌లో అభ్యర్థుల జాబితాను విడుదల చేస్తారని తెలుస్తోంది.
7 సర్వేలే ప్రామాణికం
ఎన్నికలకు మరికొన్ని నెలలు మాత్రమే గడువు ఉన్న నేపథ్యంలో వైసీపీ అభ్యర్థుల ఎంపికలో వేగం పెంచినట్లు తెలుస్తోంది. ఇప్పటికే వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అభ్యర్థుల ప్రకటన కూడా దాదాపు చేస్తూ వస్తున్నారు. గన్నవరం నుంచి వల్లభనేని వంశీమోహన్, చీరాల నుంచి కరణం వెంకటేశ్, రాజోలు నుంచి రాపాక వరప్రసాద్, వెంకటగిరి నుంచి నేదురుమిల్లి రామ్ కుమార్ రెడ్డి, నెల్లూరు రూరల్ నుంచి ఆదాల ప్రభాకర్ రెడ్డి, ఉదయగిరి నుంచి మేకపాటి రాజగోపాల్ రెడ్డి, విశాఖ దక్షిణ నియోజకవర్గం నుంచి వాసుపల్లి గణేశ్, గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి మద్దాల గిరి, కుప్పం నియోజకవర్గం నుంచి భరత్ పేర్లను దాదాపు ఖరారు చేసింది. ఎమ్మెల్యేల పనితీరుపై నిర్వహించిన 7 సర్వేల ఆధారంగా టికెట్ కేటాయింపులు జరుగుతున్నట్లు తెలుస్తోంది. సర్వేల ఆధారంగా సిట్టింగులకు లేదా కొత్త వారికి వైసీపీ అధిష్టానం టికెట్లు కేటాయించనుంది. సర్వేలతోపాటు సమయంలో సామాజిక, ప్రాంతీయ సమీకరణాలు కూడా పరిగణలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.
సీనియర్లకే ప్రాధాన్యం
వచ్చే ఎన్నికల్లో టీడీపీ-బీజేపీ కలిసి పనిచేస్తుందనే సమాచారం ఉంది. ఈ నేపథ్యంలో ఆ అంశాలను కూడా పరిగణలోకి తీసుకుని అభ్యర్థులను ఎంపిక చేయాలని వైసీపీ అధిష్టానం భావిస్తోంది. అందుకే తొలి జాబితాలో కేవలం 27 మంది అభ్యర్థులను ప్రకటిస్తుందని తెలుస్తోంది. ఇందులో కొత్తవారికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. గట్టిపోటీ, ఖచ్చితంగా గెలుపొందుతారు అన్న నమ్మకం ఉన్నవారు ఈ జాబితాలో ఉంటారని తెలుస్తోంది. అనంతరం రెండో జాబితా సంక్రాంతికి ఉంటుందని తెలుస్తోంది. ఇక మూడో జాబితాలో టఫ్ ఫైట్ జరిగే నియోజకవర్గాల అభ్యర్థుల కేటాయింపు ఉంటుందని తెలుస్తోంది. ఈ జాబితాలోనే అభ్యర్థులుగా వారసులను ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈసారి కూడా సీనియర్లకే మరోసారి టికెట్ ఇవ్వాలని వైఎస్ జగన్ భావిస్తున్నారు. పోటీ చేయలేని పరిస్థితులు ఉన్నవారికి, సర్వేలలో పాజిటివ్ వచ్చిన తనయులకు మాత్రమే టికెట్ ఇచ్చే అవకాశం ఉంది. ఈసారి ఎన్నికల్లో టికెట్ల కేటాయింపులో వైఎస్ జగన్ మహిళలు, బీసీలకు అధిక ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
Read More: ఐప్యాక్ సర్వేలో సంచలన విషయాలు.. ఆ పార్టీ పని ఇక ప్యాకప్పేనా?