ఏపీ క్రీడా సంఘాల్లో చీలిక.. గందరగోళంగా పరిస్థితి..!

రాష్ట్రంలో క్రీడాకారులు, క్రీడా సంఘాల పరిస్థితి రోజు రోజుకి దయనీయంగా మారుతోంది....

Update: 2024-09-17 02:38 GMT

దిశ, ఏపీ బ్యూరో: రాష్ట్రంలో క్రీడాకారులు, క్రీడా సంఘాల పరిస్థితి రోజు రోజుకి దయనీయంగా మారుతోంది. స్వార్థ రాజకీయాలకు క్రీడాకారుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారుతోంది. చిన్న చిన్న మనస్పర్థల కారణంగా క్రీడా సంఘాలు రెండుగా చిలిపోతున్నాయి. ఈ చీలికలతో ఫెడరేషన్ ప్రతినిధులు సైతం తలలు పట్టుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ ఒలింపిక్ అసోసియేషన్ పరిస్థితి మరింత గందరగోళంగా తయారైంది. క్రీడా సంఘాలు రెండుగా చీలిపోవడానికి ఒలింపిక్ సంఘాల హస్తం ఉందని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.

వీళ్లు ఒకరికి... వాళ్లు మరొకరికి..

ఒక గ్రూప్ వాళ్ళు ఒక సంఘానికి గుర్తింపు ఇవ్వగా మరో గ్రూప్ ఇంకొక సంఘం ఏర్పాటు చేసి వాళ్ళకి గుర్తింపు ఇచ్చిన దాఖలాలు ఉన్నాయి. దీంతో రాష్ట్రంలో క్రీడా సంఘాలు రెండుగా విడిపోయి కోర్టులను ఆశ్రయిస్తున్నారు. ఈ క్రమంలో రెండు సంఘాలు టోర్నీలు నిర్వహించడం క్రీడాకారులకు సర్టిఫికెట్లు ఇవ్వడం జరుగుతోంది. ఆయా సర్టిఫికెట్లు ఉద్యోగాలకు, కళాశాలలో సీట్ కోసం అప్లై చేసినప్పుడు వెరిఫికేషన్‌లో భాగంగా ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ (శాప్) అధికారులు తిరస్కరించిన సందర్భంలో క్రీడాకారులు లబోదిబో మంటున్నారు. ఏ సంఘానికి గుర్తింపు ఉన్నదో తెలియని వారు ఎక్కువగా నష్టపోతున్నారు. కొన్ని క్రీడా సంఘాలు దొంగ సర్టిఫికెట్లు ఇస్తున్నారని విజిలెన్స్ అధికారులు విచారణ చేస్తున్నారు. ఈ క్రమంలో శాప్ అధికారులు సైతం విచారణకు హాజరైన దాఖలాలు ఉన్నాయి.

విచారణ వేగవంతం..

దొంగ సర్టిఫికెట్లతో మెడికల్ సీట్లు, ఉద్యోగాలు సాధించారని విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదులు అందిన క్రమంలో విచారణ వేగవంతం చేశారు. ముఖ్యంగా ఈ దొంగ సర్టిఫికెట్ల వ్యాపారం విజయవాడ కేంద్రంగా జరుగుతున్నట్టు సమాచారం. జాతీయ పార్టీలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న సదరు వ్యక్తి ఒక అసోసియేషన్ కార్యదర్శిగా చేసి తప్పుకున్నారు. ఆయన తప్పుకున్న తరువాత కుమారుడిని కార్యదర్శిగా నియమించి టోర్నీలో పాల్గొనని వారికి కూడా నగదు తీసుకొని సర్టిఫికెట్లు ఇస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. సదరు వ్యక్తిపై తిరుపతి విజిలెన్స్ కార్యాలయంలో విచారణ చేపట్టారు. ఈ క్రమంలో విచారణకు క్రీడాశాఖ తరపున శాప్ అధికారులు విచారణకు హాజరయ్యారు.

తేలని ఒలింపిక్ సంఘ పంచాయితీ

దాదాపు 10 సంవత్సరాలుగా కోర్ట్ కేసులతో మగ్గిపోతున్న ఆంధ్రప్రదేశ్ ఒలింపిక్ అసోసియేషన్ పంచాయితీ నేటికీ తేలలేదు. రెండు గ్రూపులుగా విడిపోయిన ఒలింపిక్ అసోసియేషన్‌తో పాటు క్రీడా సంఘాలు సైతం రెండుగా విడిపోయిన పరిస్థితి నెలకొంది.

రెండేసి చొప్పున సంఘాలు

ఆంధ్రప్రదేశ్ ఒలింపిక్ అసోసియేషన్, కబడ్డీ, జూడో, హ్యాండ్ బాల్, తైక్వాండో, బేస్ బాల్, వాలీబాల్, చెస్, యోగాసన, బాడీ బిల్డింగ్, షూటింగ్ బాల్ లతో పాటు మరికొన్ని సంఘాలు ఉన్నాయి. ఇదిలా ఉంటే నెట్ బాల్ సంఘం అడ్‌హాక్ కమిటీ పర్యవేక్షణలో ఉండగా రాష్ట్రంలో సైక్లింగ్ అసోసియేషన్‌కు ఫెడరేషన్ గుర్తింపు లేదు. ప్రస్తుతం వాలీబాల్, బేస్ బాల్, కబడ్డీ, జూడో, షూటింగ్ బాల్ ఫెడరేషన్‌లు సైతం రెండు గ్రూపులుగా ఉన్నాయి.


Similar News