సంక్షేమాన్ని మింగేస్తున్న కేంద్రం.. అయినా సైలెంట్!

రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల హామీలను నెరవేర్చేందుకు తాపత్రయం పడుతున్నది.

Update: 2022-12-13 02:02 GMT

రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల హామీలను నెరవేర్చేందుకు తాపత్రయం పడుతున్నది. నవరత్నాలు, సంక్షేమ పథకాల అమలుకు శాయశక్తులా కృషి చేస్తున్నది. అందుకు కేంద్రం పెడుతున్న ఆంక్షలను ఒప్పుకొని ముందుకెళ్తున్నది. ఈ క్రమంలో సంక్షేమ పథకాల లబ్ధి ప్రజల దరి చేరుతున్నప్పటికీ కేంద్రం వడ్డించే భారాల కారణంగా ఆవిరవుతోందని ప్రజల నుంచి ఆవేదన వ్యక్తమవుతున్నది. తాజాగా అమృత్ పథకంతో నీళ్లకు మీటర్లు పెట్టి ప్రజలను ఇబ్బంది పెట్టేందుకు సిద్ధమైంది. నవరత్నాల నిధుల కోసం రాష్ట్ర సర్కారు కేంద్రం విధించే అన్ని షరతులకూ తలొగ్గుతున్నది.

దిశ, ఏపీ బ్యూరో : రాష్ట్రంలో ఏం జరుగుతోందని ఎవరన్నా అడిగితే.. ఇక్కడ ప్రభుత్వం కేంద్రానికి ఊడిగం చేస్తోందంటున్నారు. సంక్షేమ పథకాలకు బటన్​నొక్కి డబ్బులేయడం కోసం కేంద్ర సర్కారు విధించే విషమ షరతులకు డూడూ బసవన్నలా తలూపుతున్నదని చెబుతున్నారు. ఇదేం పాలనంటూ అధికార పార్టీలోనే జోరుగా చర్చ జరుగుతున్నది. 'మేం కులం చూడం.. మతం చూడం.. కేంద్రం ఏది చెబితే అదే చేస్తాం.. మాదారే రహదారి అంటున్న'' వైసీపీ సర్కారు లొంగుబాటు తత్వాన్ని ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రజల్లో వైసీపీ ఉనికే ప్రశ్నార్థకమవుతున్నా ఇంకా మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తోంది. కుబుసాలు కదులుతున్నా ఈసారి 175 స్థానాలను గెల్చుకుంటామంటూ ప్రతిపక్షాలతో మైండ్​గేమ్​ఆడుతోందని పలు విశ్లేషణలు వెలువడుతున్నాయి.

అమలుకు నోచని హామీలెన్నో..

కేంద్రం మెడలు వంచి తెస్తామన్న ప్రత్యేక హోదా నుంచి రాష్ట్ర విభజన అంశాల దాకా ఏ ఒక్కటీ అమలుకు నోచలేదు. విశాఖ రైల్వే జోన్​లేదు. కడప ఉక్కు లేదు. మేజరు పోర్టు లేదు. రెవెన్యూ లోటు భర్తీ చేసిన దాఖలాల్లేవు. పెట్రో కారిడార్ లేదు. విశాఖ–చెన్నయ్ పారిశ్రామిక వాడ లేదు. ఆఖరికి వెనుక బడిన జిల్లాల అభివృద్ధికి బుందేల్​ఖండ్​తరహా ప్యాకేజీ లేదు. ఇవేం చేయకున్నా నదీ జలాల బోర్డులు పెట్టి పొరుగు రాష్ట్రాలతో కయ్యాలు సృష్టించింది. గోదావరి, కృష్ణానదీ జలాల విషయంలో కేంద్రం మితిమీరిన జోక్యం చేసుకుంటోంది. అర్బన్ సంస్కరణల పేరుతో తీసుకొచ్చిన ఆస్తి పన్ను, చెత్త పన్ను. తాజాగా అమృత్​ పథకంతో నీళ్లకు మీటర్లు పెట్టి ప్రజల జేబులు కొట్టేసేందుకు సిద్ధమైంది. అయినా సరే. నవరత్నాల అమలు కోసం మితిమీరిన అప్పులకు ఆమోదించాలంటూ రాష్ట్ర సర్కారు, కేంద్రం విధించే అన్ని షరతులకూ గంగిరెద్దులా తలూపుతోంది.

ప్రైవేటుకు విద్యుత్ సబ్ స్టేషన్లు, హెచ్‌టీ లైన్లు

విద్యుత్​రంగం రాష్ట్ర అవసరాలకు తగ్గట్లుండాలి. కూటికి లేని పేదల దగ్గర నుంచి సంపన్నుల దాకా ఎవరికి ఏ రేటున ఇవ్వాలనేది ప్రభుత్వం నిర్ణయిస్తుంది. దీనికి భిన్నంగా విద్యుత్​ తయారీ, పంపిణీలో కేంద్రం జోక్యం ఎందుకు? ఈపాటికే ప్రైవేటు ఉత్పత్తిదారులు చెప్పిన రేటుకు కరెంటు కొనుగోలు చేస్తున్నారు. ఇప్పుడు పంపిణీలో ప్రైవేటు లాభాల కోసం సంస్కరణలను ప్రవేశపెడుతున్నారు. ప్రభుత్వ రంగంలో కూడబెట్టిన సబ్​స్టేషన్లు, హెచ్ టీ లైన్లు, ఇతర ఆస్తులన్నింటినీ గుండుగుత్తగా ప్రైవేటు ఆపరేటర్లకు అప్పగించేదానికి రాష్ట్ర సర్కారు సిద్ధపడుతోంది. థర్మల్​విద్యుత్​ కేంద్రాలను ప్రైవేటుకు ఇచ్చేట్లు ఒత్తిడి చేస్తున్నారు. చివరకు దీనికి అవసరమైన బొగ్గును విదేశాల నుంచి అధిక ధరకు కొనుగోలు చేయాలంటూ రాష్ట్రంపై ఒత్తిడి చేస్తోంది. త్వరలో ప్రీపెయిడ్​స్మార్టు మీటర్లతో పేద, దిగువ మధ్యతరగతి ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత పెల్లుబుకే అవకాశాలున్నాయి. క్రాస్ సబ్సిడీల్లేని ధరలతో సగటు ప్రజల మూలిగలు పీల్చడానికి కసరత్తు చేస్తున్నారు. దీంతో అన్ని వర్గాల్లో ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది.

తాబేదార్లకు విశాఖ ఉక్కు..

ఉత్తరాంధ్రకు మణిహారంగా నిలవడమే కాదు. రాష్ట్ర తలసరి ఆదాయాన్ని నిర్ణయించే విశాఖ ఉక్కును అత్యంత చౌకగా తాబేదార్లకు కట్టబెట్టేందుకు కేంద్రం రంగం సిద్ధం చేసింది. ప్రజల అభ్యర్థనలు, ఆందోళనలను అసలు పట్టించుకోవడం లేదు. రాష్ట్రంలోని అధికార వైసీపీ, ప్రధాన ప్రతిపక్షాలైన టీడీపీ, జనసేన స్టీల్​ప్లాంటుపై కప్పదాటు వ్యవహారంగా స్పందిస్తున్నాయి. విభజన చట్టం ప్రకారం పోలవరం జాతీయ ప్రాజెక్టు. దీనికయ్యే వ్యయాన్ని కేంద్రం భరించాలి. కాల పట్టికను అనుసరించి పెరుగుతున్న అంచనాల ప్రకారం నిధులు వెచ్చించాలి. దీనికి భిన్నంగా కొర్రీలు వేస్తూ రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆపార్టీని బ్లాక్​మెయిల్ చేస్తోంది. అయినా సరే సదరు పార్టీలు ప్రజలకు వాస్తవాలు చెప్పకుండా మభ్యపెట్టడానికే ప్రాధాన్యమిస్తున్నాయి. ఈ పరిణామాలు ఎక్కడకు దారితీస్తాయోనని రాజకీయ పరిశీలకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

నీటి కుళాయిలకు స్మార్ట్ మీటర్లు

ఈపాటికే వ్యవసాయ కనెక్షన్లకు స్మార్టు మీటర్లు ఏర్పాటుపై అన్నదాతలు కన్నెర్రజేస్తున్నారు. తాజాగా అర్బన్​ప్రాంతాల్లో నీటి కుళాయిలకు మీటర్లు పెట్టే దందాకు సిద్ధమయ్యారు. తొలుత విజయవాడలో ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టడంతో అక్కడ వామపక్షాల ఆధ్వర్యంలో తిప్పిగొడుతున్నారు. ఎఫ్​ఆర్​బీఎం కన్నా అధికంగా అప్పులు తెచ్చుకునేందుకు రాష్ట్ర సర్కారు నీటి మీటర్లకు అనుమతించింది. రేపు ప్రజల నుంచి వ్యతిరేకత ఎదురైతే కేంద్రంపై తోసేసి తాము సేఫ్​సైడ్‌లో ఉండొచ్చని భావిస్తోంది. మొత్తంగా రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని సంక్షేమ పథకాలు అమలు చేసినా చివరకు కేంద్ర సంస్కరణల అమలుతో అన్నీ ఆవిరైపోతున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒంటెత్తు పోకడలతో పోతున్న రాష్ట్ర సర్కారు ఇవన్నీ పట్టించుకుంటుందా? లేదా? అనేది సర్వత్రా చర్చనీయాంశమైంది.  

Also Read...

నేటి నుంచి ఎస్ఎఫ్ఐ జాతీయ మహాసభలు 


Similar News